సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల్లో బిల్లుల క్లియరెన్స్‌కు నిరీక్షణ తప్పేలా లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిధుల విడుదలకు కొంతకాలం బ్రేక్ పడనున్నట్లు అధికారవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం నుంచి చెల్లింపులకు రెండు, మూడు త్రైమాసికాలు అత్యంత కీలకం. తొలి త్రైమాసికంగా బడ్జెట్ సర్దుబాట్లు, ఇతరాత్రా కారణాలతో చెల్లింపుల ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఆ తర్వాత నుంచి నిధుల లభ్యత, ప్రాధాన్యతలకు అనుగుణంగా చెల్లింపుల్లో వేగం పుంజుకుంటుంది.
కానీ ఈసారి సంక్షేమ శాఖలకు రెండో త్రైమాసికంలో నిధులు విడుదల కాలేదు. పలు రకాల చెల్లింపులు నిలిచిపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ప్రధానంగా పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు భారీగా పేరుకుపోయాయి. సంక్షేమ శాఖలు ఆమోదించి ఖజానా విభాగానికి పంపించినప్పటికీ అక్కడ క్లియరెన్స్ రాని బిల్లులు దాదాపు రూ.1,175 కోట్లు ఉన్నాయి.
ఇవిగాకుండా సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన డైట్ చార్జీలు మరో రూ.675 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.1,850 కోట్లు ఖజానా విభాగంలో పెండింగ్‌లో ఉండగా... ఇవి రెండో త్రైమాసికంలో వస్తాయని అధికారులు భావించారు. చివరి నిమిషం వరకు సంక్షేమాధికారులు వేచిచూసినప్పటికే నిరాశే మిగిలింది. ఈ క్రమంలో మూడో త్రైమాసికంలోనైనా ఈ నిధులకు మోక్షం కలుగుతుందని భావించినప్పటికీ ఎన్నికల నేపథ్యంలో వాటి విడుదలలో జాప్యం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
చివరి క్వార్టర్‌పైనే ఆశలు...
విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కింద దాదాపు 12.65లక్షల మంది లబ్ధిదారులుంటారు. వీరితో పాటు మరో 10 లక్షల మంది గురుకుల విద్యా సంస్థలు, సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్నారు. ఈ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు ఎంతో కీలకం. కోర్సును ముందుకు సాగించాలన్నా... వసతిగృహంలో ఉండాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే దిక్కు.
కొంతకాలంగా ఈ రెండు పథకాలకు, డైట్ చార్జీల విడుదలలోనూ జాప్యం చేస్తూ వచ్చింది. క్షేత్రస్థాయి నుంచి గురుకులాలు, వసతిగృహాలు, సంక్షేమ అధికారుల ద్వారా ఆమోదం పొందిన బిల్లులన్నీ ఖజానా విభాగంలో నిలిచిపోయాయి. గతేడాది నవంబర్ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉపకారవేతన నిధుల విడుదల నిలిచిపోయింది. ఇవన్నీ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించినవే.
ఇవిగాకుండా 2022–23 విద్యా సంవత్సరం దరఖాస్తు పరిశీలన. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు బిల్లులు రూపొందించి ఆమోదించిన బిల్లులకు గత రెండు త్రైమాసికాల్లో రిక్తహస్తం చూపిస ప్రభుత్వం మూడో త్రైమాసికంలోనైనా నిధులు విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత... చివరి త్రైమాసికంలోనే నిధులు విడుదలయ్యే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment