G-20
-
మోకా.. ‘చిరు’ చిత్రాలు కేక!
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): విశాఖపట్నానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్ తీర్చిదిద్ధిన చిరుధాన్యాల చిత్రాలు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రధానుల సతీమణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో భాగంగా ప్రగతి మైదానంలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు. మోకా విజయ్‌కుమార్ చిరుధాన్యాలతో తీర్చిదిద్ధిన భారతీయ రైతుల చిత్రాలు, వినాయకుడి ప్రతిమను ఉంచారు. ఆయన రెండు అడుగుల ఎత్తుతో తయారు చేసిన గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గణపతి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ ప్రారంభ ప్రదేశంలోనే ప్రదర్శనకు ఉంచడం విశేషం. విజయ్‌కుమార్ మిల్లెట్స్‌తో తయారు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా ఆమెకు ప్రదానం చేశారు. భారతీయ రైతుల కష్టాన్ని ప్రతిబింబిస్తూ మిల్లెట్స్‌పై ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా తాను ఈ చిత్రాలను తయారు చేసినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. గతంలో విశాఖపట్నం, హైదరాబాద్‌లలో జరిగిన జీ–20 సదస్సుల్లో కూడా తన చిత్రాలను ప్రదర్శించినట్లు చెప్పారు. -
నేటి నుంచి జీ–20 వ్యవసాయ సదస్సు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: ఈ ఏడాది జీ–20 సమావేశాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ‘వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయం’అనే అంశంపై చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ‘ది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్’, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలు సెప్టెంబర్ 4, 6 తేదీల మధ్య జరగనున్న ఈ చర్చలకు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే హజరు కానున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్లో 100 మంది దేశ, విదేశీ ప్రతినిధులు వ్యవసాయ పరిశోధనలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అంశాలపై చర్చలు జరపనున్నారు. జీ–20 సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రతినిధులు భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్యకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌ను సందర్శించనున్నారు. విదేశీ ప్రతినిధులకు దేశ సంస్కృతిని పరిచయం చేసే ఉద్దేశంతో వారిని హైదరాబాద్‌లోని శిల్పారామానికి తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ప్రతినిధులందరూ ఐసీఏఆర్ క్రిడాలోని పరిశోధన క్షేత్రంలో పంటలను, వాటి నిర్వహణ పద్ధతులను పరిశీలించనున్నారు. -
రక్షణ వలయంలో శ్రీనగర్
శ్రీనగర్: శ్రీనగర్‌లో నేటి నుంచి జీ–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాలు మొదలవుతున్న విషయం తెలిసిందే. ఉగ్ర బెడద నేపథ్యంలో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తత ప్రకటించాయి. నేషనల్ సెక్యూరిటీ గ్రూప్(ఎన్ఎస్జీ) కౌంటర్ డ్రోన్ బృందాలు గగనతలంపై కన్నేసి ఉంచాయి. సుందర దాల్ సరస్సుపై నేవీ మెరైన్ కమాండోలు గస్తీ చేపట్టారు. పలు కీలక ప్రాంతాల్లో భారీగా మోహరింపులు, తనిఖీలు ముమ్మరమయ్యాయి. వివిధ దేశాల నుంచి హాజరయ్యే 60 మంది ప్రతినిధులు, 20 మంది జర్నలిస్టుల కోసం సమావేశాల వేదికైన షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ) వద్ద యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశమిది. దీంతో, సమావేశ వేదికతోపాటు, వారు బస చేసే ప్రాంతం, ఆ పక్కనే ఉన్న జబర్వాన్ పర్వతశ్రేణిపై ఆర్మీ బలగాలను రంగంలోకి దించారు. ఉగ్రమూకలు ఐఈడీలతో విధ్వంసానికి పాల్పడే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు. పాక్ కేంద్రంగా పనిచేసే జైషేమొహ్మద్‌కు చెందిన ఓ వ్యక్తిని ఆదివారం కుప్వారా జిల్లాలో సోదాల సమయంలో బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సైన్యం కదలికల సమాచారాన్ని అతడు పాక్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించారు. పూంఛ్‌లో సరిహద్దులకు సమీపంలో మెంధార్ సెక్టార్ వద్ద అనుమానాస్పద కదలికలతో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. సోదాలు పూర్తయ్యేదాకా ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని ప్రజలను అధికారులు కోరారు. -
జీ20 భేటీపై చైనా అభ్యంతరం.. భారత్ దీటైన జవాబు
శ్రీనగర్: ఈ నెల 22–24 తేదీల మధ్య జి–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహించడంపై చైనా అభ్యంతరం తెలిపింది. జి–20కి సంబంధించిన ఏ విధమైన సమావేశాల్ని కూడా వివాదాస్పద ప్రాంతాల్లో జరపరాదని, అటువంటి సమావేశాలకు తాము హాజరుకాబోమని శుక్రవారం పేర్కొంది. దీనిపై భారత్ దీటుగా స్పందించింది. ‘మా సొంత భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు జరుకునే స్వేచ్ఛ మాకుంది. చైనాతో సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడటం అవసరం’అని పేర్కొంది. ఈ సమావేశాలకు హాజరు కారాదని టర్కీ ఇప్పటికే ప్రకటించగా, సౌదీ అరేబియా నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఈ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 100 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం ముందుగా భావించింది. అయితే, సుమారు 60 మంది హాజరవుతారని తాజాగా అంచనా వేస్తోంది. ఇలా ఉండగా, జి–20 సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. మెరైన్ కమాండోలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ)ను రంగంలోకి దించింది. ఉగ్రవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నించవచ్చన్న అనుమానాల నేపథ్యంలో జి–20 సమావేశాల వేదిక, దాల్‌లేక్‌ను భద్రతా బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. -
Toolika Rani: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ!
సాహసగాథలు వింటే సాహసాలు చేయాలనిపిస్తుంది. సాహసం చేస్తే మరిన్ని సాహసాలు చేయాలనిపిస్తుంది. సాహసం ఏం ఇస్తుంది? ‘అంతులేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాదు మనమేమిటో మనకు తెలియజేస్తుంది’ అంటుంది తులికారాణి. ఎన్నో ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించిన ఈ సాహసి సామాజిక స్పృహకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుంచి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన తొలి మహిళగా, ఇరాన్‌లోని మౌంట్ డమవండ్ను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది తులికారాణి. మీరట్‌లో చదువుకున్న రాణికి చిన్నప్పటి నుంచి సాహసగాథలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌పై ఆసక్తి కలిగేలా చేసింది. 2005లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన రాణి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ విభాగంలో, ఔట్‌డోర్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పదిసంవత్సరాల పాటు పనిచేసింది. ఎయిర్‌ఫోర్స్ టీమ్‌లో భాగంగా పర్వతారోహణకు శ్రీకారం చుట్టింది. అప్పుడు మొదలైన ఆసక్తి ఆమెతో ఎన్నో సాహసాలు చేయించింది. భారతదేశం, నేపాల్. భూటాన్, ఇరాన్, రష్యా... మొదలైన దేశాల్లో ఇరవైనాలుగు ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించింది. ఝాన్సీ లక్షీభాయి పురస్కారంతో పాటు పదిహేడు అవార్డ్లు అందుకుంది. వాటిలో ‘గ్లోబల్ ఉమెన్’ అవార్డ్ కూడా ఒకటి. ‘సవాలును స్వీకరించడానికి ధైర్యం మాత్రమే కాదు అంకితభావం, కష్టపడే తత్వం ఉండాలి. ప్రయాణంలో అవహేళనలు ఎదురు కావచ్చు. అయితే ఒక్క విజయం చాలు వాటికి సమాధానం చెప్పడానికి’ అంటుంది రాణి. తొలిసారిగా పర్వతారోహణకు ఉపక్రమించినప్పుడు ప్రోత్సహించే వారి కంటే ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ. కొందరైతే ‘అమ్మాయిలు పర్వతారోహణ చేయడం కష్టం’ అన్నారు. విమర్శలకు, అనుమానాలకు, అవహేళనలకు తన విజయాలతోనే గట్టి సమాధానం చెప్పింది రాణి. పుస్తకాలు చదవడం, తన సాహనయాత్రల గురించి ఆర్టికల్స్ రాయడం, ప్రకృతిని చూస్తూ పరవశిస్తూ భావుకతతో కవిత్వం రాయడం రాణికి ఇష్టం. వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ సాంస్కృతిక నేపథ్యాలు ఉన్న వ్యక్తులతో మాట్లాడడం అంటే ఇష్టం. తాజా విషయానికి వస్తే... తులికారాణిని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం జీ–20 బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. వారణాసిలో ఆరు, ఆగ్రాలో మూడు, లక్నోలో ఒకటి, గ్రేటర్ నోడియాలో ఒకటి...జీ–20కి సంబంధించిన రకరకాల సమావేశాలు జరుగుతాయి. వీటిలో నలభై దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. కాలేజీ, యూనివర్శిటీలలో జరిగే కార్యక్రమాల్లో అంబాసిడర్ హోదాలో ΄ాల్గొననుంది రాణి. ‘జీ–20 బ్రాండ్ అంబాసిడర్‌గా నన్ను నియమించడం గర్వంగా ఉంది. నా బాధ్యతను మరింత పెంచింది. నిర్మాణాత్మక విషయాల గురించి యువతలో ఆసక్తి, అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది రాణి. రాణిలో మంచి వక్త, లోతైన విశ్లేషకురాలు కూడా ఉన్నారు. అడ్వెంచర్ స్టోర్ట్స్‌లో జెండర్ గ్యాప్, ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఎందుకు ఉంది? ఔట్‌డోర్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో స్త్రీలు అడుగు పెట్టడానికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయి? వాటికి పరిష్కారం ఏమిటి? పర్వతారోహణకు ఆర్థికబలం అనేది ఎంత ముఖ్యం... మొదలైన విషయాల గురించి రాణి అద్భుతంగా విశ్లేషిస్తుంది. ‘సాహసాలే కాదు సమాజసేవ కూడా’ అంటున్న తులికారాణికి అభినందనలు తెలియజేద్దాం. వృత్తం దాటి బయటికి రావాలి ఎప్పుడూ గిరిగీసుకొని ఉండకూడదు. ఈ విశాల ప్రపంచంలో మనం చేయడానికి ఎంతో ఉంది. చుట్టూ గీసుకున్న వృతాన్ని దాటి బయటి వస్తే అద్భుతప్రపంచం మనకు కనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు ఏం చేయలేదు? ఇకముందు ఏం చేయాలి? అనేది అవగాహనకు వస్తుంది. కొత్త శక్తి మనకు చేరువ అవుతుంది. – తులికారాణి -
జి–20 వర్కింగ్ గ్రూప్ భేటీకి పటిష్ట భద్రత
సాక్షి, హైదరాబాద్: ఈనెల 28 నుంచి జూన్ 17 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న జి–20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు తెలంగాణ పోలీస్‌శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేస్తోంది. ఈ సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జి–20 సెక్యూరిటీ కోఆర్డినేషన్ కమిటీలో నిర్ణయించారు. డీజీపీ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో సీనియర్ పోలీస్ అధికారులతోపా టు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్, ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎన్ఎస్జీ తదితర భద్రతా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, జి–20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశానికి ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూ పు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో 6 సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. వీటిలో జనవరి 28న తొలి సమావేశం జరగనుండగా, మార్చ్ 6,7 తేదీల్లో, ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో, జూన్ 7,8,9 తేదీల్లో, జూన్ 15,16 తేదీల్లో జూన్ 17న వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. సమన్వయం ఎంతో ముఖ్యం.... జీ–20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సజావుగా, భద్రతాపరమైన అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరమని డీజీపీ సూచించారు. సమావేశాలకు హాజ రయ్యే ఉన్నతస్థాయి ప్రతినిధులు నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశమున్నందున ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని, సమర్థవంతమైన సమన్వయం కోసం అంతర్గత వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని పంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు అభిలాష బిస్త్, సంజయ్‌కుమార్ జైన్, స్వాతిలక్రా, విజయకుమార్, నాగిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, హోంశాఖ ఎస్ఐబీ డిడి సంబల్ దేవ్, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సీఎస్ఓ భారత్ కందార్, డిప్యూటీ పాస్‌పోర్ట్ ఆఫీసర్ ఇందు భూషణ్ లెంక, ఎన్ఎస్జీ కల్నల్ అలోక్ బిస్త్, జీఏడీ ప్రోటోకాల్ అధికారి కె.నాగయ్య తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
కోవిడ్ నిబంధనలతో G-20 వర్కింగ్ గ్రూప్ మీటింగ్
-
8జీ–20 షెర్పాగా అమితాబ్ కాంత్!
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ జీ–20కు భారత కొత్త షెర్పాగా సేవలు అందించనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటి వరకు ఈ బాధ్యతలు చూశారు. ‘‘జీ–20 అధ్యక్ష బాధ్యతలు ఈ ఏడాది భారత్‌కు రానున్నాయి. దీంతో షెర్పా బాధ్యతల్లో ఉన్న వారు దేశవ్యాప్తంగా వివిధ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. మరింత సమయం కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి గోయల్ నరేంద్ర మోదీ కేబినెట్లో ఎన్నో శాఖల బాధ్యతలు చూస్తున్నారు. వీటికే ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. పైగా రాజ్యసభ నేతగానూ గోయల్ పనిచేస్తున్నారు’’అని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అమితాబ్ కాంత్ గతంలో పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం సెక్రటరీగానూ పనిచేశారు. -
మౌలిక రంగంపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: మౌలిక రంగం పురోగతిపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఈ రంగానికి సంబంధించి నిధులను సమకూర్చడం, రుణ యంత్రాగాల ఏర్పాటు వంటి అంశాలపై కలిసికట్టుగా ముందుకు నడవాలని ఇండోనేసియా అధ్యక్షతన జరుగుతున్న జీ–20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల రెండవరోజు వర్చువల్ సమావేశంలో ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మౌలిక రంగంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొని ఆర్థికమంత్రి ప్రసంగించినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్ పేర్కొంది. ఇండోనేషియాలోని జకార్తాలో జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం శుక్రవారం కరోనాసవాళ్లను ఎదుర్కొనడం, మౌలిక రంగంలో పెట్టుబడులుసహా పలు కీలక అంశాలపై చర్చించింది. -
సమాచార దుర్వినియోగాన్ని సహించం: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో సమాచార దుర్వినియోగాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం కలిగించే ఇటువంటి చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. అర్జెంటీనాలోని సలాట నగరంలో జరిగిన జీ–20 డిజిటల్ ఎకానమీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో అసలు రాజీ పడమని, ఒకవేళ ఎవరైనా విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. డిజిటల్ మీడి యా ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఇతర రంగాలకు మళ్లించాల్సిన అవసరముందని చెప్పారు. ఈ సైబర్ ప్రపంచంలో మెరుగైన భద్రతతో కూడిన సేవలు అందించినప్పడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు లాభం చేకూరుతుందని రవిశంకర్ తెలిపారు. సైబర్ మాధ్యమాల ద్వారా విస్తరిస్తున్న తప్పుడు వార్తలను అరికట్టేందుకు అంతర్జాతీయ సమాజం కలసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. -
భారత్‌కు జీ–20 ప్రశంసలు
♦ స్టార్టప్ ఫండింగ్, వ్యాపార సులభతర నిర్వహణలో భేష్ ♦ వృద్ధి విషయంలో కలసి సాగాలని నేతల నిర్ణయం హాంబర్గ్: స్థిరమైన, సమ్మిళిత వృద్ధి కోసం భారత్ తీసుకుంటున్న చర్యల్ని, ప్రపంచ ఆర్థిక రంగానికి అందిస్తున్న తోడ్పాటును జీ–20 దేశాల కూటమి ప్రశంసించింది. వ్యాపార సులభతర నిర్వహణ, స్టార్టప్ ఫండింగ్, కార్మిక సంస్కరణల విషయంలో భారత్ చేపడుతున్న చర్నల్నీ కొనియాడింది. జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన జీ–20 దేశాల సదస్సు ఇందుకు వేదికగా నిలిచింది. ప్రధాని మోదీ సహా ప్రపంచంలోని 20 బడా ఆర్థిక వ్యవస్థల దేశాధినేతలు ఇందులో పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ల్లో డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్లతో ఆర్థికంగా ప్రాచుర్యం పొందుతోందంటూ ఈ సమావేశం తన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొనడం గమనార్హం. భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి తీసుకుంటున్న చర్యల్లో ఇదీ భాగమేనని పేర్కొంది. