ఉండవల్లిలో ఆరోగ్య రధంలోని పరికరాలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరమంతా పరీక్షేనని, డిసెంబర్ లోగా అన్ని పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆయన బుధవారం సంక్షేమ శాఖల పనితీరుపై ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరేలా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది ఎక్కువ మందికి ఫలితాలు అందే పథకాలను అమలు చేయాలన్నారు. జిల్లాల్లో అక్కడి పరిస్థితులను బట్టి పథకాల అమలు ఉండాలన్నారు. ప్రజలకు స్వల్ప కాలంలో అత్యధిక లబ్ధి చేకూరాలన్నారు.
పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అన్ని సంక్షేమ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో వైఫై కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు ఉండాలన్నారు. వివిధ సంక్షేమ శాఖలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, చేసిన ఖర్చుల గణాంకాలను అధికారులు సీఎంకు వివరించారు. పథకాల అమల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
కుప్పం ఓటర్ల రుణం తీర్చుకోలేనిది
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గ టీడీపీ ప్రజాప్రతినిధులతో గ్రీవెన్స్ హాల్‌లో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా వరుసగా తనను గెలిపిస్తున్న కుప్పం ఓటర్ల రుణం తీర్చుకోలేనిదన్నారు.
రాష్ట్రంలో మరో 14 డయాలసిస్ కేంద్రాలు
కిడ్నీ బాధితుల కోసం రాష్ట్రంలో మరో 14 చోట్ల డయాలసిస్ (రక్తశుద్ధి) కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాడేరు, రంపచోడవరం, తుని, అమలాపురం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసరావుపేట, మాచర్ల, ఆత్మకూరు, మదనపల్లి, కుప్పం, కదిరి, రాయచోటి, ఆదోని పట్టణాల్లో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్న వారికి కూడా పింఛన్లు ఇవ్వాలని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా ఎ.కొండూరులో కిడ్నీ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లా కనిగిరి, కృష్ణా జిల్లా ఎ.కొండూరు ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment