సాక్షి, అమరావతి: దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్ నాయకత్వంలో వెనుకబడిన వర్గాలకు స్వర్ణయుగం లాంటి పాలన అందుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీసీలకు రుణాలెక్కడ?’ అంటూ ఈనాడు పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయోజనాల కోసం మభ్యపెట్టే యత్నాలను మానుకోవాలని ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 యాజమాన్యాలకు హితవు పలికారు. బీసీలను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు తన అనుకూల మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బీసీలకు కేవలం రూ.1,626 కోట్ల రుణాలు విదిల్చి రుణగ్రస్తులను చేస్తే సీఎం జగన్ 26 నెలల వ్యవధిలో రూ.69,841.67 కోట్ల మేర బీసీలకు ఆర్థిక తోడ్పాటు అందించి వెన్నెముక వర్గాలుగా నిలబెట్టారని చెప్పారు. బీసీలకు నేరుగా డబ్బులివ్వడం తప్పు అనే రీతిలో ఈనాడు పత్రిక వార్తలను వండి వార్చడం దుర్మార్గమన్నారు. బీసీలను రుణగ్రస్తులుగానే ఉంచాలనే చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీల జీవితాలను మరింత కుంగదీయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
నేరుగా ఖాతాల్లోకే నగదు
బీసీలను రుణాల నుంచి విముక్తులను చేసేలా మధ్యవర్తులకు తావులేకుండా ప్రతి పైసాను నేరుగా లబ్ధిదారులకే అందిస్తూ సీఎం జగన్ పారదర్శక పాలనతో దేశంలోనే ఆదర్శంగా నిలిచారని మంత్రి వేణు పేర్కొన్నారు. 26 నెలల కాలంలో 4.4 కోట్లకుపైగా బీసీ లబ్ధిదారులకు నేరుగా, పరోక్షంగా రూ. 69,841.67 కోట్లు అందించారని వివరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు కలిగిన ప్రయోజనాల్లో బీసీలకు 50.11 శాతం మేర లబ్ధి చేకూరగా సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చులో బీసీలకు 49.66 శాతం దక్కిందన్నారు. పలు సంక్షేమ పథకాల ద్వారా 3.24 కోట్ల మందికిపైగా బీసీ లబ్ధిదారులకు రూ.50,495.28 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ (డీబీటీ) చేశామన్నారు. ఏడు పథకాల ద్వారా 1,21,52,921 మంది బీసీలకు రూ.19,346.39 కోట్ల మేర పరోక్షంగా లబ్ధి చేకూరిందని వివరించారు.
చరిత్రను తిరగరాస్తున్న సీఎం జగన్
బీసీలు చంద్రబాబు పాలనలో అణచివేతకు గురైతే సీఎం జగన్ పాలనలో ఎదుగుతున్నారని మంత్రి వేణు పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెన్నెముకగా నిలిపేలా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను బీసీలంతా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నామినేటెడ్ పదవులను బీసీలకు కట్టబెట్టడం, ముఖ్యంగా మహిళలకు 50 శాతానికిపైగా పదవులు దక్కడం ఒక చరిత్ర అన్నారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు ప్రతి కార్పొరేషన్‌కూ 12 మంది డైరెక్టర్లు ఉండేలా నియామకాలు చేశామన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లలో 29 పోస్టులు, 672 మంది డైరెక్టర్లలో 339 పదవులను మహిళలకే అప్పగించడం ద్వారా మహిళా సాధికారతలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్, మహాత్మ జ్యోతిబా పూలే బాటలో నడుస్తూ మహిళాభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సీఎం జగన్ చరిత్రలో నిలుస్తారన్నారు. వెనుకబడిన వర్గాలకు ఇన్ని పదవులు ఇవ్వటం, అందులో సగం మహిళలకు దక్కటం ఎక్కడైనా చూశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ రోజూ మహిళలకు గౌరవం ఇవ్వలేదని, బీసీలను తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించారని గుర్తు చేశారు.
బాబు పాలనలో పింఛన్‌కూ లంచమే..
చంద్రబాబు పాలనలో లంచం ఇవ్వనిదే ఏ పని జరిగేది కాదని, జన్మభూమి కమిటీలు పింఛన్ మంజూరు కూడా లంచాలు గుంజిన సంగతి అందరికీ తెలుసని మంత్రి వేణు గుర్తు చేశారు. బీసీలకు రుణాలు, పింఛన్, ఇళ్ల స్థలం, రేషన్‌కార్డు ఏది కావాలన్నా లంచం ఇవ్వనిదే కనికరించిన పరిస్థితిని చంద్రబాబు హయాంలో చూశామన్నారు. చంద్రబాబు సొంత కులానికి మినహా ఇతరులకు చేసింది ఏమీ లేదన్నారు. తమకు తెలియకుండా మీటర్లు బిగించారని శ్రీకాకుళం జిల్లా జములూరు మండలానికి చెందిన రైతు కింజారపు సత్యన్నారాయణ చెప్పినట్లు ఈనాడులో ప్రచురించిన కథనంలో నిజం లేదన్నారు. ఈమేరకు రైతు సత్యన్నారాయణ ఖండనను మంత్రి వేణు విలేకరులకు వినిపించారు.
బీసీలకు ఇది స్వర్ణయుగం
Published Tue, Aug 24 2021 4:48 AM | Last Updated on Tue, Aug 24 2021 4:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment