సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: ఈ ఏడాది జీ–20 సమావేశాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ‘వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయం’అనే అంశంపై చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ‘ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్’, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలు సెప్టెంబర్ 4, 6 తేదీల మధ్య జరగనున్న ఈ చర్చలకు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే హజరు కానున్నారు.
హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో 100 మంది దేశ, విదేశీ ప్రతినిధులు వ్యవసాయ పరిశోధనలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అంశాలపై చర్చలు జరపనున్నారు. జీ–20 సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రతినిధులు భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్యకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌ను సందర్శించనున్నారు.
విదేశీ ప్రతినిధులకు దేశ సంస్కృతిని పరిచయం చేసే ఉద్దేశంతో వారిని హైదరాబాద్‌లోని శిల్పారామానికి తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ప్రతినిధులందరూ ఐసీఏఆర్ క్రిడాలోని పరిశోధన క్షేత్రంలో పంటలను, వాటి నిర్వహణ పద్ధతులను పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment