ఉపకార దరఖాస్తుకు గడువు పూర్తి
Published Thu, Aug 31 2017 2:20 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
- రెండు నెలలు పొడిగించాలన్న సంక్షేమ శాఖలు
- వెలువడని ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరాని (2017–18)కి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల సమర్పణకు గడువు బుధవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 13.5 లక్షలమంది విద్యార్థులు ఉంటారని సంక్షేమశాఖలు అంచనా వేశాయి. అయితే, ఇప్పటివరకు 5.2లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో గడువును 2 నెలలు పొడిగించాలంటూ 15 రోజుల క్రితమే ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈనెల 30లోగా ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుందని ఎస్సీ అభివృద్ధి శాఖ భావించింది. అయితే, బుధవారం సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో వెబ్‌సైట్‌లో తేదీ పెంపును పక్కనపెట్టింది. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఒకరు సాక్షితో అన్నారు.
ప్రవేశాలు పూర్తికానందునే..
జూనియర్ కాలేజీలతో పాటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈపాస్ వెబ్‌సైట్‌లో కళాశాలల రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు. దీంతో ఉపకారవేతనాలు, ఫీజు పథకాలకు సంబంధించి ఎక్కువమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో పొడిగింపు అనివార్యమైంది.
Advertisement
Advertisement