
సాక్షి, అమరావతి: సంక్షేమ శాఖలు 2019–20 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేశాయి. బుధవారం ఆర్థిక శాఖ ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు లక్ష్యంగా బడ్జెట్ నివేదికలు సిద్ధమవుతున్నాయి. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నవరత్నాలను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం బీసీల సంక్షేమానికి 2019–20 సంవత్సరంలో రూ.15వేల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ అంచనాలు తయారు చేసి సమర్పించింది. ఎస్సీల సంక్షేమానికి రూ.4వేల కోట్లకు పైగా, ఎస్టీల సంక్షేమానికి రూ.3,400 కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించి ఆర్థిక శాఖకు పంపించారు.
మైనార్టీల సంక్షేమానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.1,300 కోట్లు కేటాయించగా కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.1,800 కోట్లుగా ఉంది. ఇవన్నీ ప్రతిపాదనలు మాత్రమే కావడంతో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే బడ్జెట్‌ను బాగా పెంచాల్సి వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. నేరుగా లబ్ధిదారునికి నగదు రూపంలో అందే పథకాలు ఎక్కువగా ఉన్నందున సంవత్సరానికి ఆయా కుంటుంబాలకు ఎంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందో లెక్కలు వేసి బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. మ్యానిఫెస్టో ప్రకారం బడ్జెట్ అంచనాలు తయారు చేయాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం సూచన చేసింది.
బీసీ సంక్షేమానికి సంబంధించి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ అంచనాలు తయారు చేస్తే సుమారు రూ.15 వేల కోట్ల వరకు వచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్ చెప్పారు. మైనార్టీ సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, బడ్జెట్‌లో రూ.1,800 కోట్ల వరకు అవసరం అవుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాంగోపాల్ తెలిపారు. ప్రతి సంక్షేమ శాఖలోనూ బడ్జెట్‌పై కసరత్తు పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment