
మంత్రి గారూ..ఇదేనా సంక్షేమం!
‘పేదలకు సక్రమంగా ఫలాలు అందాలంటే సంక్షేమ శాఖలు నా వద్దే ఉండాలి. అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుంది.’ అని సాక్షాత్తు ముఖ్య మంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రకటించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు పూర్తయినప్పటికీ సంక్షేమంపై సీఎం దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. జిల్లాలో బీసీ సంక్షేమ వసతిగృహాల పరిస్థితి దారుణంగా తయారైంది.
సమస్యలు తిష్ట వేసిన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు దుర్భర స్థితిని గడుపుతున్నారు. ఈ ఏడాదికి మరమ్మతుల నిధులు లేకపోవడంతో సొంత భవనా ల్లో ఉన్న వసతిగృహాలన్నీ అధ్వానంగా మారాయి. ఇటు సంక్షేమ వసతిగృహాల ను ఇంటిని తలపించేలా తయారు చేస్తామని సమావేశాల్లో ప్రసంగాలు ఇచ్చిన పాలకులు ఆచరణకొచ్చేసరికి ఆమడ దూరంలో ఉన్నారు. అధికారులది అదే తీరు. బీసీ సం క్షేమాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. -ఇందూరు
ఇందూరు: జిల్లాలో బీసీ సంక్షేమ వసతిగృహాలు పాఠశాల, కళాశాలలకు కలిపి మొత్తం 60 ఉన్నాయి. ఇందులో 37 వసతిగృహాలు సొంత భవనాల్లో ఉండగా, 23 వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గత జూన్ 12న జిల్లాలోని వసతిగృహాలన్నీ పున: ప్రారంభమయ్యాయి. అయితే వసతిగృహాలకు ప్రతి ఏటా మరమ్మతుల కోసం ప్రభుత్వం నుంచి లేదా జిల్లా ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తారు.
ఈ నిధులతో వసతిగృహాలు ప్రారంభం కాకముందే విద్యుద్దీపాలు, ఫ్యాన్‌లు, ఎలక్ట్రిసిటీ బోర్డులు, గదుల తలుపులు, బాత్‌రూమ్ తలుపులు, వాటి పరిశుభ్రత, నీటి సరఫరా, భవనానికి సున్నాలు, పైకప్పుల లీకేజీ ఇతర ఏవైన మరమ్మతులు చేయించాలి. ఇందుకు బీసీ సంక్షేమాధికారులు మరమ్మతులు అవసరం ఉన్న వసతిగృహాలను గుర్తించి, వాటికి నిధులు కేటాయించాలని మూడు నెలల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న కు ఫైలు పెట్టారు.
అయితే ఆ ఫైలుకు అక్కడి నుంచి కదలిక లేదు. ఇటు విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో సంక్షేమాధికారులు చేసేదేమిలేక అరకొర వసతులతోనే వసతి గృహాలను ప్రారంభించాల్సి వచ్చింది. అవి ప్రారంభమై రెండు నెలల పూర్తయినప్పటికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు.
జిల్లా బీసీ సంక్షేమాధికారులు నెల రోజుల క్రితం వసతిగృహాల మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలని, విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల మం జూరులో మాత్రం నిర్లక్ష్యం వహించారు. బీసీ సంక్షేమ వసతిగృహాలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఆధ్వానంగా తయారయ్యాయి.
సొంత భవనాల పైకప్పులు పెచ్చులూడుతున్నాయి. అవి విద్యార్థులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. కిటికీలకు జాలీలు అమర్చకపోవడంతో దోమలబెడద తీవ్రంగా ఉంది. బాత్‌రూమ్‌లు పరిశుభ్రతకు నోచుకోక పోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో విద్యార్థులు రోగా ల బారిన పడుతున్నారు.
ఇటు బాత్‌రూమ్‌లకు తలుపులు లేకపోవడంతో స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. తలుపులున్నప్పటికి అవి పూర్తిగా విరిగి పోయి దర్శనమిస్తున్నాయి. ఇక విద్యు త్ దీపాల విషయానికొస్తే విద్యార్థులు పడుకునే గదు ల్లో అక్కడక్కడ మాత్రమే ఏర్పాటు చేశారు. మరి కొన్ని వసతి గృహాల్లో విద్యుత్ దీపాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. వసతిగృహాల ఆవరణలో కూడా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు పగిలిపోవడంతో ప్రస్తుతం అవి పని చేయడం లేదు.
ఫ్యాన్లు కూడా తిరగడం లేదు. పై సమస్యలన్నింటిపై విద్యార్థులు వార్డెన్ల కు విన్నవించినప్పటికి నిధులు రాలేదనే సాకుతో వారు తప్పించుకుంటున్నారు. విద్యార్థులకు వసతు లు కరువయ్యాయని అనుకుంటే నోటు బుక్కులు, యూనిఫామ్‌లు ఇంత వరకు అందించలేదు. దీంతో సంక్షేమంలో సంక్షోభం నెలకొంది.