చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరునెల్వేలి, తూత్తుకుడి కార్పొరేషన్లకు మేయర్లు, 8 మునిసిపాలిటీలకు చైర్‌పర్సన్లు, ఖాళీగా ఉన్న 3,075 వార్డులకు ఉప ఎన్నికల నిర్వహణపై గత నెల 28వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్లు, ఉపసంహరణ పర్వం పూర్తయింది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాభవంతో చతికిలపడిన కాంగ్రెస్, డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే తదితర పార్టీలన్నీ స్థానిక సంస్థలకు ముఖం చాటేశాయి. తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు మాత్రమే రంగంలో నిలిచా యి. మోడీ రాకతో రాష్ట్రంలో బలంపుంజుకున్న రాష్ట్ర బీజేపీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ కోయంబత్తూరులో శనివారం తన ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించిన పార్టీలన్నీ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా తమిళిసై పిలుపునిచ్చారు. అన్నాడీఎంకేయేతర పార్టీలన్నీ బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆమె కోరారు.
బీజేపీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయడం లేదా కిడ్నాపులకు పాల్పడడం వంటి చేష్టలకు అన్నాడీఎంకే పాల్పడుతోందని తన ప్రచారంలో ఆరోపణలను సంధిస్తున్నారు. బీజేపీది జన బలం, అన్నాడీఎంకేది ధనబలమని ఆమె విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. శనివారం తిరుపూరు, కోవైలో, ఆదివారం కడలూరు, విరుదాచలం, సోమవారం తూత్తుకూడి, 16న రామనాథపురంలో తమిళిసై ప్రచారం చేయనున్నారు. మరో వైపు బీజేపీ తమిళనాడు శాఖ మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ శనివారం తూత్తుకూడి, రామనాథపురం, ఆదివారం కోవై, 15,16 తేదీల్లో కన్యాకుమారిలో పర్యటిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్ రాజా శనివారం తిరుపూరు, ఆదివారం రామనాధపురం, 16న కోవైలో ప్రచారం చేస్తారు. చెన్నై కార్పొరేషన్ 35 వ వార్డు అభ్యర్థి తరపున బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్ ప్రచారం ప్రారంభించారు.
నేటి నుంచి సీఎం జయ ప్రచారం
ప్రతిపక్ష బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుం డగా అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం తూత్తుకూడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్‌లో తూత్తుకూడికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆదివారం కోయంబత్తూరులో ప్రచారం నిర్వహిస్తారు. ఆ తరువాత ఎక్కడికి వెళ్లే ఖరారు కావాల్సి ఉంది.
మొదలైన ‘స్థానిక’ ప్రచారం
Published Sun, Sep 14 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
Advertisement