* నేడు తెలంగాణ భవన్‌లో సీఎం అధ్యక్షతన సమావేశం
* జెడ్పీ చైర్‌పర్సన్లకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధి, మౌలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమమే ప్రధాన ఎజెండాగా టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం (టీఆర్‌ఎస్‌ఎల్పీ) భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ఈ భేటీకి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి.
గ్రామజ్యోతి పూర్తిగా గ్రామీణ సమస్యలు, వసతుల కల్పనకు సంబంధించినది కావడంతో జెడ్పీ చైర్‌పర్సన్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. రానున్న నాలుగేళ్ల కాలానికి ప్రణాళికలు రూపొందించే దిశలో గ్రామజ్యోతిని నిర్వహించనున్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీ శ్రేణులనూ ఈ కార్యక్రమంతో మమేకం చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చన్న భావనలో అధికార టీఆర్‌ఎస్ నాయకత్వం ఉంది. ఈ కారణంగానే ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కల్పించనున్నారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకునేలా టీఆర్‌ఎస్‌ఎల్పీ నిర్ణయం తీసుకోనుంది.
ఈ అంశాలన్నింటినీ చర్చించడం, గ్రామజ్యోతిని విజయవంతం చేయడం కోసం సలహాలు, సూచనలు స్వీకరించే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతిని ప్రారంభించనుండటం, ఆ తర్వాత జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో కర్తవ్య బోధ చేస్తారని చెబుతున్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దీనిపై విపక్షాలు అనవసర విమర్శలు చేయకుండా నోళ్లు మూయించే వ్యూహంపైనా సీఎం తమ సభ్యులకు ఈ సమావేశంలో సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినందున సమావేశాల గురించి కూడా ఈ భేటీలో చర్చించే వీలుందంటున్నారు.
గ్రామజ్యోతి ఎజెండాగా టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
Published Wed, Aug 12 2015 3:00 AM | Last Updated on Thu, May 24 2018 3:02 PM
Advertisement
Advertisement