దసరాలోపే నామినేటెడ్ పోస్టుల భర్తీ
హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దసరా పండుగలోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు తెలిపారు. వారంలోగా నామినేటెడ్ పోస్టులకు ఆశావహుల జాబితాను అందించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. గురువారం ముగిసిన టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఏ క్షణంలోనైనా ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రావొచ్చునని, అప్రమత్తంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరిస్తే పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికలపై సర్వే నిర్వహించామని, వరంగల్లో 67శాతం, నారాయణఖేడ్లో 52శాతం మనకే అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయని తెలిపారు.
త్వరలో 17 కార్పొరేషన్ల చైర్మన్ పదవులను భర్తీ చేస్తామని భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు ఐదు చైర్మన్ పదవులు ఇస్తామని చెప్పారు. దసరా నుంచే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రులు అందర్నీ కలుపుకొనిపోవాలని, పార్టీలో కొత్తా, పాతా భేదం చూపొద్దని కేజీఆర్ సూచించారు. విపక్షాలను దీటుగా ఎదుర్కోవాలని నిర్దేశించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం ముగియడంతో కాసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని ఐడీహెచ్ కాలనీకి బయలుదేరారు. ఈ నెల 23, 24 తేదీల్లో మరోసారీ టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనుంది.