Startup Funding
-
ఏపీలో స్టార్టప్‌లకు భారీ ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్టార్టప్‌లకు భారీ ప్రోత్సాహానికి కీలక అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని స్టార్టప్‌లన్నింటికీ ఒకే చోట అన్ని పరిష్కారాలు లభించేలా ఏపీ స్టార్టప్ డాట్ ఇన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి అవసరమైన నిధులను సమకూర్చేవిధంగా ఇన్నొవేషన్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే టాప్ ఫండింగ్ కంపెనీల్లో ఒకటైన సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ రాష్ట్రంలోని స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో ఏడు స్టార్టప్‌లతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, మరో రెండు దశల తర్వాత ఎంపికైన సంస్థలకు ఫండింగ్ మొదలవుతుందని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) చైర్మన్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ స్టార్టప్స్, డీప్‌టెక్ ఇండియాలు సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో సుమారు రూ.1,000 కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేసిన విధంగానే రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయనున్నామని, దీనికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ స్ఫూర్తినిచ్చినట్లు తెలిపారు. గుజరాత్ తరహాలోనే ప్రారంభంలో రూ.100 కోట్లతో స్టార్టప్ ఫండ్ స్టార్ట్ చేస్తే దానికి కేంద్రం నుంచి కూడా అంతేమొత్తం అందించేలా తోడ్పాటును అందిస్తానని చెప్పారన్నారు. దీంతో ఏపీ స్టార్టప్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫండింగ్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ ముందుకు వచ్చిందన్నారు. ఆ సంస్థ భాగస్వాములు రమేష్ లోగనాథం, విక్రాంత్ వర్షిణి విశాఖలోని 40 మందికిపైగా హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఎంపికైన స్టార్టప్‌కు రూ.50 లక్షల నుంచి రూ. 8 కోట్ల వరకు సక్సీడ్ సమకూరుస్తుందన్నారు. ప్రారంభంలో రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేసి, అనంతరం రూ.1,000 కోట్లకు చేర్చి స్టార్టప్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
స్టార్టప్‌లకు నిధులు: 40 శాతం ఢమాల్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక-రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో దేశీ స్టార్టప్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 40 శాతం పడిపోయి 6.8 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. పీడబ్ల్యూసీ ఇండియా రూపొందించిన స్టార్టప్ డీల్స్ ట్రాకర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంకుర సంస్థల్లో సగటున 5 మిలియన్ డాలర్ల స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల్లో 60 శాతం వాటాను ప్రారంభ దశలోని అంకుర సంస్థలే దక్కించుకున్నాయి. వరుసగా మూడు త్రైమాసికాల పాటు 10 బిలియన్ డాలర్ల పైగా నిధులు సమకూర్చుకున్న దేశీ స్టార్టప్ వ్యవస్థ ఈ ఏడాది (2022) రెండో త్రైమాసికంలో 6.8 బిలియన్ డాలర్లు మాత్రమే సమకూర్చుకోగలిగిందని నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా పేర్కొంది. టెక్నాలజీ స్టాక్స్ వేల్యుయేషన్లు పడిపోవడం, ద్రవ్యోల్బణం ఎగియడం, అంతర్జాతీయంగా మందగమనం, భౌగోళిక-రాజకీయ అనిశ్చితి తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది. సాస్ కంపెనీల్లోకి అత్యధికంగా నిధులు.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్), ఫిన్‌టెక్ కంపెనీల్లోకి అత్యధికంగా 3.1 బిలియన్ డాలర్ల మేర నిధులు వచ్చాయి. ప్రారంభ దశలోని అంకుర సంస్థల్లోకి పెట్టుబడులు సుమారు 800 మిలియన్ డాలర్ల స్థాయిలో స్థిరంగా కొనసాగుతున్నాయి. రాబోయే త్రైమాసికాల్లోనూ ఇదే ధోరణి ఉండవచ్చని లేదా డిజిటైజేషన్ ఊతంతో మరింతగా పెరగవచ్చని నివేదిక తెలిపింది. మొత్తం మీద నిధుల ప్రవాహం ఒక స్థాయిలో స్థిరపడటానికి 12-18 నెలలు పట్టొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ఈలోగా స్టార్టప్‌లు తాము నిధులు సమకూర్చుకునేందుకు అవసరమైన విధంగా వ్యాపారాలను తీర్చిదిద్దుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ అమిత్ నావ్కా పేర్కొన్నారు. వివిధ దశల్లో ఉన్న స్టార్టప్‌ల వేల్యుయేషన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. నివేదికలోని మరిన్ని వివరాలు .. ♦ బెంగళూరు, ముంబై, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) కీలక స్టార్టప్ నగరాలుగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో వీటి వాటా 95 శాతంగా ఉంది. చెన్నై, పుణె ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ♦ బెంగళూరులో ఏడు కంపెనీలు 100 మిలియన్ డాలర్ల పైగా సమీకరించాయి. డైలీహంట్, ర్యాపిడో, లీడ్స్క్వేర్డ్, లెన్స్‌కార్ట్, క్రెడ్, ఎథర్ ఎనర్జీ, అబ్జర్వ్.ఏఐ వీటిలో ఉన్నాయి. ♦ ఎన్సీఆర్లో 7 కంపెనీలు 100 మిలియన్ డాలర్ల పైగా సమీకరించాయి. ♦ ముంబైలో నాలుగు కంపెనీలు తలో 100 మిలియన్ డాలర్లు అందుకున్నాయి. అప్‌గ్రాడ్, జెప్టో, కాయిన్‌డీసీఎక్స్, టర్టిల్‌మింట్ వీటిలో ఉన్నాయి. ♦ 2022 రెండో త్రైమాసికంలో దేశీయంగా నాలుగు అంకుర సంస్థలు మాత్రమే యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్) హోదా దక్కించుకున్నాయి. అంతర్జాతీయంగా యూనికార్న్‌ల సంఖ్య 1,200కి చేరింది. ఇక, డెకాకార్న్‌ల సంఖ్య (10 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్నవి) 57కి చేరింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కొత్తగా నాలుగు సంస్థలు ఈ జాబితాలోకి చేరాయి. -
భారత్‌కు జీ–20 ప్రశంసలు
♦ స్టార్టప్ ఫండింగ్, వ్యాపార సులభతర నిర్వహణలో భేష్ ♦ వృద్ధి విషయంలో కలసి సాగాలని నేతల నిర్ణయం హాంబర్గ్: స్థిరమైన, సమ్మిళిత వృద్ధి కోసం భారత్ తీసుకుంటున్న చర్యల్ని, ప్రపంచ ఆర్థిక రంగానికి అందిస్తున్న తోడ్పాటును జీ–20 దేశాల కూటమి ప్రశంసించింది. వ్యాపార సులభతర నిర్వహణ, స్టార్టప్ ఫండింగ్, కార్మిక సంస్కరణల విషయంలో భారత్ చేపడుతున్న చర్నల్నీ కొనియాడింది. జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన జీ–20 దేశాల సదస్సు ఇందుకు వేదికగా నిలిచింది. ప్రధాని మోదీ సహా ప్రపంచంలోని 20 బడా ఆర్థిక వ్యవస్థల దేశాధినేతలు ఇందులో పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ల్లో డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్లతో ఆర్థికంగా ప్రాచుర్యం పొందుతోందంటూ ఈ సమావేశం తన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొనడం గమనార్హం. భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి తీసుకుంటున్న చర్యల్లో ఇదీ భాగమేనని పేర్కొంది. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వ్యాపార సులభతర నిర్వహణను ముందుకు తీసుకెళ్లేందుకు స్టార్టప్‌లకు విదేశీ రుణాల సదుపాయం కల్పిస్తోందని ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ చర్యల్లో కొన్నింటిని ఈ ఏడాది జీ–20 సభ్య దేశాలు కూడా ఆచరించినట్టు పేర్కొంది. కార్మికుల భద్రత, మహిళా కార్మికుల ప్రాతినిధ్యం పెంచేందుకు భారత్ చేపట్టిన సంస్కరణలను మెచ్చుకుంది. సులభతర వ్యాపారం విషయంలో అంతర్జాతీయంగా మన దేశం గతేడాది 130వ స్థానంలో ఉండగా, టాప్–50లో నిలవాలన్నది మోదీ సర్కారు లక్ష్యం. అయితే, ఈ విషయంలో మన దేశ చర్యల్ని జీ–20 కూటమి గుర్తించడంతో ఈ ఏడాది ర్యాంకుల్లో మన స్థానం మరింత మెరుగుపడుతుందన్న ఆశలు చిగురించాయి. ప్రపంచ వృద్ధి బలహీనంగానే... ‘‘ప్రపంచ ఆర్థిక రంగం మెరుగుపడుతోంది. పెట్టుబడులూ పెరిగాయి. వాణిజ్యం, తయారీ గాడిన పడుతున్న సంకేతాలున్నాయి. అయినప్పటికీ ఈ వృద్ధి పథం ఇంకా బలహీనంగానే ఉంది. దిగువ స్థాయి సవాళ్లు అలానే ఉన్నాయి. బలహీన ఉత్పాదక వృద్ధి, ఆదాయంలో అసమతుల్యం, పెరిగిపోతున్న వృద్ధ జనాభా దీర్ఘకాలంలో వృద్ధికి సవాళ్లు’’ అని జీ–20 సదస్సు తన కార్యాచరణ ప్రణాళికలో వెల్ల డించింది. ఆర్థిక రంగం ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం, వేగవంతమైన వృద్ధికి చర్యలు తీసుకోవడం, సంస్థాగత సంస్కరణలను అమలు చేయడంపై నూతన విధానపరమైన చర్యల్ని పరిగణనలోకి తీసుకుంది. అంతర్జాతీయంగా పారదర్శకమైన, ఆధునిక పన్ను వ్యవస్థ కోసం జీ–20 కృషి కొనసాగుతుందని ఈ సదస్సు పేర్కొంది. విడిగానూ, సమష్టిగానూ ప్రపంచ వృద్ధి బలోపేతానికి, వచ్చే ఏడాది జీ–20 దేశాల ఉమ్మడి జీడీపీ 2 శాతం పెంచేందుకు కట్టుబడి ఉన్నట్టు జీ–20 దేశాధినేతలు ప్రకటించారు.