న్యూఢిల్లీ/తిరువనంతపురం/గువాహటి: భారతదేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 79 శాతం కేసులు కేవలం 30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్ల పరిధిలోనే బయటపడ్డాయని మంత్రుల బృందం(జీవోఎం) వెల్లడించింది. 15వ జీవోఎం సమావేశం శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో జరిగింది. దేశంలో కరోనా తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల్లో 6.92 శాతం మంది మరణించగా, భారత్‌లో 3.23 శాతం మంది ప్రాణాలు కోల్పోయారని జీవోఎం పేర్కొంది.
ఉధృతంగానే కరోనా వ్యాప్తి
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల ఆగడం లేదు. తాజాగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3,976 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా వల్ల 100 మంది మరణించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 81,970కి, మరణాలు 2,649కి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్‌లో యాక్టివ్ కరోనా కేసులు 51,401. ఇప్పటివరకు 27,919 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 34.06కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. తాజాగా నమోదైన 100 మరణాల్లో 44 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి. గుజరాత్‌లో 20 మంది, ఢిల్లీలో 9 మంది, పశ్చిమబెంగాల్‌లో 8 మంది ఉత్తరప్రదేశ్‌లో ఐదుగురు, మధ్యప్రదేశ్‌లో ఐదుగురు కన్నుమూశారు. కరోనా కారణంగా సంభవించిన మరణాల్లో 70 శాతానికి పైగా బాధితులకు ఇతర జబ్బులు కూడా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
20 లక్షలకుపైగా కరోనా టెస్టులు: ఐసీఎంఆర్
దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం నిర్వహించిన ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్య 20 లక్షలు దాటినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. శుక్రవారం ఉదయం వరకు 20,39,952 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. ఇందులో 92,911 పరీక్షలను గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిర్వహించినట్లు వెల్లడించింది. కరోనా టెస్టుల సామర్థ్యాన్ని పెంచుతున్నామని, ప్రస్తుతం రోజుకు దాదాపు లక్ష టెస్టులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది.
ప్రత్యేక రైలులో వచ్చిన వారికి కరోనా
వెయ్యి మంది వలస కూలీలతో కూడిన మొదటి ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి కేరళకు చేరుకుంది. వీ రిలో ఏడుగురికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు పరీక్షలో తేలింది. దాంతో వారిని అధికారులు కరోనా కేర్ సెంటర్లకు, ఆసుపత్రులకు తరలించారు. కాగా,కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని అ స్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ కేంద్రానికి లేఖరాశారు. లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ శుక్రవారం మిజోరం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
79% కేసులు 30 మున్సిపాల్టీల్లోనే..
Published Sat, May 16 2020 3:01 AM | Last Updated on Sat, May 16 2020 8:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment