బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో కాలుతో ఓటు వేస్తున్న దివ్యాంగుడు సతీష్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో గణనీయంగా ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. 129 పురపాలికల్లో మొత్తం 70.26 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) బుధవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించింది. మొత్తంగా చూస్తే ఓటేసిన వారిలో మహిళలు 69.94 శాతం, పురుషులు 68.8 శాతం, ఇతరులు 8.36 శాతం మంది ఓటర్లు ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 93.31 శాతం నమోదు కాగా, మేడ్చల్ జిల్లా నిజాంపేట కార్పొరేషన్‌లో అత్యల్పంగా 39.65 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు జరిగిన అన్ని మున్సిపాలిటీల్లోని మొత్తం ఓట్లకు 49,75,093గాను 34,95,322 ఓట్లు పోలయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 88.32 శాతం పోలింగ్, అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 50.32 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో గ్రామ పంచాయతీలు, నగరపంచాయతీలుగా ఉన్న కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ బాగా జరగ్గా, నగర శివార్లలోని మున్సిపాలిటీల్లో ఓటర్లు కొంతమేర బద్ధకించినట్లు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఎక్కడా కూడా రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించలేదు. టెండర్ ఓట్లు నమోదు అయినట్లు కూడా ఎస్‌ఈసీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.
ఘర్షణలు.. వాగ్వాదాలు.. : వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య పలుచోట్ల స్వల్ప ఘర్షణలు, వాగ్వాదాలు, డబ్బు పంపిణీ ఆరోపణలు, కొన్నిచోట్ల పోలీసులకు ఫిర్యాదు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు తమ తమ మున్సిపాలిటీల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం 120 మున్సిపాలిటీల్లోని 2,647 వార్డులకు (80 ఏకగ్రీవాలు మినహాయించి), 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు (ఒక ఏకగ్రీవస్థానం కాకుండా) వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తంగా 7,613 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటి పరిధిలో ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహణకు ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటే.. 24న రీపోలింగ్ నిర్వహించి, 25న ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఫలితాలు ప్రకటిస్తారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డుల్లో పైలట్ ప్రాజెక్టు కింద తొలిసారిగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని విజయవంతంగా ఉపయోగించి ఓటేసేందుకు అర్హులైన ఓటర్లను గుర్తించారు. జీహెచ్‌ఎంసీలోని డబీర్‌పురా డివిజన్‌లోనూ ఉప ఎన్నిక జరిగింది. కాగా, బుధవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం ముగిసింది. 24న ఈ కార్పొరేషన్‌లోని 58 డివిజన్లకు (రెండు ఏకగ్రీవాలు మినహా) ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. 27న ఫలితాలు ప్రకటిస్తారు. బుధవారం ఓటింగ్ సందర్భంగా మొత్తం 2,072 పోలింగ్ కేంద్రాల్లో వీడియో కవరేజీ, 2,406 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్‌కాస్టింగ్ నిర్వహించారు.
భైంసాలో పోలింగ్ ప్రశాంతం
భైంసా (ముథోల్): నిర్మల్ జిల్లా భైంసాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 23 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 64.70 శాతం పోలింగ్ నమోదైంది.
ఒక్కనిమిషం వ్యవధిలోనే ఓటర్ల గుర్తింపు
ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విజయవంతం
కుత్బుల్లాపూర్: ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో భాగం గా దేశంలోనే తొలిసారిగా కొంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విజయవంతమైంది. దూలపల్లి– కొంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం జరిగిన పురపాలిక ఎన్నికల నేపథ్యంలో 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31, 32 బూత్‌లలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని ఒక్క నిమిషం వ్యవధిలోనే యాప్ ద్వారా గుర్తిస్తూ క్లియరెన్స్ ఇవ్వడంతో వేగంగా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది.
పోలింగ్ ప్రశాంతం ఫలించిన పోలీస్ వ్యూహాలు
రాష్ట్రవ్యాప్తంగా మున్సి పల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిం టదని శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఎక్కడా గొడవలు తలెత్తలేదన్నారు. మొత్తం 50 వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారన్నారు. ఏఆర్, సివిల్, టీఎస్‌ఎస్‌పీ పోలీసులతోపాటు ఫారెస్టు, ఎక్సైజ్, విద్యుత్, విజిలెన్స్‌కు చెందిన ఉద్యోగులు కూడా విధుల్లో పాల్గొన్నారని వివరించారు. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదన్నారు. ఎన్నికల కోసం పోలీసులు వ్యవహరించిన పలు వ్యూహాలు ఫలితాలనిచ్చాయని పలువురు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఓటేసిన మంత్రి
కోదాడ / సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌లో సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు నెహ్రూనగర్‌లోని పోలింగ్ కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆయన సతీమణి సునిత ఓటు వేశారు.
కోదాడలో ఉత్తమ్...
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 14వ వార్డు పోలింగ్ కేంద్రంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విదేశాల నుంచి..
హుజూరాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలువురు విదేశాల నుంచి స్వస్థలాలకు వచ్చారు. ఖతార్, ఆస్ట్రేలియా, దుబాయ్, న్యూజిలాండ్‌ల నుంచి స్వదేశాలకు వచ్చి ఓటేశారు.
నరేశ్.. శభాష్
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని 37 వార్డులో స్థానికుడైన నరేశ్ రెండు చేతులు లేకున్నా.. బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటును వేయడం ఆనందంగా ఉందన్నారు.
ఓటు బహిర్గతం
మెట్‌పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఓ అభ్యర్థికి వేసిన ఓటు బహిర్గతమైంది. గుర్తుతెలియని ఓటరు ఓటు ను ఫోన్‌లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఇది వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది.
ఓటుకు ముక్కు పుడక
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపాలిటీ అడ్లూర్ పరిధిలోని ఇల్చిపూర్‌లో పంగ లింగం నుంచి ఓటర్లకు పంచుతున్న 33 బంగారు ముక్కు పుడకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment