వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను ఇక నుంచి గ్రామస్థాయిలోనే జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను ఇక నుంచి గ్రామస్థాయిలోనే జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న కొత్త పథకం ‘గ్రామజ్యోతి’ ద్వారా ప్రస్తుత విధానాల్లో ముఖ్యమైన మార్పులను తీసుకురానుంది. ఈ నెలాఖరుకల్లా ఈ పథకాల అమలుకు సంబంధించి అనుసరించాల్సిన విధానం, కిందిస్థాయిలో విధుల నిర్వహణ వంటి అంశాల్లో స్పష్టత రావొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల ద్వారా వర్తింపజేసే ఆయా పథకాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది.
ఇప్పటివరకు ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వ శాఖలు, ముఖ్యంగా సంక్షేమ శాఖల ధోరణిలో మార్పు తీసుకొచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కిందిస్థాయి నుంచి ప్రభుత్వపరంగా చేపట్టే ఆయా పథకాలను అమలుచేయడం వల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చనే అభిప్రాయంతో ఉంది. గ్రామస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక అనేది కచ్చితంగా జరిగేందుకు, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అవకాశముంటుందని అధికారులు అంచనావేశారు.
దీంతో లబ్ధిదారులను గుర్తించేందుకు అవసరమైన సమాచారాన్ని, వివరాలను గ్రామస్థాయిలో సేకరించేందుకు సులువు అవ్వడంతో పాటు ఎంపిక పారదర్శకతకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధానంతో ఆయా సంక్షేమశాఖలు నిర్దేశించుకున్న లక్ష్యాలను సంపూర్ణంగా సాధించవచ్చున ని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అన్నీ గ్రామస్థాయిల్లోనే: ఈ విధానంతో వివిధ శాఖల ద్వారా అమలుచేసే పథకాలను పకడ్బందీగా అమలు చేయోచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి దాకా ఆయా సంక్షేమశాఖలు జిల్లాల వారీగా పథకాలకు నిధుల కేటాయించి చేతులు దులుపుకున్న పరిస్థితికి భిన్నంగా జవాబుదారీతనం, పారదర్శకతను పాటించేలా చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విధానం ద్వారా పట్టణ, గ్రామీణ అనే తేడాలు లేకుండా ఆయా నిష్పత్తులకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపులకు అవకాశం ఉంటుందనే అంచనాకు వచ్చింది.