ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును వచ్చే ఐదేళ్లలో ....2 శాతం పెంచాలి
సిడ్నీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును వచ్చే ఐదేళ్లలో ఇప్పటి స్థాయి నుంచి 2 శాతం మేర పెంచాలని జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, గవర్నర్ల సమావేశం పిలుపునిచ్చింది. అదేవిధంగా ఆటోమేటిక్‌గా పన్నుల సమాచారాన్ని పంచుకోవడం, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్కరణల అమలుపైనా కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించింది.
భేటీ ముగింపు అనంతరం ఆదివారం ఇక్కడ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ అంశాలను పేర్కొన్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపైన కూడా సమావేశంలో దృష్టిపెట్టారు. ‘ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును రానున్న ఐదేళ్లలో 2 శాతం పైగా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే మరో 2 లక్షల కోట్ల డాలర్లకు పైగా జతకావాలి. ఇదే జరిగితే గణనీయమైన స్థాయిలో ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుంది. ఇప్పుడున్న విధానాల స్థానంలో మరింత వాస్తవికతతో కూడిన పాలసీలను తీసుకొచ్చేలా ప్రతిష్టాత్మక చర్యలతోనే ఇది సాధ్యం’ అని సంయుక్త ప్రకటన వెల్లడించింది. ఆటోమేటిక్‌గా పన్ను వివరాలను షేర్ చేసుకునేందుకు ఉద్దేశించిన కొత్త ప్రమాణాలను అమలు విషయంలో అన్నిపక్షాలతోనూ కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రమాణాలను 2015 చివరికల్లా జీ-20 దేశాలన్నీ ఆచరణలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
నల్లధనం, పన్ను ఎగవేతల సమస్యల పరిష్కారానికి ఈ సమాచార షేరింగ్ అనేది సజావుగా జరగాలని భారత్ ఎప్పటినుంచో ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు(ఎంఎన్‌సీలు) లాభాలను ఎక్కడైతే ఆర్జిస్తున్నాయో అక్కడే పన్నుకట్టాలన్న డిమాండ్‌కు కూడా జీ20 సమావేశం మద్దతు పలికింది. ఈ ఏడాది(2014) గ్లోబల్ వృద్ధి రేటు 3.7%గా ఉండొచ్చనేది ఐఎంఎఫ్ తాజా అంచనా.
ఐఎంఎఫ్ సంస్కరణలపై...
ఐఎంఎఫ్‌లో కోటా, పాలనపరమైన సంస్కరణల అమలు జాప్యం కావడం పట్ల(అమెరికా దీనికి ఇంకా ఆమోదముద్ర వేయాల్సి ఉంది)జీ20 సమావేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఏప్రిల్‌లో జరగనన్ను తదుపరి భేటీ నాటికి ఈ సంస్కరణలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేసింది. 2010లో అంగీకరించిన ఈ కోటా సంస్కరణలను ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాల్సి ఉంది. వీటివల్ల భారత్ వంటి వర్ధమాన దేశాలకు ఐఎంఎఫ్‌లో బలం పెరుగుతుంది. జీ20 కూటమిలో అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి వర్ధమాన దేశాలున్నాయి. మొ త్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వీటి పరిమాణం 85%.