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వ్యాపార సులభతర నిర్వహణను ముందుకు తీసుకెళ్లేందుకు స్టార్టప్‌లకు విదేశీ రుణాల సదుపాయం కల్పిస్తోందని ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ చర్యల్లో కొన్నింటిని ఈ ఏడాది జీ–20 సభ్య దేశాలు కూడా ఆచరించినట్టు పేర్కొంది. కార్మికుల భద్రత, మహిళా కార్మికుల ప్రాతినిధ్యం పెంచేందుకు భారత్ చేపట్టిన సంస్కరణలను మెచ్చుకుంది. సులభతర వ్యాపారం విషయంలో అంతర్జాతీయంగా మన దేశం గతేడాది 130వ స్థానంలో ఉండగా, టాప్–50లో నిలవాలన్నది మోదీ సర్కారు లక్ష్యం. అయితే, ఈ విషయంలో మన దేశ చర్యల్ని జీ–20 కూటమి గుర్తించడంతో ఈ ఏడాది ర్యాంకుల్లో మన స్థానం మరింత మెరుగుపడుతుందన్న ఆశలు చిగురించాయి. ప్రపంచ వృద్ధి బలహీనంగానే... ‘‘ప్రపంచ ఆర్థిక రంగం మెరుగుపడుతోంది. పెట్టుబడులూ పెరిగాయి. వాణిజ్యం, తయారీ గాడిన పడుతున్న సంకేతాలున్నాయి. అయినప్పటికీ ఈ వృద్ధి పథం ఇంకా బలహీనంగానే ఉంది. దిగువ స్థాయి సవాళ్లు అలానే ఉన్నాయి. బలహీన ఉత్పాదక వృద్ధి, ఆదాయంలో అసమతుల్యం, పెరిగిపోతున్న వృద్ధ జనాభా దీర్ఘకాలంలో వృద్ధికి సవాళ్లు’’ అని జీ–20 సదస్సు తన కార్యాచరణ ప్రణాళికలో వెల్ల డించింది. ఆర్థిక రంగం ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం, వేగవంతమైన వృద్ధికి చర్యలు తీసుకోవడం, సంస్థాగత సంస్కరణలను అమలు చేయడంపై నూతన విధానపరమైన చర్యల్ని పరిగణనలోకి తీసుకుంది. అంతర్జాతీయంగా పారదర్శకమైన, ఆధునిక పన్ను వ్యవస్థ కోసం జీ–20 కృషి కొనసాగుతుందని ఈ సదస్సు పేర్కొంది. విడిగానూ, సమష్టిగానూ ప్రపంచ వృద్ధి బలోపేతానికి, వచ్చే ఏడాది జీ–20 దేశాల ఉమ్మడి జీడీపీ 2 శాతం పెంచేందుకు కట్టుబడి ఉన్నట్టు జీ–20 దేశాధినేతలు ప్రకటించారు. -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును వచ్చే ఐదేళ్లలో ....2 శాతం పెంచాలి
సిడ్నీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును వచ్చే ఐదేళ్లలో ఇప్పటి స్థాయి నుంచి 2 శాతం మేర పెంచాలని జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, గవర్నర్ల సమావేశం పిలుపునిచ్చింది. అదేవిధంగా ఆటోమేటిక్‌గా పన్నుల సమాచారాన్ని పంచుకోవడం, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్కరణల అమలుపైనా కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించింది. భేటీ ముగింపు అనంతరం ఆదివారం ఇక్కడ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ అంశాలను పేర్కొన్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపైన కూడా సమావేశంలో దృష్టిపెట్టారు. ‘ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును రానున్న ఐదేళ్లలో 2 శాతం పైగా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే మరో 2 లక్షల కోట్ల డాలర్లకు పైగా జతకావాలి. ఇదే జరిగితే గణనీయమైన స్థాయిలో ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుంది. ఇప్పుడున్న విధానాల స్థానంలో మరింత వాస్తవికతతో కూడిన పాలసీలను తీసుకొచ్చేలా ప్రతిష్టాత్మక చర్యలతోనే ఇది సాధ్యం’ అని సంయుక్త ప్రకటన వెల్లడించింది. ఆటోమేటిక్‌గా పన్ను వివరాలను షేర్ చేసుకునేందుకు ఉద్దేశించిన కొత్త ప్రమాణాలను అమలు విషయంలో అన్నిపక్షాలతోనూ కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రమాణాలను 2015 చివరికల్లా జీ-20 దేశాలన్నీ ఆచరణలోకి తీసుకురావాలని నిర్ణయించారు. నల్లధనం, పన్ను ఎగవేతల సమస్యల పరిష్కారానికి ఈ సమాచార షేరింగ్ అనేది సజావుగా జరగాలని భారత్ ఎప్పటినుంచో ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు(ఎంఎన్‌సీలు) లాభాలను ఎక్కడైతే ఆర్జిస్తున్నాయో అక్కడే పన్నుకట్టాలన్న డిమాండ్‌కు కూడా జీ20 సమావేశం మద్దతు పలికింది. ఈ ఏడాది(2014) గ్లోబల్ వృద్ధి రేటు 3.7%గా ఉండొచ్చనేది ఐఎంఎఫ్ తాజా అంచనా. ఐఎంఎఫ్ సంస్కరణలపై... ఐఎంఎఫ్‌లో కోటా, పాలనపరమైన సంస్కరణల అమలు జాప్యం కావడం పట్ల(అమెరికా దీనికి ఇంకా ఆమోదముద్ర వేయాల్సి ఉంది)జీ20 సమావేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఏప్రిల్‌లో జరగనన్ను తదుపరి భేటీ నాటికి ఈ సంస్కరణలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేసింది. 2010లో అంగీకరించిన ఈ కోటా సంస్కరణలను ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాల్సి ఉంది. వీటివల్ల భారత్ వంటి వర్ధమాన దేశాలకు ఐఎంఎఫ్‌లో బలం పెరుగుతుంది. జీ20 కూటమిలో అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి వర్ధమాన దేశాలున్నాయి. మొ త్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వీటి పరిమాణం 85%.