Welfare Departments
-
విదేశాలకు వెళ్లాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సాయం అందించే ఓవర్సీస్ విదేశీ విద్యానిధి పథకాల లబ్ధిదారుల ఖరారు అంశం పెండింగ్‌లో పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొంతకాలం ఆపేయాలని నిర్ణయించాయి. వివిధ సంక్షేమ శాఖలు క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరించడంతోపాటు ఆయా విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశాయి. మెరిట్ ఆధారంగా వడపోసినప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం ప్రకటించలేదు. నెలన్నరపాటు వివిధ దశల్లో వడపోత చేపట్టినా... సకాలంలో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు ఒక్కసారిగా ఈ ప్రక్రియను నిలిపివేశాయి. విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు పక్షం రోజులవుతోంది. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ మే 13తో పూర్తి కానుంది. కానీ దేశవ్యాప్తంగా జూన్ 1న ఎన్నికలు ముగియనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అప్పటివరకు కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటివరకు విదేశీ విద్యానిధి పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితా వెలువడే అవకాశం లేదు. ఈ క్రమంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విదేశీ వర్సిటీల్లో ఏప్రిల్ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే సంక్షేమ శాఖలు ఓవర్సీస్ విద్యానిధి లబ్ధిదారుల ఎంపికను జనవరిలోనే మొదలుపెడతాయి. దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన, ఇతర ప్రక్రియ పూర్తి చేసి మార్చి మొదటి వారంలో లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసేది. కానీ ఈ దఫా అర్హుల జాబితా విడుదలలో జాప్యం జరిగింది. విదేశీ విద్యానిధి సాయం వస్తుందన్న ఆశతో వందల సంఖ్యలో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అప్పు చేసి మరీ... ఈ పథకం కింద అర్హత సాధిస్తేనే ఉన్నత విద్యలో చేరేందుకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండగా... ఇప్పుడు పథకం కింద లబ్ధి చేకూరుతుందా? లేదా? అనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో విదేశాలకు వెళ్లాలా? వద్దా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరికొందరు మాత్రం అర్హత సాధిస్తామనే ధీమాతో అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విమానం టికెట్లు బుక్ చేసుకుని గడువులోగా యూనివర్సిటీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓవర్సీస్ విద్యానిధి కింద బీసీ సంక్షేమ శాఖ ద్వారా 300 మందికి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి 350 మందికి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 500 మందికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఉన్నత విద్యా కోర్సు పూర్తి చేసే వరకు రూ.20 లక్షలు రెండు వాయిదాల్లో ఇస్తారు. ఈ మొత్తాన్ని సదరు విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. -
మరో రెండు నెలలు నిరీక్షణే...!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల్లో బిల్లుల క్లియరెన్స్‌కు నిరీక్షణ తప్పేలా లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిధుల విడుదలకు కొంతకాలం బ్రేక్ పడనున్నట్లు అధికారవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం నుంచి చెల్లింపులకు రెండు, మూడు త్రైమాసికాలు అత్యంత కీలకం. తొలి త్రైమాసికంగా బడ్జెట్ సర్దుబాట్లు, ఇతరాత్రా కారణాలతో చెల్లింపుల ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఆ తర్వాత నుంచి నిధుల లభ్యత, ప్రాధాన్యతలకు అనుగుణంగా చెల్లింపుల్లో వేగం పుంజుకుంటుంది. కానీ ఈసారి సంక్షేమ శాఖలకు రెండో త్రైమాసికంలో నిధులు విడుదల కాలేదు. పలు రకాల చెల్లింపులు నిలిచిపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ప్రధానంగా పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు భారీగా పేరుకుపోయాయి. సంక్షేమ శాఖలు ఆమోదించి ఖజానా విభాగానికి పంపించినప్పటికీ అక్కడ క్లియరెన్స్ రాని బిల్లులు దాదాపు రూ.1,175 కోట్లు ఉన్నాయి. ఇవిగాకుండా సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన డైట్ చార్జీలు మరో రూ.675 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.1,850 కోట్లు ఖజానా విభాగంలో పెండింగ్‌లో ఉండగా... ఇవి రెండో త్రైమాసికంలో వస్తాయని అధికారులు భావించారు. చివరి నిమిషం వరకు సంక్షేమాధికారులు వేచిచూసినప్పటికే నిరాశే మిగిలింది. ఈ క్రమంలో మూడో త్రైమాసికంలోనైనా ఈ నిధులకు మోక్షం కలుగుతుందని భావించినప్పటికీ ఎన్నికల నేపథ్యంలో వాటి విడుదలలో జాప్యం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. చివరి క్వార్టర్‌పైనే ఆశలు... విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద దాదాపు 12.65లక్షల మంది లబ్ధిదారులుంటారు. వీరితో పాటు మరో 10 లక్షల మంది గురుకుల విద్యా సంస్థలు, సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్నారు. ఈ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ఎంతో కీలకం. కోర్సును ముందుకు సాగించాలన్నా... వసతిగృహంలో ఉండాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే దిక్కు. కొంతకాలంగా ఈ రెండు పథకాలకు, డైట్ చార్జీల విడుదలలోనూ జాప్యం చేస్తూ వచ్చింది. క్షేత్రస్థాయి నుంచి గురుకులాలు, వసతిగృహాలు, సంక్షేమ అధికారుల ద్వారా ఆమోదం పొందిన బిల్లులన్నీ ఖజానా విభాగంలో నిలిచిపోయాయి. గతేడాది నవంబర్ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉపకారవేతన నిధుల విడుదల నిలిచిపోయింది. ఇవన్నీ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించినవే. ఇవిగాకుండా 2022–23 విద్యా సంవత్సరం దరఖాస్తు పరిశీలన. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు బిల్లులు రూపొందించి ఆమోదించిన బిల్లులకు గత రెండు త్రైమాసికాల్లో రిక్తహస్తం చూపిస ప్రభుత్వం మూడో త్రైమాసికంలోనైనా నిధులు విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత... చివరి త్రైమాసికంలోనే నిధులు విడుదలయ్యే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
నేటి నుంచి జీ–20 వ్యవసాయ సదస్సు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: ఈ ఏడాది జీ–20 సమావేశాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ‘వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయం’అనే అంశంపై చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ‘ది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్’, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలు సెప్టెంబర్ 4, 6 తేదీల మధ్య జరగనున్న ఈ చర్చలకు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే హజరు కానున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్లో 100 మంది దేశ, విదేశీ ప్రతినిధులు వ్యవసాయ పరిశోధనలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అంశాలపై చర్చలు జరపనున్నారు. జీ–20 సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రతినిధులు భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్యకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌ను సందర్శించనున్నారు. విదేశీ ప్రతినిధులకు దేశ సంస్కృతిని పరిచయం చేసే ఉద్దేశంతో వారిని హైదరాబాద్‌లోని శిల్పారామానికి తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ప్రతినిధులందరూ ఐసీఏఆర్ క్రిడాలోని పరిశోధన క్షేత్రంలో పంటలను, వాటి నిర్వహణ పద్ధతులను పరిశీలించనున్నారు. -
ప్రాధాన్యతలిస్తే పరిశీలిస్తాం..
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం కోత పెట్టిన నేపథ్యంలో శాఖల వారీగా ప్రాధాన్యతలకు అదనపు నిధులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించిన అధికారులు.. తాజాగా అత్యవసర కేటగిరీలో ఉన్న కార్యక్రమాలను పూర్తిచేసుకునేం దుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శాఖల వారీగా ప్రాధాన్యత అంశాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రతిపాదనలు స్వీకరించే పనిలో పడ్డారు. ఈ మేరకు సంక్షేమ శాఖలకున్న ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా వారం రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని సంక్షేమ శాఖలకు ఆర్థిక శాఖ సూచనలు చేసింది. డైట్‌కు.. రైట్ రైట్.. సంక్షేమ శాఖల పరిధిలో అత్యవసర కేటగిరీలో వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిళ్లను చేర్చారు. వీటిల్లో డైట్ చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపుల్లో కోత పడటంతో డైట్ చార్జీల చెల్లింపులకు ఇబ్బందులు రాకుంగా జాగ్రత్త వహించాలని ఆయా శాఖలకు సూచనలు చేసింది. ఈ క్రమంలో డైట్ చెల్లింపుల్లో జాప్యం జరగకుండా వీటిని అవసరమైనంత త్వరితంగా పరిష్కరిస్తామని, నిధుల అవసరాలను ఎప్పటికప్పుడు వివరించాలని ఆదేశించింది. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో నిర్వహణను కూడా ప్రాధాన్యత కేటగిరీలో చేర్చింది. తాజా బడ్జెట్లో గురుకుల సొసైటీలకు గతేడాది కంటే కేటాయింపులు తక్కువగా జరిగాయి. అయినప్పటికీ వీటి నిర్వహణకు సంబంధించి నిధులను గ్రీన్‌చానల్ పద్ధతిలో ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సుముఖత తెలిపింది. విద్యార్థుల ఉపకారవేతనాలకు కూడా ఇబ్బందులు లేకుండా సంక్షేమ శాఖల వారీగా అంచనాలను పంపితే త్రైమాసిక నిధుల్లో విడుదల చేయనున్నట్లు వివరించింది. సంక్షేమ శాఖల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే స్వయం ఉపాధి పథకాలు, రాయితీ పథకాలకు సంబం ధించి ఈ ఏడాది కేటాయింపులు లేవని స్పష్టమవుతోంది. అదేవిధంగా సివిల్ వర్క్స్‌కు కూడా ఈ వార్షికంలో అనుమతులు ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ కేటగిరీల్లో ఎలాంటి ప్రతిపాదనలు పంపడం లేదని తెలుస్తోంది. ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు రూపొం దించి వారంలోగా ప్రభుత్వానికి సమర్పిస్తే వాటిని పరిశీలించి ఆమోదిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
నవరత్నాలకు అనుగుణంగా బడ్జెట్ అంచనాలు
సాక్షి, అమరావతి: సంక్షేమ శాఖలు 2019–20 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేశాయి. బుధవారం ఆర్థిక శాఖ ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు లక్ష్యంగా బడ్జెట్ నివేదికలు సిద్ధమవుతున్నాయి. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నవరత్నాలను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం బీసీల సంక్షేమానికి 2019–20 సంవత్సరంలో రూ.15వేల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ అంచనాలు తయారు చేసి సమర్పించింది. ఎస్సీల సంక్షేమానికి రూ.4వేల కోట్లకు పైగా, ఎస్టీల సంక్షేమానికి రూ.3,400 కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించి ఆర్థిక శాఖకు పంపించారు. మైనార్టీల సంక్షేమానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.1,300 కోట్లు కేటాయించగా కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.1,800 కోట్లుగా ఉంది. ఇవన్నీ ప్రతిపాదనలు మాత్రమే కావడంతో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే బడ్జెట్‌ను బాగా పెంచాల్సి వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. నేరుగా లబ్ధిదారునికి నగదు రూపంలో అందే పథకాలు ఎక్కువగా ఉన్నందున సంవత్సరానికి ఆయా కుంటుంబాలకు ఎంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందో లెక్కలు వేసి బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. మ్యానిఫెస్టో ప్రకారం బడ్జెట్ అంచనాలు తయారు చేయాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం సూచన చేసింది. బీసీ సంక్షేమానికి సంబంధించి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ అంచనాలు తయారు చేస్తే సుమారు రూ.15 వేల కోట్ల వరకు వచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్ చెప్పారు. మైనార్టీ సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, బడ్జెట్లో రూ.1,800 కోట్ల వరకు అవసరం అవుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాంగోపాల్ తెలిపారు. ప్రతి సంక్షేమ శాఖలోనూ బడ్జెట్‌పై కసరత్తు పూర్తయింది. -
‘ఫీజు’ బకాయిలు రూ. 361 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ నిధుల విడుదలలో నెలకొన్న జాప్యం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తాయేమోనన్న భయం వారిలో నెలకొంది. వాస్తవానికి విద్యాఏడాది ముగిసే నాటికి ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు సంతృప్తికర స్థాయిలో నిధులిచ్చిన ప్రభుత్వం... బీసీ సంక్షేమ శాఖకు మాత్రం అంతంతమాత్రంగానే నిధులు విడుదల చేసింది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులున్న ఆ శాఖలో ఇప్పుడు బకాయిలు భారీగా పేరుకుపోయాయి. రెండొంతులు బీసీలవే... 2017–18 విద్యా ఏడాదికి సంబంధించి ఇంకా రూ. 361 కోట్ల మేర ఫీజులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇందులో బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన బకాయిలే రూ. 220 కోట్లు ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వార్షిక సంవత్సరం ముగుస్తుండటంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు తమ వద్ద అందుబాటులో ఉన్న నిధులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తున్నప్పటికీ బీసీ సంక్షేమశాఖ వద్ద మాత్రం నిధులు నిండుకోవడంతో చేతులెత్తేసింది. ఎన్నికల కోడ్ రావడంతో నిధుల విడుదలలోనూ జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది విద్యార్థులకు సమస్యలు తప్పవనిపిస్తోంది. ప్రస్తుత వార్షిక సంవత్సరం నుంచి నెలవారీగా నిధులు విడుదల చేసినప్పటికీ సీలింగ్ ప్రకారం వెళ్లడంతో తక్కువగా నిధులు వచ్చాయి. దీంతో రూ. 361 కోట్ల మేర బకాయిలు మిగిలిపో యాయి. ప్రభుత్వం అదన పు నిధులు కేటాయిస్తే సమ స్యకు పరిష్కారం దొరుకుతుందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పరిశీలనలోనే దరఖాస్తులు... 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి నెలాఖరుతో ముగిసింది. దాదాపు 13 లక్షల దరఖాస్తులు వచ్చాయి. స్వీకరణ ప్రక్రియ సుదీర్ఘకాలంపాటు సాగడంతో వాటి పరిశీలన సైతం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు కేవలం 14% దరఖాస్తులనే పరిశీలించారు. మిగతా వాటిని వేగంగా పరిశీలించి అర్హతను నిర్ధారించాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యల్లో వేగం పెంచారు. ఈసారి వచ్చిన దరఖాసులను ప్రాథమికంగా అంచనా వేసిన సంక్షేమాధికారులు... ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల చెల్లింపులకు రూ. 2,250 కోట్లు అవసరమని భావిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తున్న క్రమంలో ప్రాధాన్యతల ప్రకారం ఫీజులివ్వలని సంక్షేమాధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసే నిధుల ప్రకారం మంజూరు చేసేలా సంక్షేమ శాఖలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. -
అధికారికంగా బౌరాపూర్ భ్రమరాంబ జాతర
సాక్షి, హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని చెంచు తెగలు ఏటా నిర్వహించే బౌరాపూర్ భ్రమరాంబ జాతరకు ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ఇకపై ఏటా నిర్వహించే ఈ జాతరకు ప్రభుత్వమే నిధులిచ్చి నిర్వహించనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖకు స్పష్టం చేసింది. శివరాత్రి సందర్భంగా నాగర్‌కర్నూ ల్ జిల్లా లింగాల మండలం బౌరాపూర్‌లో ఈ జాతర నిర్వహిస్తారు. ఈ గ్రామం నల్లమల అటవీ ప్రాం తంలో ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే ప్రధాన రోడ్డు నుం చి 30 కి.మీ. మేర లోనికి నడుచుకుంటూ వెళ్లాలి. క్రూర మృగాలున్న ఈ అడవిలోకి ప్రవేశాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. జాతర నేపథ్యంలో వారం పాటు ప్రవేశానికి ప్రభుత్వం అనుమతినిస్తుంది. జాతరకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక రోడ్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో చెంచుల సాంప్రదాయాల ప్రకారం ఉత్సవాలను నిర్వహిస్తారు. -
పైసా విదల్చలేదు !
సాక్షి,హైదరాబాద్: సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న వసతి గృహాలు నిధుల లేమితో సతమతమవుతున్నాయి. నెలవారీ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో వాటి నిర్వహణ గందరగోళంగా మారింది. నిధుల లేమితో హాస్టళ్లను నిర్వహించలేమని వసతిగృహ సంక్షేమాధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో దాదాపు 1,956 వసతిగృహాల్లో దాదాపు 2లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతిగృహాల్లో వీరికి ఉదయం పాలు, స్నాక్స్‌తో పాటు సాయంత్రం భోజనాన్ని అందిస్తారు. మధ్యాహ్నం మాత్రం పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనాన్ని తీసుకుంటారు. ఈమేరకు ప్రభుత్వం నెలవారీగా వసతిగృహ సంక్షేమాధికారులకు నిధులు విడుదల చేస్తుంది. సాధారణంగా ఈ హాస్టళ్లకు ముందస్తు నిధులు కాకుండా నెల గడిచిన తర్వాత నిధులివ్వడం జరుగుతోంది. ఈ క్రమంలో వసతిగృహ సంక్షేమాధికారి హాస్టల్‌కు కావాల్సిన సరుకులను అరువుపై తెచ్చి నిర్వహిస్తున్నారు. నెల గడిచిన వెంటనే బిల్లులు సమర్పిస్తే...ఆమేరకు ప్రభుత్వం నిధులిచ్చేది. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి నిధుల సమస్యతో హాస్టళ్లు సతమతమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టళ్లకు తొలి మూడు నెలలు అరకొరగా నిధులు విడుదలైనప్పటికీ...బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లకు మాత్రం ఇప్పటివరకూ పైసా అందకపోవడంతో ఆయా వసతిగృహ సంక్షేమాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన బకాయిలు బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాలకు నిలిచిపోయిన నిధులకు సంబంధించి మెస్‌చార్జీలే అధికంగా ఉన్నాయి. విద్యుత్ చార్జీలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, తదితర నిర్వహణకు సంబంధించిన బిల్లులు కూడా పెడింగ్‌లోనే ఉన్నాయి. ఈ బకాయిలు దాదాపు రూ.వంద కోట్ల వరకు ఉన్నట్లు సంక్షేమాధికారులు అంచనా వేస్తున్నారు. కిరాణా షాపుల్లో అరువు పద్ధతిలో సరుకులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో షాపు యాజమానులు సరుకులు నిలిపివేస్తున్నారని సంక్షేమాధికారులు చెబుతున్నారు. కూరగాయల వ్యాపారులు సైతం సరుకులు ఇవ్వడాన్ని నిలిపివేశారని మేడ్చల్ జిల్లాకు చెందిన వసతిగృహ సంక్షేమాధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. -
కీలకం.. మూడో త్రైమాసికం!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖలు నిధులకోసం ఎదురు చూస్తున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో గడిచిన రెండు త్రైమాసికాల్లో ప్రభుత్వం నుంచి అరకొర నిధులే విడుదల కావడంతో పలు కార్యక్రమాలు వాయిదా వేస్తూ వచ్చిన అధికారులు.. మూడో త్రైమాసికంలో పెద్దమొత్తంలో నిధులకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరుతో అర్ధవార్షికం ముగిసింది. ఈ క్రమంలో ఈనెలాఖరులో మూడో క్వార్టర్ నిధులు వస్తాయని భావించిన అధికారులకు ఎదురుచూపులే మిగిలాయి. నిధుల విడుదలకోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో యంత్రాంగం వేచిచూసే ధోరణిలో ఉంది. కీలక పథకాలన్నీ డీలా! చాలినన్ని నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో పలు కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలయ్యే ప్రధాన కార్యక్రమం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్. ఈ రెండు పథకాల కింద ఆయా శాఖల వద్ద 38వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిశీలన పూర్తి చేసిన అధికారులు ఆమేరకు మంజూరీలు కూడా ఇచ్చారు. కానీ సంక్షేమ శాఖల వద్ద నిధులు లేకపోవడంతో అవన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయి. గత రెండు త్రైమాసికాల్లో ఈ పథకాలకు పెద్దగా నిధులివ్వలేదు. ప్రస్తుతం ఈ రెండు పథకాల కింద రూ.400 కోట్లు అవసరం. తాజాగా మూడో త్రైమాసికంలో ఈమేరకు నిధులు విడుదల చేస్తే పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలగనుంది. మరోవైపు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల బకాయిలు సైతం కుప్పలుగా పేరుకుపోయా యి. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.868.55 కోట్లు అవసరమని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు సంబంధించి దాదాపు ఐదు నెలలుగా సరైన మోతాదులో బడ్జెట్ విడుదల కాలేదు. మెస్ చార్జీలు, నిర్వహణ, కరెంటు బిల్లులు, పిల్లల దుస్తులకు సంబంధించిన కుట్టు కూలీ కలిపి రూ.125 కోట్లకు పైగా బకాయిలున్నాయి. కార్పొరేషన్లలో దా‘రుణం’... స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించే నిరుద్యోగ యువత ప్రథమంగా ఎదురు చూసేది కార్పొరేషన్ రుణాలకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు 2018–19 వార్షిక సంవ త్సరంలో దాదాపు 6.45లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు కూడా కలుపుకుంటే దాదాపు 8లక్షలకు పైమాటే. కానీ ఈ ఏడాది కార్పొరేషన్ రుణాల పంపిణీ ఆశాజనకంగా లేదు. రెండేళ్ల క్రితం దరఖాస్తులను ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా పరిష్కరిస్తుండగా... బీసీ, ఎంబీసీ, మైనార్టీ కార్పొరేషన్లు మాత్రం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో దిక్కులు చూస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత బీసీ కార్పొరేషన్‌కు రూ.350 కోట్లు విడుదల చేశారు. 38వేల మంది నిరుద్యోగులకు రూ.50వేలలోపు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయగా... ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటిని సైతం వాయిదావేశారు. మైనార్టీ కార్పొరేషన్‌కు సైతం ప్రత్యేకంగా నిధులు విడుదల కాకపోవడంతో దరఖాస్తు పరిశీలనను ఆ శాఖ అధికారులు అటకెక్కించారు. -
ప్రభుత్వానికి ఈ ఏడాదంతా పరీక్షే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరమంతా పరీక్షేనని, డిసెంబర్ లోగా అన్ని పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆయన బుధవారం సంక్షేమ శాఖల పనితీరుపై ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరేలా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది ఎక్కువ మందికి ఫలితాలు అందే పథకాలను అమలు చేయాలన్నారు. జిల్లాల్లో అక్కడి పరిస్థితులను బట్టి పథకాల అమలు ఉండాలన్నారు. ప్రజలకు స్వల్ప కాలంలో అత్యధిక లబ్ధి చేకూరాలన్నారు. పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అన్ని సంక్షేమ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో వైఫై కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు ఉండాలన్నారు. వివిధ సంక్షేమ శాఖలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు, చేసిన ఖర్చుల గణాంకాలను అధికారులు సీఎంకు వివరించారు. పథకాల అమల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కుప్పం ఓటర్ల రుణం తీర్చుకోలేనిది చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గ టీడీపీ ప్రజాప్రతినిధులతో గ్రీవెన్స్ హాల్లో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా వరుసగా తనను గెలిపిస్తున్న కుప్పం ఓటర్ల రుణం తీర్చుకోలేనిదన్నారు. రాష్ట్రంలో మరో 14 డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ బాధితుల కోసం రాష్ట్రంలో మరో 14 చోట్ల డయాలసిస్ (రక్తశుద్ధి) కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాడేరు, రంపచోడవరం, తుని, అమలాపురం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసరావుపేట, మాచర్ల, ఆత్మకూరు, మదనపల్లి, కుప్పం, కదిరి, రాయచోటి, ఆదోని పట్టణాల్లో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్న వారికి కూడా పింఛన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఎ.కొండూరులో కిడ్నీ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లా కనిగిరి, కృష్ణా జిల్లా ఎ.కొండూరు ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. -
నెలాఖరులోగా స్కాలర్షిప్లు!
సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీకి సంక్షేమ శాఖలు కసరత్తు ప్రారంభించాయి. కోర్సు ముగిసేలోగా స్కాలర్ షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించాయి. 2017–18 విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 13.28 లక్షలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని శాఖలవారీగా విభజించి.. ప్రత్యేకాధికారులను నియమించి దరఖాస్తుల పరీశీలన చేపట్టింది. ముందుగా జనరల్ కోర్సులకు... వృత్తి విద్యా కోర్సులు ఏప్రిల్ నెలాఖరులోగా ముగియనున్నాయి. ఈ క్రమంలో ముందుగా జనరల్ కోర్సుల విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాలని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థుల దరఖాస్తులను ముందుగా పరిశీలిస్తున్నారు. మొదటగా చివరి సంవత్సరం విద్యార్థులకు, ఆ తర్వాత జూనియర్లకు ఉపకారవేతనాలు ఇవ్వనున్నారు. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలకు సంక్షేమ శాఖల వద్ద నిధులు అందుబాటులో ఉన్నాయి. మూడో త్రైమాసికంతోపాటు త్వరలో విడుదల కానున్న నాల్గో త్రైమాసికం నిధుల నుంచి వీటిని విడుదల చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖతోపాటు గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలు స్కాలర్షిప్ క్లియరెన్స్ బిల్లులను తయారు చేస్తున్నారు. వచ్చేవారం నుంచి ఆయా బిల్లులను ఖజానా శాఖకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఉపకార దరఖాస్తుకు గడువు పూర్తి
- రెండు నెలలు పొడిగించాలన్న సంక్షేమ శాఖలు - వెలువడని ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరాని (2017–18)కి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల సమర్పణకు గడువు బుధవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 13.5 లక్షలమంది విద్యార్థులు ఉంటారని సంక్షేమశాఖలు అంచనా వేశాయి. అయితే, ఇప్పటివరకు 5.2లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో గడువును 2 నెలలు పొడిగించాలంటూ 15 రోజుల క్రితమే ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈనెల 30లోగా ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుందని ఎస్సీ అభివృద్ధి శాఖ భావించింది. అయితే, బుధవారం సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో వెబ్సైట్లో తేదీ పెంపును పక్కనపెట్టింది. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఒకరు సాక్షితో అన్నారు. ప్రవేశాలు పూర్తికానందునే.. జూనియర్ కాలేజీలతో పాటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈపాస్ వెబ్సైట్లో కళాశాలల రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు. దీంతో ఉపకారవేతనాలు, ఫీజు పథకాలకు సంబంధించి ఎక్కువమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో పొడిగింపు అనివార్యమైంది. -
‘విద్యానిధి’.. స్పందన హతవిధి!
- రూ.20 లక్షల సాయమిస్తామన్నా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు - నాలుగేళ్లుగా అర్హత సాధించింది 396 మందే - పథకంపై ప్రచారం చేయని సంక్షేమ శాఖలు సాక్షి, హైదరాబాద్: ‘విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సాయం రూ.20 లక్షలు. ఈ నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకేముంది ఈ పథకాన్ని బోలెడు మంది సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నారా..? అదేం లేదు.’ఇంతటి బృహత్తర అవకాశం ఉన్నప్పటికీ... అందిపుచ్చుకునే అభ్యర్థులు మాత్రం కరువయ్యారు. ఎస్సీ, ఎస్టీలలోని ప్రతిభావంతులైన పేద విద్యార్థుల్లో ఏటా ఆరు వందల మందికి ఈ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... క్షేత్రస్థాయి నుంచి కనీసం 30 శాతం దరఖాస్తులు మించడం లేదు. వీటిలో అర్హత సాధించేది పదిహేను శాతం లోపే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దుస్థితి ఇది. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హత సాధించిన లబ్ధిదారుకు రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తంతో విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఆపై విద్య అభ్యసించవచ్చు. గతంలో రూ.10 లక్షలుగా ఉన్న ఈ ఆర్థిక సాయం... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం రెట్టింపు చేసింది. బ్యాచ్‌లర్ డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించి, రూ.రెండు లక్షలలోపు కుటుంబ వార్షికాదాయం ఉంటే చాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. శాఖాపరమైన మౌఖిక పరీక్షలో నెగ్గి, యునైటెడ్ స్టేట్స్ (యూఎస్), యునైటెడ్ కింగ్డమ్ (యూకే), సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ సీటు సాధించి ప్రయాణ ఖర్చులు భరిస్తే చాలు... పథకం కింద ఎంపికైన విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున రెండు విడతల్లో రూ.20 లక్షలు బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది. సులభతరమైన నిబంధనలున్నప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడం గమనార్హం. లక్ష్య సాధనలో అధ్వానం... అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం లక్ష్యాల సాధన గత నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతోంది. నాలుగేళ్ల కాలంలో ఎస్సీ అభివృద్ధి శాఖకు 1,200 యూనిట్లకు గాను కేవలం 331 మందికి రూ.66.20 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో కేవలం 65 మందికి రూ. 13 కోట్లు సహాయాన్ని విద్యార్థుల ఖాతాలో జమచేశారు. లక్ష్యాల మేరకు నిధులున్నప్పటికీ... అర్హులు లేకపోవడంతో మిగులు మొత్తాన్ని ఆ శాఖ అధికారులు వెనక్కు పంపించేస్తున్నారు. తాజాగా వెనుకబడిన తరగతుల వర్గాల్లోని పేద విద్యార్థుల కోసం మహాత్మ జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 2016–17 వార్షికంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా 3వందల మందికి ఆర్థిక సాయం అందించే వెసులుబాటు కల్పించింది. ఈమేరకు గతవారం వరకు ఆ శాఖ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. కానీ క్షేత్రస్థాయి నుంచి 230 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సోమవారం ఇంటర్వూ్యలు నిర్వహించగా... అర్హుల జాబితాను ఖరారు చేయాల్సి ఉంది. -
సంక్షేమం, కార్పొరేషన్ల కలిపివేతలో మార్పులు
హన్మకొండ అర్బన్ : అన్ని సంక్షేమ శాఖ లు, కార్పొరేషన్లు ఒకే గొడుగు కిందికి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా కొన్నిమార్పులు చేసింది. బీసీ సంక్షేమ, బీసీ కార్పొరేషన్, దళిత సంక్షేమం, కార్పొరేషన్, మైనార్టీ సంక్షేమం, కార్పొరేషన్, ఎస్టీ సంక్షేమం, కార్పొరేషన్లను రెండింటిని ఒకే అధికారి పరిధిలోకి తేవాలని నిర్ణయిం చింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల ని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా బీసీ సంక్షేమం, కార్పొరేషన్లో ఇప్పటికే ఉమ్మడి జాబితాను ప్రభుత్వానికి పంపారు. -
ఎస్టీ, బీసీలకు డ్రైవింగ్‌లో శిక్షణ
* మారుతీ సంస్థ సహకారం * స్వతంత్ర సంస్థ ద్వారా శిక్షణపై పర్యవేక్షణ సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా శిక్షణ, నైపుణ్యాల మెరుగుదలకు సంక్షేమ శాఖలు చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ర్ట ప్రభుత్వ ఆమోదముద్ర పడిన వెంటనే ఈ పథకాలు అమలులోకి రానున్నాయి. షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందినవారికి మారుతీ మోటార్స్ సంస్థ ద్వారా డ్రైవింగ్‌లో ప్రొఫెషనల్ శిక్షణను అందించనున్నారు. డ్రైవింగ్ లెసైన్స్ ఉండి, అనుభవమున్నవారికి మరింత మెరుగైన శిక్షణతోపాటు వృత్తిపరంగా ఆయా బాధ్యతల నిర్వహణలో భాగంగా ఇతరులతో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై కూడా ప్రత్యేక అవగాహనను ఇచ్చేలా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇంగ్లిష్‌లో ప్రవేశమున్నవారిని గుర్తించి వారికి ప్రత్యేకమైన శిక్షణను అందించనున్నారు. ఎస్టీ కార్పొరేషన్ (ట్రైకార్), బీసీ కార్పొరేషన్ ద్వారా ఆయా శిక్షణా కార్యక్రమాలను అమలుచేస్తారు. వెబ్సైట్ ద్వారా ఔత్సాహికుల వివరాలు సేకరణ ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఔత్సాహిక యువకులు, నిరుద్యోగుల నుంచి (డ్రైవింగ్ లెసైన్స్, వృత్తి అనుభవమున్నవారు) వారి వివరాలు సమాచారాన్ని సేకరించి వారి ఆలోచనలు, అభిలాషలను విశ్లేషిస్తారు. సొంతంగా ట్యాక్సీలు, ఆటోలు నడుపుకోవాలని ఆలోచనతో ఉన్నవారికి ఆయా కార్పొరేషన్ల ద్వారా డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద అందుకు అవసరమైన రుణాలు అందజేస్తారు. డ్రైవర్లుగా పనిచేయాలని అనుకుంటున్నవారి విద్యార్హతలు, ఇంగ్లిష్‌లో ప్రవేశాన్ని బట్టి ఆయా కంపెనీలు, సంస్థల అవసరాల మేరకు డ్రైవర్లుగా పంపిస్తారు. సరుకు రవాణాను ఇష్టపడేవారికి అందుకు అవసరమైన టిప్పర్లు, ఇతర వాహనాలను సమకూరుస్తారు. అద్దెపై ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటోలు నడుపుకోవాలనేవారికి ఆ మేరకు అవకాశాలను కల్పిస్తారు. స్వయం ఉపాధి పథకాల లబ్ధిదారులకు ఆయా ప్రయోజనాలు అందాక వారు వాటిని ఏ విధంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న దానిని స్వతంత్ర సంస్థ ద్వారా ఎస్టీ, బీసీ శాఖలు పర్యవేక్షించనున్నాయి. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు లబ్ధిదారుల పనీతీరును బేరీజు వేసి, అధికారులకు నివేదికలను పంపించనున్నారు. -
తెలంగాణ ఈ-పాస్‌కు ప్రశంసలు
దక్షిణాది రాష్ట్రాల సంక్షేమశాఖల కితాబు సాక్షి, హైదరాబాద్: సంక్షేమ, ఇతరత్రా పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-పాస్ విధానం బేషుగ్గా ఉందని వివిధ రాష్ట్రాల సంక్షేమ శాఖల నుంచి కితాబు లభించింది. ఈ విధానం ద్వారా పారదర్శకంగా ఈ పథకాల నిర్వహణకు ఆస్కారం ఏర్పడిందనే అభిప్రాయాన్ని కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఉన్నతాధికారులు సైతం వ్యక్తం చేశారు. శుక్రవారం చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్, డెరైక్టర్ల ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడంలో భాగంగా పలు అంశాల గురించి ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జె.రే మండ్ పీటర్ తన ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జాతీయ స్థాయితో పాటు, మిగతా రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విధానాల కంటే ఇది మెరుగైన విధానమని కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థులు, కళాశాలలకు నేరుగా కేంద్రం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చేసేందుకు వీలుగా ‘నేషనల్ ఈ స్కాలర్షిప్ పోర్టల్’లో చేరాలని రాష్ట్ర అధికారులకు కేంద్ర సామాజికన్యాయ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు సూచించారు. తెలంగాణలో తాము పకడ్బందీ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనిలోకి మారడానికి ఉన్న ఇబ్బందులను రేమండ్‌పీటర్ వివరించారు. ఆయా అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. -
గ్రామస్థాయిలోనే లబ్ధిదారుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను ఇక నుంచి గ్రామస్థాయిలోనే జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న కొత్త పథకం ‘గ్రామజ్యోతి’ ద్వారా ప్రస్తుత విధానాల్లో ముఖ్యమైన మార్పులను తీసుకురానుంది. ఈ నెలాఖరుకల్లా ఈ పథకాల అమలుకు సంబంధించి అనుసరించాల్సిన విధానం, కిందిస్థాయిలో విధుల నిర్వహణ వంటి అంశాల్లో స్పష్టత రావొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల ద్వారా వర్తింపజేసే ఆయా పథకాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకు ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వ శాఖలు, ముఖ్యంగా సంక్షేమ శాఖల ధోరణిలో మార్పు తీసుకొచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కిందిస్థాయి నుంచి ప్రభుత్వపరంగా చేపట్టే ఆయా పథకాలను అమలుచేయడం వల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చనే అభిప్రాయంతో ఉంది. గ్రామస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక అనేది కచ్చితంగా జరిగేందుకు, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అవకాశముంటుందని అధికారులు అంచనావేశారు. దీంతో లబ్ధిదారులను గుర్తించేందుకు అవసరమైన సమాచారాన్ని, వివరాలను గ్రామస్థాయిలో సేకరించేందుకు సులువు అవ్వడంతో పాటు ఎంపిక పారదర్శకతకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధానంతో ఆయా సంక్షేమశాఖలు నిర్దేశించుకున్న లక్ష్యాలను సంపూర్ణంగా సాధించవచ్చున ని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అన్నీ గ్రామస్థాయిల్లోనే: ఈ విధానంతో వివిధ శాఖల ద్వారా అమలుచేసే పథకాలను పకడ్బందీగా అమలు చేయోచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి దాకా ఆయా సంక్షేమశాఖలు జిల్లాల వారీగా పథకాలకు నిధుల కేటాయించి చేతులు దులుపుకున్న పరిస్థితికి భిన్నంగా జవాబుదారీతనం, పారదర్శకతను పాటించేలా చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విధానం ద్వారా పట్టణ, గ్రామీణ అనే తేడాలు లేకుండా ఆయా నిష్పత్తులకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపులకు అవకాశం ఉంటుందనే అంచనాకు వచ్చింది. -
సంక్షామం
♦ నాలుగు నెలలుగా అందని డైట్ చార్జీలు ♦ రెండు నెలలుగా ట్యూటర్లకు అందని గౌరవ వేతనం ♦ వార్డెన్లకు తప్పని ఎదురుచూపులు సాక్షి, కడప : వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకు చెందిన వసతి గృహాలు ప్రస్తుతం నిధులు లేక నీరసిస్తున్నాయి. విద్యార్థులకు ప్రతినిత్యం ఆహారం అందించే వార్డన్లకు ఇంతవరకూ డైట్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆకలి కేకలు తప్పడంలేదు. మొన్నటి వరకు గురుకులాల్లో ఇదే సమస్య నెలకొనగా.. తాజాగా బీసీ సంక్షేమశాఖను ఈ సమస్య వెంటాడుతోంది. ప్రభుత్వం, ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. కోట్లలో బిల్లులు పెండింగ్.. జిల్లాలో సుమారు 59 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. అందులో సుమారు 4 నుంచి 5 వేల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రతినిత్యం మెనూ ప్రకారం భోజనం, టిఫిన్, పాలు, గుడ్డు, అరటిపండు లాంటి ఆహారాన్ని సంబంధిత వార్డెన్ అందజేయాల్సి ఉంది. అనంతరం అయిన ఖర్చులను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తూ వస్తోంది. అయితే ప్రస్తుత తరుణంలో కొన్ని హాస్టళ్లకు 2014 డిసెంబర్ నుంచి డైట్ చార్జీలు రాకపోగా.. మరికొన్ని హాస్టళ్లకు జనవరి నుంచి మూడు నెలలుగా డైట్ ఛార్జీలు అందలేదు. కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులకు సరైన ఆహారం అందించడం వార్డన్లకు తలకుమించిన భారంగా మారింది. ఇప్పటికే ఒక్కో వార్డెన్‌కు దాదాపు రూ. మూడు లక్షల మేర బిల్లులు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా లెక్కకడితే కోట్లల్లో డైట్‌ఛార్జీలు రావాల్సి ఉంది. భారంగా మారిన మెనూ.. బీసీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ప్రతి నిత్యం మెనూ ప్రకారం ఆహారం అందించడం వార్డెన్లకు సమస్యగా మారింది. ఎందుకంటే మూడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో ప్రస్తుత మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలంటే కష్టంగా మారింది. దీంతో మెనూలోని కొన్ని ఆహార పదార్థాలకు వార్డెన్లు మంగళం పాడినట్లు తెలుస్తోంది. రెండు నెలలుగా ట్యూటర్లకూ అందని జీతం.. బీసీ సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న ట్యూటర్లకు కూడా రెండు నెలలుగా గౌరవ వేతనం అందకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రెండు నెలలుగా గౌరవ వేతనం రావాల్సి ఉంది. వెంటనే గౌరవ వేతనం అందించి కష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని ట్యూటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది :- విల్సన్, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి ప్రభుత్వం నుంచి బీసీ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు రావాల్సి ఉంది. ప్రభుత్వం విడుదల చేస్తే పంపిణీకి చర్యలు తీసుకుంటాం. ట్యూటర్లకు గౌరవ వేతనం అందాల్సి ఉంది. డైట్ ఛార్జీలు నాలుగు నెలలకు సంబంధించి రావాలి. -
మంత్రి గారూ..ఇదేనా సంక్షేమం!
‘పేదలకు సక్రమంగా ఫలాలు అందాలంటే సంక్షేమ శాఖలు నా వద్దే ఉండాలి. అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుంది.’ అని సాక్షాత్తు ముఖ్య మంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రకటించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు పూర్తయినప్పటికీ సంక్షేమంపై సీఎం దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. జిల్లాలో బీసీ సంక్షేమ వసతిగృహాల పరిస్థితి దారుణంగా తయారైంది. సమస్యలు తిష్ట వేసిన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు దుర్భర స్థితిని గడుపుతున్నారు. ఈ ఏడాదికి మరమ్మతుల నిధులు లేకపోవడంతో సొంత భవనా ల్లో ఉన్న వసతిగృహాలన్నీ అధ్వానంగా మారాయి. ఇటు సంక్షేమ వసతిగృహాల ను ఇంటిని తలపించేలా తయారు చేస్తామని సమావేశాల్లో ప్రసంగాలు ఇచ్చిన పాలకులు ఆచరణకొచ్చేసరికి ఆమడ దూరంలో ఉన్నారు. అధికారులది అదే తీరు. బీసీ సం క్షేమాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. -ఇందూరు ఇందూరు: జిల్లాలో బీసీ సంక్షేమ వసతిగృహాలు పాఠశాల, కళాశాలలకు కలిపి మొత్తం 60 ఉన్నాయి. ఇందులో 37 వసతిగృహాలు సొంత భవనాల్లో ఉండగా, 23 వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గత జూన్ 12న జిల్లాలోని వసతిగృహాలన్నీ పున: ప్రారంభమయ్యాయి. అయితే వసతిగృహాలకు ప్రతి ఏటా మరమ్మతుల కోసం ప్రభుత్వం నుంచి లేదా జిల్లా ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో వసతిగృహాలు ప్రారంభం కాకముందే విద్యుద్దీపాలు, ఫ్యాన్లు, ఎలక్ట్రిసిటీ బోర్డులు, గదుల తలుపులు, బాత్రూమ్ తలుపులు, వాటి పరిశుభ్రత, నీటి సరఫరా, భవనానికి సున్నాలు, పైకప్పుల లీకేజీ ఇతర ఏవైన మరమ్మతులు చేయించాలి. ఇందుకు బీసీ సంక్షేమాధికారులు మరమ్మతులు అవసరం ఉన్న వసతిగృహాలను గుర్తించి, వాటికి నిధులు కేటాయించాలని మూడు నెలల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న కు ఫైలు పెట్టారు. అయితే ఆ ఫైలుకు అక్కడి నుంచి కదలిక లేదు. ఇటు విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో సంక్షేమాధికారులు చేసేదేమిలేక అరకొర వసతులతోనే వసతి గృహాలను ప్రారంభించాల్సి వచ్చింది. అవి ప్రారంభమై రెండు నెలల పూర్తయినప్పటికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. జిల్లా బీసీ సంక్షేమాధికారులు నెల రోజుల క్రితం వసతిగృహాల మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలని, విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల మం జూరులో మాత్రం నిర్లక్ష్యం వహించారు. బీసీ సంక్షేమ వసతిగృహాలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఆధ్వానంగా తయారయ్యాయి. సొంత భవనాల పైకప్పులు పెచ్చులూడుతున్నాయి. అవి విద్యార్థులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. కిటికీలకు జాలీలు అమర్చకపోవడంతో దోమలబెడద తీవ్రంగా ఉంది. బాత్రూమ్లు పరిశుభ్రతకు నోచుకోక పోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో విద్యార్థులు రోగా ల బారిన పడుతున్నారు. ఇటు బాత్రూమ్లకు తలుపులు లేకపోవడంతో స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. తలుపులున్నప్పటికి అవి పూర్తిగా విరిగి పోయి దర్శనమిస్తున్నాయి. ఇక విద్యు త్ దీపాల విషయానికొస్తే విద్యార్థులు పడుకునే గదు ల్లో అక్కడక్కడ మాత్రమే ఏర్పాటు చేశారు. మరి కొన్ని వసతి గృహాల్లో విద్యుత్ దీపాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. వసతిగృహాల ఆవరణలో కూడా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు పగిలిపోవడంతో ప్రస్తుతం అవి పని చేయడం లేదు. ఫ్యాన్లు కూడా తిరగడం లేదు. పై సమస్యలన్నింటిపై విద్యార్థులు వార్డెన్ల కు విన్నవించినప్పటికి నిధులు రాలేదనే సాకుతో వారు తప్పించుకుంటున్నారు. విద్యార్థులకు వసతు లు కరువయ్యాయని అనుకుంటే నోటు బుక్కులు, యూనిఫామ్‌లు ఇంత వరకు అందించలేదు. దీంతో సంక్షేమంలో సంక్షోభం నెలకొంది. -
సం‘క్షామం’
నీలగిరి : అధికారుల అలసత్వం వల్ల లబ్ధిదారుల కు పథకాలు అందకుండాపోతున్నాయి. ప్రభు త్వ మంజూరు చేసిన సబ్సిడీ బ్యాంకుల్లో మూ లుగుతున్నా రుణాలు మాత్రం అందలేదు. సంక్షేమ శాఖల ద్వారా అర్హులైన వారికి లబ్ధిచేకూర్చేందుకు ప్రతి ఏడాది వార్షిక ప్రణాళికను ఖరారు చేస్తారు. ఆ తరువాత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అర్హులైన వారికి బ్యాంకర్లు రుణాల మంజూరుకు అంగీకార పత్రం అందజేస్తారు. ఆ విధంగా బ్యాంకర్ల నుంచి కాన్సెంట్ తెచ్చుకున్న వారికి మాత్రమే సంక్షేమ శాఖల నుంచి సబ్సిడీ విడుదల చేస్తారు. సంక్షేమ శాఖల నుంచి నేరుగా ఆన్లైన్లోనే లబ్ధిదారుల ఖాతాలకు సబ్సిడీ చేరుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచారం పంపిస్తారు. అనంతరం సబ్సిడీ విడుదలైన లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసి పథకాలను గ్రౌండింగ్ చేస్తారు. ఏ బ్యాంకు ద్వారా ఎంతమంది లబ్ధిదారులకు సబ్సిడీ విడుదలైంది? ఎంత మంది లబ్ధి పొందారు ? అనే దానికి సంబంధించి బ్యాంకర్ల నుంచి సంక్షేమ శాఖల అధికారులు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) తెప్పించుకోవాల్సి ఉంటుంది. కానీ రెండేళ్ల నుంచి ఈ విధానానికి అధికారులు స్వస్తి చెప్పారు. పథకాల గ్రౌండింగ్ గురించే పట్టించుకోవడమే మానేశారు. దీంతో లక్షల రూపాయల సబ్సిడీ సొమ్ము బ్యాంకుల్లోనే మూలుగుతోంది. రూ.1.12 కోట్ల సబ్సిడీ.. 2012-13కు గాను బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధిం చి సుమారు రూ.1. 12 కోట్ల సబ్సిడీ బ్యాంకుల్లోనే మూలుగుతోంది. లబ్ధిదారుల పేరు మీద వారి ఖాతాల్లోనే ఈ సబ్సిడీ మొత్తం ఉండిపోయింది. సబ్సిడీ విడుదలైనప్పటికీ రుణాలు మంజూరుగాక లబ్ధిదారులు సంక్షేమ శాఖల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కనీసం సంబంధిత బ్యాంకుల నుంచి యూసీలు తెప్పించుకుని ఎంత మందికి రుణాలు మంజూరు చేశారన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. లబ్ధిదారులు మాత్రం ఇంకా రుణాలు వస్తాయన్న ఆశతో ఎదురుచూడాల్సి వస్తోంది. కాగితాలకే పరిమితం... 2013-14కు గాను ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ల వార్షిక ప్రణాళిక బుట్టదాఖలైంది. ఈ ఏడాదికి సంబంధించి నిర్ధారించిన లక్ష్యం కంటే మంజూరు ఇచ్చిన యూనిట్లు చాల స్వల్పం గానే ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం నయాపైసా కూడా సబ్సిడీ విడుదల చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 93 యూనిట్లకుగాను రూ.78 లక్షల సబ్సిడీ బ్యాంకులకు విడుదలైంది. దీంట్లో కేవలం 39 మందికి మాత్రమే రూ.20 లక్షల సబ్సిడీ అందించారు. మిగిలిన రూ.58 లక్షలు బ్యాంకుల్లోనే మూలుగుతోంది. ప్రభుత్వం పైనే ఆశలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక ప్రణాళిక ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ కొత్త ప్రణాళికను ప్రకటించాల్సి వస్తే గతేడాది మంజూరు ఇచ్చిన ప్రతిపాదనలు ఉంటాయా? రద్దు చేస్తారా? అన్నది అధికారులకు కూడా అంతుపట్టడం లేదు. ఎస్సీ వార్షిక ప్రణాళికను రూపొందించామని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. కానీ మిగతా శాఖల ప్రణాళికలపై ఎలాంటి స్పష్టత లేదు. వాస్తవానికి జిల్లా కలెక్టర్ ఆమోదంతో గతేడాది మంజూరు చేసిన యూనిట్లకు తప్పనిసరిగా సబ్సిడీ విడుదల చేసి పథకాలను గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయం పైనే లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. బ్యాంకులో డిపాజిట్ చేశా - ఎం.విఠల్, పుట్టగూడెం, రాజాపేట మండలం నేను పాడిపశువుల కోసమని ఎస్టీ కార్పొరేషన్‌కు గతేడాది దరఖాస్తు చేశా. బ్యాంకర్లు రుణం ఇప్పిస్తామని చెప్పి నా నుంచి రూ.30 వేలు డిపాజిట్ కట్టించుకున్నారు. కానీ ఇంకా కార్పొరేషన్ నుంచి సబ్సిడీ విడుదల కాలేదు. దీంతో బ్యాంకర్లు సబ్సిడీ వస్తే తప్ప రుణం ఇవ్వమని చెబుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ నుంచి 1769 యూనిట్లకు గాను పాత వాటితో కలిపి 1789 యూనిట్లకు మంజూరు ఇచ్చారు. దీంట్లో 1069 మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు ఇచ్చారు.