
వొడాఫోన్ ఐడియాపై ప్రభుత్వానికి సెబీ వెసులుబాటు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే అంశంలో ప్రభుత్వానికి మినహాయింపు లభించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇందుకు అనుమతించింది. స్పెక్ట్రమ్ బకాయిలను ఈక్విటీగా మారి్పడి చేసుకునే ప్రతిపాదన నేపథ్యంలో కంపెనీలో ప్రభుత్వ వాటా 34 శాతంపైగా పెరగనుంది.
దీంతో ప్రభుత్వ వాటా 22.6 శాతం నుంచి 49 శాతానికి చేరనుంది. అయితే ప్రజా ప్రయోజనార్ధమే ప్రభుత్వం వొడాఫోన్ ఐడియాలో వాటాను పెంచుకుంటున్న కారణంగా ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపును ప్రకటించినట్లు సెబీ హోల్ టైమ్ సభ్యులు అశ్వనీ భాటియా పేర్కొన్నారు.
ప్రభుత్వానికి కంపెనీ మేనేజ్‌మెంట్ లేదా బోర్డులో చేరే యోచనలేని నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా యాజమాన్య నియంత్రణలో మార్పులకు చోటులేదని తెలియజేశారు. వెరసి ప్రభుత్వ వాటా పబ్లిక్ హోల్డింగ్‌గా పరిగణనలోకి రానున్నట్లు వెల్లడించారు. గత నెలలో ప్రభుత్వం రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 36,950 కోట్లను ఈక్విటీగా మారి్పడి చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2021 టెలికం సహాయక ప్యాకేజీలో భాగంగా బకాయిలను ఈక్విటీగా మార్చుకునేందుకు ప్రతిపాదించింది.