
మీరు బతికే ఉన్నారా?
‘ఆసరా’ కావాలంటే నిరూపించుకోవాల్సిందే
* మూడు నెలలకోసారి ‘మీసేవ’లో నమోదు
* వచ్చే నెల నుంచి బ్యాంకు, పోస్టల్ ఖాతాల్లోకే పింఛన్లు
* తొలుత కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల నుంచి వివరాల సేకరణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రతి నెలా పింఛను కావాలంటే లబ్ధిదారులు ఇకపై మూడు నెలలకోసారి తాము బతికున్నట్లు నిరూపించుకోవాల్సిందే! అప్పుడే పింఛను పొందగలుగుతారు. అయితే పింఛను కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు.
వచ్చే నెల నుంచి పట్టణాలు, నగరాల్లో, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా విధానాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ, గీత కార్మికులు సహా మొత్తం 35.79 లక్షల మంది ప్రతి నెలా సామాజిక పింఛన్లు పొందుతున్నారు. ఈ డబ్బుల కోసం వారు ప్రభుత్వ కార్యాలయాల వద్ద గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల రోజుల తరబడి తిరుగుతున్న దాఖలాలున్నాయి.
ఇకపై పింఛన్లను నేరుగా బ్యాంకు/పోస్టాఫీస్ ఖాతాల ద్వారా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విధానం వల్ల లబ్ధిదారుల్లో ఎంత మంది బతికున్నారో/చనిపోయారో తెలియని పరిస్థితి నెలకొనే అవకాశముంది. ఒకవేళ లబ్ధిదారులు మరణించినప్పటికీ డబ్బులు మాత్రం బ్యాంకు ఖాతాలో జమ అవుతూనే ఉంటాయని, ఆ మొత్తాన్ని వారి కుటుం బసభ్యులు ఏటీఎం ద్వారా తీసుకునే అవకాశముందని అధికారులు గ్రహించారు.
పింఛను సొమ్ము పక్కదారి పట్టకుండా
ప్రతి మూడు నెలలపాటు పింఛన్‌ను బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఇలా చేయడం వల్ల లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోతే తెలిసిపోతుందని, తద్వారా పింఛను సొమ్ము పక్కదారి పట్టకుండా చూడగలమని అధికారులు చెబుతున్నారు. ‘కరీంనగర్ జిల్లాలో గత మూడు నెలల్లోనే 21,362 మంది లబ్ధిదారులను పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. ఇందులో అనర్హులతోపాటు చనిపోయిన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు’ అని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో చాలా చోట్ల పోస్టాఫీస్ ఖాతాల ద్వారా డబ్బులను పంపిణీ చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో వచ్చే నెల నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పింఛను డబ్బులు తీసుకునేందుకు వస్తున్న సమయంలోనే లబ్ధిదారుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తోంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ వివరాలు సేకరించే పనిలో పడ్డా రు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో బిల్ కలెక్టర్లు, పురపాలక సిబ్బంది ఈ పని చేస్తున్నారు. వివరాల సేకరణ కార్యక్రమం గ్రామాల్లో కొంత మందకొడిగా జరుగుతోంది. గ్రామీణ లబ్ధిదారుల నుంచి ఆశించిన మేరకు వివరాలు రావడం లేదని గ్రహించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తొలుత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనే జూలై నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.
ప్రతి మూడు నెలలకోసారి
ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారుడు తాను బతికే ఉన్నానంటూ సర్టిఫికెట్ తెచ్చి చూపించేలా కొత్త నిబంధన రూపొందించారు. ఇందుకోసం తహశీల్దార్/మున్సిపాలిటీ/ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా దగ్గర్లోని మీ సేవా/ఆధార్ కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. తద్వారా సామాజిక పింఛను లబ్ధిదారులు ఆయా కేంద్రాలకు వెళితే... అక్కడున్న సిబ్బంది లబ్ధిదారుల వేలి ముద్రలను సరిపోల్చుతారు. బయోమెట్రిక్ యంత్రాల్లో పొందుపర్చిన వేలి ముద్రలతో సరిపోతే లబ్ధిదారుడు ‘బతికే ఉన్నట్లుగా’ నమోదు చేసి సమాచారాన్ని అధికారులకు తెలియజేస్తారు.