
కార్పొరేషన్లకు కాసుల గలగల!
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన ఓ హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లకు తలా రూ.100 కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటాయించింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి మాత్రం నిధుల్లో కోతలు పెట్టింది. యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాల అభివృద్ధి పట్ల సీఎం కేసీఆర్ చూపిన ప్రత్యేక చొరవకు తగినట్లుగా ఈ రెండు ఆలయాల అథారిటీలకు చెరో రూ.100 కోట్లు కేటాయించారు.
గత బడ్జెట్‌తో పోల్చితే 2016-17కి సంబంధించిన బడ్జెట్‌లో చెప్పుకోదగిన అంశాలు ఇవే. ఈసారి బడ్జెట్ సందర్భంగా నిర్వహించిన పథకాల పునర్వ్యవస్థీకరణ ప్రభావం పురపాలకశాఖపై స్పష్టంగా కనిపించింది. జలమండలి, హెచ్‌ఎండీఏ, మెట్రో రైలు ప్రాజెక్టులకు గత బడ్జెట్‌లకు ప్రణాళిక పద్దు కింద జరిపిన కేటాయింపులను తాజా బడ్జెట్‌లో ప్రణాళికేతర పద్దు కిందికి మార్చారు.
ప్రణాళికా వ్యయం కింద
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, సీవరేజీ బోర్డు (జలమండలి)కి రూ.1,000 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.200 కోట్లు, హెచ్‌ఎండీఏకు రూ.650 కోట్లు, 14వ ఆర్థిక సంఘం కింద మున్సిపాలిటీలకు రూ.325.23 కోట్లను కేటాయించారు. ఈ పద్దు కింద గత బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీ రోడ్ల అభివృద్ధికి రూ.250 కోట్లు, హరితహారానికి రూ.25 కోట్లను కేటాయించగా... ఈసారి వీటికి మొండిచెయ్యి చూపారు.
మరిన్ని ప్రధాన కేటాయింపులు
* ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు కోసం హెచ్‌ఎండీఏ రూ.235 కోట్ల రుణం
* మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు రూ.140 కోట్లు
* రాష్ట్ర ఆర్థిక సంఘం కింద మున్సిపాలిటీలకు రూ.191.86 కోట్లు, కేంద్ర పథకాలైన అమృత్‌కు రూ.121.63 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.61.09 కోట్లు.
* స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు నిధులు రూ.132.28 నుంచి రూ.66.36 కోట్లకు తగ్గింపు