గురుకులాలన్నింటికీ శాశ్వత భవనాలు
శాసనసభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు చెందిన అన్ని గురుకుల పాఠశాలలకు ఒకే తరహా శాశ్వత భవనాలను నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ భవనాల నిర్మాణానికిగాను డిజైన్లు తయారు చేస్తున్నామని, ఫిబ్రవరిలోపు అన్ని చోట్లా స్థలాలను సేకరించి మార్చిలో భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం శాసనసభలో వెల్లడించారు.
సంక్షేమ గురుకులాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు హన్మంత్ షిండే, శంకర్‌నాయక్, శోభ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటివరకు అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించి మొత్తం 299 గురుకుల పాఠశాలలుంటే, తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండున్నరేళ్లలోనే 487 గురుకుల పాఠశాలలను అదనంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.23 కోట్ల చొప్పున రూ.11,200 కోట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.