30న మునిసిపల్ ఎన్నికలు
ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఎట్టకేలకు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 30వ తేదీన ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడిస్తారు. ప్రచార ఖర్చు మునిసిపాలిటీలకు లక్ష, కార్పొరేషన్లకు లక్షన్నర పరిమితిగా విధించారు.
నామినేషన్ల ప్రక్రియ ఈనెల 10వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు ఉంటుంది. మార్చి 15న నామినేషన్ల పరిశీలన, 18న ఉపసంహరణకు చివరి రోజు. పార్టీ గుర్తులపైనే జరిగే ఈ ఎన్నికలలో మొత్తం 11వేల ఈవీఎంలు ఉపయోగిస్తారు. ఏదో కారణంతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయని, ఈ విషయంలో హైకోర్టు సీరియస్ అయ్యిందని ఆయన చెప్పారు. ఎన్నికల ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన స్ఫష్టం చేశారు. హైకోర్టు తమకు డెడ్ లైన్ విధించిందని, అందుకే త్వరగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.