స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా శిక్షణ, నైపుణ్యాల మెరుగుదలకు సంక్షేమ శాఖలు చర్యలు చేపట్టాయి.
* మారుతీ సంస్థ సహకారం
* స్వతంత్ర సంస్థ ద్వారా శిక్షణపై పర్యవేక్షణ
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా శిక్షణ, నైపుణ్యాల మెరుగుదలకు సంక్షేమ శాఖలు చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ర్ట ప్రభుత్వ ఆమోదముద్ర పడిన వెంటనే ఈ పథకాలు అమలులోకి రానున్నాయి. షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందినవారికి మారుతీ మోటార్స్ సంస్థ ద్వారా డ్రైవింగ్‌లో ప్రొఫెషనల్ శిక్షణను అందించనున్నారు.
డ్రైవింగ్ లెసైన్స్ ఉండి, అనుభవమున్నవారికి మరింత మెరుగైన శిక్షణతోపాటు వృత్తిపరంగా ఆయా బాధ్యతల నిర్వహణలో భాగంగా ఇతరులతో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై కూడా ప్రత్యేక అవగాహనను ఇచ్చేలా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇంగ్లిష్‌లో ప్రవేశమున్నవారిని గుర్తించి వారికి ప్రత్యేకమైన శిక్షణను అందించనున్నారు. ఎస్టీ కార్పొరేషన్ (ట్రైకార్), బీసీ కార్పొరేషన్ ద్వారా ఆయా శిక్షణా కార్యక్రమాలను అమలుచేస్తారు.
వెబ్‌సైట్ ద్వారా ఔత్సాహికుల వివరాలు సేకరణ
ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఔత్సాహిక యువకులు, నిరుద్యోగుల నుంచి (డ్రైవింగ్ లెసైన్స్, వృత్తి అనుభవమున్నవారు) వారి వివరాలు సమాచారాన్ని సేకరించి వారి ఆలోచనలు, అభిలాషలను విశ్లేషిస్తారు. సొంతంగా ట్యాక్సీలు, ఆటోలు నడుపుకోవాలని ఆలోచనతో ఉన్నవారికి ఆయా కార్పొరేషన్ల ద్వారా డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద అందుకు అవసరమైన రుణాలు అందజేస్తారు. డ్రైవర్లుగా పనిచేయాలని అనుకుంటున్నవారి విద్యార్హతలు, ఇంగ్లిష్‌లో ప్రవేశాన్ని బట్టి ఆయా కంపెనీలు, సంస్థల అవసరాల మేరకు డ్రైవర్లుగా పంపిస్తారు.
సరుకు రవాణాను ఇష్టపడేవారికి అందుకు అవసరమైన టిప్పర్లు, ఇతర వాహనాలను సమకూరుస్తారు. అద్దెపై ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటోలు నడుపుకోవాలనేవారికి ఆ మేరకు అవకాశాలను కల్పిస్తారు. స్వయం ఉపాధి పథకాల లబ్ధిదారులకు ఆయా ప్రయోజనాలు అందాక వారు వాటిని ఏ విధంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న దానిని స్వతంత్ర సంస్థ ద్వారా ఎస్టీ, బీసీ శాఖలు పర్యవేక్షించనున్నాయి. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు లబ్ధిదారుల పనీతీరును బేరీజు వేసి, అధికారులకు నివేదికలను పంపించనున్నారు.