సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖలు నిధులకోసం ఎదురు చూస్తున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో గడిచిన రెండు త్రైమాసికాల్లో ప్రభుత్వం నుంచి అరకొర నిధులే విడుదల కావడంతో పలు కార్యక్రమాలు వాయిదా వేస్తూ వచ్చిన అధికారులు.. మూడో త్రైమాసికంలో పెద్దమొత్తంలో నిధులకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరుతో అర్ధవార్షికం ముగిసింది. ఈ క్రమంలో ఈనెలాఖరులో మూడో క్వార్టర్ నిధులు వస్తాయని భావించిన అధికారులకు ఎదురుచూపులే మిగిలాయి. నిధుల విడుదలకోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో యంత్రాంగం వేచిచూసే ధోరణిలో ఉంది.
కీలక పథకాలన్నీ డీలా!
చాలినన్ని నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో పలు కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలయ్యే ప్రధాన కార్యక్రమం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్. ఈ రెండు పథకాల కింద ఆయా శాఖల వద్ద 38వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిశీలన పూర్తి చేసిన అధికారులు ఆమేరకు మంజూరీలు కూడా ఇచ్చారు. కానీ సంక్షేమ శాఖల వద్ద నిధులు లేకపోవడంతో అవన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయి. గత రెండు త్రైమాసికాల్లో ఈ పథకాలకు పెద్దగా నిధులివ్వలేదు. ప్రస్తుతం ఈ రెండు పథకాల కింద రూ.400 కోట్లు అవసరం. తాజాగా మూడో త్రైమాసికంలో ఈమేరకు నిధులు విడుదల చేస్తే పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలగనుంది. మరోవైపు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల బకాయిలు సైతం కుప్పలుగా పేరుకుపోయా యి. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.868.55 కోట్లు అవసరమని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు సంబంధించి దాదాపు ఐదు నెలలుగా సరైన మోతాదులో బడ్జెట్ విడుదల కాలేదు. మెస్ చార్జీలు, నిర్వహణ, కరెంటు బిల్లులు, పిల్లల దుస్తులకు సంబంధించిన కుట్టు కూలీ కలిపి రూ.125 కోట్లకు పైగా బకాయిలున్నాయి.
కార్పొరేషన్లలో దా‘రుణం’...
స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించే నిరుద్యోగ యువత ప్రథమంగా ఎదురు చూసేది కార్పొరేషన్ రుణాలకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు 2018–19 వార్షిక సంవ త్సరంలో దాదాపు 6.45లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు కూడా కలుపుకుంటే దాదాపు 8లక్షలకు పైమాటే. కానీ ఈ ఏడాది కార్పొరేషన్ రుణాల పంపిణీ ఆశాజనకంగా లేదు. రెండేళ్ల క్రితం దరఖాస్తులను ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా పరిష్కరిస్తుండగా... బీసీ, ఎంబీసీ, మైనార్టీ కార్పొరేషన్లు మాత్రం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో దిక్కులు చూస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత బీసీ కార్పొరేషన్‌కు రూ.350 కోట్లు విడుదల చేశారు. 38వేల మంది నిరుద్యోగులకు రూ.50వేలలోపు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయగా... ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటిని సైతం వాయిదావేశారు. మైనార్టీ కార్పొరేషన్‌కు సైతం ప్రత్యేకంగా నిధులు విడుదల కాకపోవడంతో దరఖాస్తు పరిశీలనను ఆ శాఖ అధికారులు అటకెక్కించారు.
కీలకం.. మూడో త్రైమాసికం!
Published Tue, Oct 30 2018 2:18 AM | Last Updated on Tue, Oct 30 2018 2:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment