TRSLP meeting
-
టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభం
-
దసరాలోపే నామినేటెడ్ పోస్టుల భర్తీ
హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దసరా పండుగలోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. వారంలోగా నామినేటెడ్ పోస్టులకు ఆశావహుల జాబితాను అందించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. గురువారం ముగిసిన టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఏ క్షణంలోనైనా ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రావొచ్చునని, అప్రమత్తంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరిస్తే పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికలపై సర్వే నిర్వహించామని, వరంగల్‌లో 67శాతం, నారాయణఖేడ్‌లో 52శాతం మనకే అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయని తెలిపారు. త్వరలో 17 కార్పొరేషన్ల చైర్మన్ పదవులను భర్తీ చేస్తామని భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు ఐదు చైర్మన్ పదవులు ఇస్తామని చెప్పారు. దసరా నుంచే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రులు అందర్నీ కలుపుకొనిపోవాలని, పార్టీలో కొత్తా, పాతా భేదం చూపొద్దని కేజీఆర్ సూచించారు. విపక్షాలను దీటుగా ఎదుర్కోవాలని నిర్దేశించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం ముగియడంతో కాసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీకి బయలుదేరారు. ఈ నెల 23, 24 తేదీల్లో మరోసారీ టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనుంది. -
టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ భవన్లో గురువారం టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నామినేటెడ్ పోస్టులను, పార్టీ పదవులను, మార్కెట్ కమిటీలను ఖరారు చేసే అవకాశముంది. -
టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌పై మంత్రుల్లో టెన్షన్
హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంపై తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ పట్టుకుంది. కేబినెట్లో మార్పులకు సంబంధించి గురువారం జరిగే ఈ సమావేశంలో స్పష్టం వచ్చే అవకాశముంది. కేబినెట్లో మార్పులు తప్పవని సీనియర్ మంత్రులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నామినేటెడ్ పోస్టులను, పార్టీ పదవులను, మార్కెట్ కమిటీలను ఖరారు చేసే అవకాశముంది. -
గ్రామజ్యోతి ఎజెండాగా టీఆర్ఎస్ఎల్పీ భేటీ
* నేడు తెలంగాణ భవన్లో సీఎం అధ్యక్షతన సమావేశం * జెడ్పీ చైర్పర్సన్లకు ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధి, మౌలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమమే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ శాసనసభాపక్షం (టీఆర్ఎస్ఎల్పీ) భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ఈ భేటీకి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి. గ్రామజ్యోతి పూర్తిగా గ్రామీణ సమస్యలు, వసతుల కల్పనకు సంబంధించినది కావడంతో జెడ్పీ చైర్పర్సన్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. రానున్న నాలుగేళ్ల కాలానికి ప్రణాళికలు రూపొందించే దిశలో గ్రామజ్యోతిని నిర్వహించనున్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీ శ్రేణులనూ ఈ కార్యక్రమంతో మమేకం చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చన్న భావనలో అధికార టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. ఈ కారణంగానే ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కల్పించనున్నారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకునేలా టీఆర్ఎస్ఎల్పీ నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశాలన్నింటినీ చర్చించడం, గ్రామజ్యోతిని విజయవంతం చేయడం కోసం సలహాలు, సూచనలు స్వీకరించే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతిని ప్రారంభించనుండటం, ఆ తర్వాత జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు టీఆర్ఎస్ఎల్పీ భేటీలో కర్తవ్య బోధ చేస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దీనిపై విపక్షాలు అనవసర విమర్శలు చేయకుండా నోళ్లు మూయించే వ్యూహంపైనా సీఎం తమ సభ్యులకు ఈ సమావేశంలో సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినందున సమావేశాల గురించి కూడా ఈ భేటీలో చర్చించే వీలుందంటున్నారు.