భారత్‌కు జీ–20 ప్రశంసలు
♦ స్టార్టప్ ఫండింగ్, వ్యాపార సులభతర నిర్వహణలో భేష్
♦ వృద్ధి విషయంలో కలసి సాగాలని నేతల నిర్ణయం
హాంబర్గ్: స్థిరమైన, సమ్మిళిత వృద్ధి కోసం భారత్ తీసుకుంటున్న చర్యల్ని, ప్రపంచ ఆర్థిక రంగానికి అందిస్తున్న తోడ్పాటును జీ–20 దేశాల కూటమి ప్రశంసించింది. వ్యాపార సులభతర నిర్వహణ, స్టార్టప్ ఫండింగ్, కార్మిక సంస్కరణల విషయంలో భారత్ చేపడుతున్న చర్నల్నీ కొనియాడింది. జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన జీ–20 దేశాల సదస్సు ఇందుకు వేదికగా నిలిచింది. ప్రధాని మోదీ సహా ప్రపంచంలోని 20 బడా ఆర్థిక వ్యవస్థల దేశాధినేతలు ఇందులో పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్‌ల్లో డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్లతో ఆర్థికంగా ప్రాచుర్యం పొందుతోందంటూ ఈ సమావేశం తన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొనడం గమనార్హం.
భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి తీసుకుంటున్న చర్యల్లో ఇదీ భాగమేనని పేర్కొంది. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వ్యాపార సులభతర నిర్వహణను ముందుకు తీసుకెళ్లేందుకు స్టార్టప్‌లకు విదేశీ రుణాల సదుపాయం కల్పిస్తోందని ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ చర్యల్లో కొన్నింటిని ఈ ఏడాది జీ–20 సభ్య దేశాలు కూడా ఆచరించినట్టు పేర్కొంది. కార్మికుల భద్రత, మహిళా కార్మికుల ప్రాతినిధ్యం పెంచేందుకు భారత్ చేపట్టిన సంస్కరణలను మెచ్చుకుంది. సులభతర వ్యాపారం విషయంలో అంతర్జాతీయంగా మన దేశం గతేడాది 130వ స్థానంలో ఉండగా, టాప్–50లో నిలవాలన్నది మోదీ సర్కారు లక్ష్యం. అయితే, ఈ విషయంలో మన దేశ చర్యల్ని జీ–20 కూటమి గుర్తించడంతో ఈ ఏడాది ర్యాంకుల్లో మన స్థానం మరింత మెరుగుపడుతుందన్న ఆశలు చిగురించాయి.
ప్రపంచ వృద్ధి బలహీనంగానే...
‘‘ప్రపంచ ఆర్థిక రంగం మెరుగుపడుతోంది. పెట్టుబడులూ పెరిగాయి. వాణిజ్యం, తయారీ గాడిన పడుతున్న సంకేతాలున్నాయి. అయినప్పటికీ ఈ వృద్ధి పథం ఇంకా బలహీనంగానే ఉంది. దిగువ స్థాయి సవాళ్లు అలానే ఉన్నాయి. బలహీన ఉత్పాదక వృద్ధి, ఆదాయంలో అసమతుల్యం, పెరిగిపోతున్న వృద్ధ జనాభా దీర్ఘకాలంలో వృద్ధికి సవాళ్లు’’ అని జీ–20 సదస్సు తన కార్యాచరణ ప్రణాళికలో వెల్ల డించింది. ఆర్థిక రంగం ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం, వేగవంతమైన వృద్ధికి చర్యలు తీసుకోవడం, సంస్థాగత సంస్కరణలను అమలు చేయడంపై నూతన విధానపరమైన చర్యల్ని పరిగణనలోకి తీసుకుంది. అంతర్జాతీయంగా పారదర్శకమైన, ఆధునిక పన్ను వ్యవస్థ కోసం జీ–20 కృషి కొనసాగుతుందని ఈ సదస్సు పేర్కొంది. విడిగానూ, సమష్టిగానూ ప్రపంచ వృద్ధి బలోపేతానికి, వచ్చే ఏడాది జీ–20 దేశాల ఉమ్మడి జీడీపీ 2 శాతం పెంచేందుకు కట్టుబడి ఉన్నట్టు జీ–20 దేశాధినేతలు ప్రకటించారు.