
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో సమాచార దుర్వినియోగాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం కలిగించే ఇటువంటి చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. అర్జెంటీనాలోని సలాట నగరంలో జరిగిన జీ–20 డిజిటల్ ఎకానమీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో అసలు రాజీ పడమని, ఒకవేళ ఎవరైనా విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. డిజిటల్ మీడి యా ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఇతర రంగాలకు మళ్లించాల్సిన అవసరముందని చెప్పారు. ఈ సైబర్ ప్రపంచంలో మెరుగైన భద్రతతో కూడిన సేవలు అందించినప్పడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు లాభం చేకూరుతుందని రవిశంకర్ తెలిపారు. సైబర్ మాధ్యమాల ద్వారా విస్తరిస్తున్న తప్పుడు వార్తలను అరికట్టేందుకు అంతర్జాతీయ సమాజం కలసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు.