సాక్షి, అమరావతి: ఈ నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. బీసీ పరిధిలోని వివిధ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు శంకర నారాయణ, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, మోపిదేవి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (‘జగనన్న పచ్చతోరణం’కు పకడ్బందీ ఏర్పాట్లు)
అందరికీ పథకాలు అందే విధంగా ప్రధాన బాధ్యతగా నడుచుకోవాలని సీఎం సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల రూపాయలను నగదు బదిలీ ద్వారా అందించామని సీఎం పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఇంత ఫోకస్‌గా గతంలో ఎవరూ, ఎప్పుడూ పని చేయలేదని సీఎం స్పష్టం చేశారు. రూపాయి లంచం, వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నామన్నారు. కొత్త వాటితో కలుపుకుని మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో 69 కులాలకే ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు మొత్తం బీసీ కులాలన్నింటికీ కార్పొరేషన్లలో ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment