Gram Jyothi
-
గ్రామజ్యోతి ఎజెండాగా టీఆర్ఎస్ఎల్పీ భేటీ
* నేడు తెలంగాణ భవన్లో సీఎం అధ్యక్షతన సమావేశం * జెడ్పీ చైర్పర్సన్లకు ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధి, మౌలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమమే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ శాసనసభాపక్షం (టీఆర్ఎస్ఎల్పీ) భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ఈ భేటీకి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి. గ్రామజ్యోతి పూర్తిగా గ్రామీణ సమస్యలు, వసతుల కల్పనకు సంబంధించినది కావడంతో జెడ్పీ చైర్పర్సన్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. రానున్న నాలుగేళ్ల కాలానికి ప్రణాళికలు రూపొందించే దిశలో గ్రామజ్యోతిని నిర్వహించనున్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీ శ్రేణులనూ ఈ కార్యక్రమంతో మమేకం చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చన్న భావనలో అధికార టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. ఈ కారణంగానే ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కల్పించనున్నారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకునేలా టీఆర్ఎస్ఎల్పీ నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశాలన్నింటినీ చర్చించడం, గ్రామజ్యోతిని విజయవంతం చేయడం కోసం సలహాలు, సూచనలు స్వీకరించే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతిని ప్రారంభించనుండటం, ఆ తర్వాత జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు టీఆర్ఎస్ఎల్పీ భేటీలో కర్తవ్య బోధ చేస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దీనిపై విపక్షాలు అనవసర విమర్శలు చేయకుండా నోళ్లు మూయించే వ్యూహంపైనా సీఎం తమ సభ్యులకు ఈ సమావేశంలో సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినందున సమావేశాల గురించి కూడా ఈ భేటీలో చర్చించే వీలుందంటున్నారు. -
గ్రామస్థాయిలోనే లబ్ధిదారుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను ఇక నుంచి గ్రామస్థాయిలోనే జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న కొత్త పథకం ‘గ్రామజ్యోతి’ ద్వారా ప్రస్తుత విధానాల్లో ముఖ్యమైన మార్పులను తీసుకురానుంది. ఈ నెలాఖరుకల్లా ఈ పథకాల అమలుకు సంబంధించి అనుసరించాల్సిన విధానం, కిందిస్థాయిలో విధుల నిర్వహణ వంటి అంశాల్లో స్పష్టత రావొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల ద్వారా వర్తింపజేసే ఆయా పథకాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకు ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వ శాఖలు, ముఖ్యంగా సంక్షేమ శాఖల ధోరణిలో మార్పు తీసుకొచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కిందిస్థాయి నుంచి ప్రభుత్వపరంగా చేపట్టే ఆయా పథకాలను అమలుచేయడం వల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చనే అభిప్రాయంతో ఉంది. గ్రామస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక అనేది కచ్చితంగా జరిగేందుకు, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అవకాశముంటుందని అధికారులు అంచనావేశారు. దీంతో లబ్ధిదారులను గుర్తించేందుకు అవసరమైన సమాచారాన్ని, వివరాలను గ్రామస్థాయిలో సేకరించేందుకు సులువు అవ్వడంతో పాటు ఎంపిక పారదర్శకతకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధానంతో ఆయా సంక్షేమశాఖలు నిర్దేశించుకున్న లక్ష్యాలను సంపూర్ణంగా సాధించవచ్చున ని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అన్నీ గ్రామస్థాయిల్లోనే: ఈ విధానంతో వివిధ శాఖల ద్వారా అమలుచేసే పథకాలను పకడ్బందీగా అమలు చేయోచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి దాకా ఆయా సంక్షేమశాఖలు జిల్లాల వారీగా పథకాలకు నిధుల కేటాయించి చేతులు దులుపుకున్న పరిస్థితికి భిన్నంగా జవాబుదారీతనం, పారదర్శకతను పాటించేలా చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విధానం ద్వారా పట్టణ, గ్రామీణ అనే తేడాలు లేకుండా ఆయా నిష్పత్తులకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపులకు అవకాశం ఉంటుందనే అంచనాకు వచ్చింది.