
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కొత్తగా 60 కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో బీసీలకు 57, ఈబీసీలకు 3 కార్పొ రేషన్లు ఉన్నాయి. బీసీల్లో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ప్లాన్ ‘ఏ’ కింద 16, ప్లాన్ ‘బీ’ కింద మరో 41 కార్పొరేషన్ల ఏర్పా టుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఇవికాకుండా కమ్మ, రెడ్డి, క్షత్రియులకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పొరేషన్ ప్రతిపాదించారు.
ఈ నెల 1న ముఖ్యమంత్రితో బీసీ సంక్షేమ శాఖ సమీక్ష జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాల వాయిదా పడింది. త్వరలో జరగబోయే సమీక్షలో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. బీసీ–ఏ గ్రూపులో ఆదిమ తెగలు, విముక్తి జాతులు, సంచార, సెమీ సంచార జాతుల వారు, బీసీ–బీ గ్రూపులో వృత్తిపరమైన పనులు చేసుకునే, బీసీ–సీ గ్రూపులో క్రైస్తవ మతంలోకి మారిన వారు, బీసీ–డీ గ్రూపులో ఇతర బీసీ కులాల వారు, బీసీ–ఈ గ్రూపులో ముస్లింలలో వెనుకబడిన కులాలున్నాయి. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 30 కార్పొరేషన్లు ఉండగా.. ఇందులో ఈబీసీలకు (కాపు, ఈబీసీ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ) కార్పొరేషన్లు ఉన్నాయి. దేవదాయ శాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ మినహా యించి మిగిలిన ఈబీసీల కార్పొరేషన్లు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకే వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment