ఓడితే.. ఊడుద్ది
సాక్షి, చెన్నై:రాష్ర్టంలో స్థానిక ఉప ఎన్నికల సందడి నెలకొం ది. అధికార పక్షం చర్యల పుణ్యమా ఈ ఉప ఎన్నికలు వచ్చాయన్నది జగమెరిగిన సత్యం. తూత్తుకుడి, తిరునల్వేలి కార్పొరేషన్లలో మేయర్లుగా ఉన్న వాళ్లను రాజ్య సభకు పంపించి ఎన్నికలు అనివార్యం చేశారు. ఇదే పరిస్థితి పలు మునిసిపాలిటీల్లోను ఉంది. చైర్మన్లను అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నిలబెట్టి ఎమ్మెల్యేలను చేశారు. అలాగే, మరి కొందరు సీఎం జయలలిత ఆగ్రహానికి గురై పదవులను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో తూత్తుకుడి, తిరునల్వేలి, కోయంబత్తూరు కార్పొరేషన్ల మేయర్ల పదవులకు, మరో 8 మునిసిపాలిటీ చైర్మన్ల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎనిమిదింటిలో రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం అయినా, మిగిలిన ఆరు మునిసి పాలిటీలు, మూడు మేయర్ల స్థానాల్ని కైవశం చేసుకోవడం లక్ష్యంగా అన్నాడీఎంకే పరుగులు తీస్తున్నది. ఈ ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ బహిష్కరించాయి. ఈ స్థానాల్లో బీజేపీ, అన్నాడీఎంకేలు ప్రత్యక్ష సమరంలోకి దిగాయి. మంత్రుల్లో గుబులు : సమరం బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య నెలకొనడంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. డీఎంకే, కాంగ్రెస్ మినహా తక్కిన పార్టీలన్నీ బీజేపీకి మద్దతు ప్రకటించాయి. ఆ పార్టీల ఓటు బ్యాంకు బీజేపీకి కలిసి వచ్చినట్టే. అలాగే, పరోక్షంగా డీఎంకే ఓటు బ్యాంక్ అనుకూలమయ్యే అవకాశాలు ఎక్కువే.
ఇది కాస్త అన్నాడీఎంకేలో కలవరాన్ని రేపుతోంది. ఆయా ప్రాంతాల్లోని స్థానికంగా ఉండే ప్రతి పక్ష నాయకులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో గెలుపు కోసం శ్రమించాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే అభ్యర్థులకు ఏర్పడింది. స్వయంగా సీఎం జయలలిత సైతం ప్రచారానికి దిగడం బట్టి చూస్తే, ఓట్ల కోసం ఏ మేరకు ప్రజల్ని ఆకర్షించాల్సి వస్తున్నదోనన్నది గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఉప సమరం పలువురు మంత్రుల్లో గుబులు రేపుతోంది. మూడు కార్పొరేషన్లు, ఆరు మునిసిపాలిటీలకు ఆయా జిల్లాల మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా జయలలిత నియమించారు. అదే సమయంలో అభ్యర్థులు ఓడిన పక్షంలో వేటు తప్పదని, పదవులు ఊడుతాయని హెచ్చరికను చేయడంతో ఆ మంత్రుల్లో బెంగ పట్టుకుంటుంది.
బుజ్జగింపులు : మేయర్ పదవులకు, మునిసిపాలిటీ చైర్మన్ పదవులకు పోటీ నెలకొంది. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. జీపులెక్కి రోడ్ షోల రూపంలో ఆకర్షించే పనుల్లో పడ్డారు. అలాగే, తాయిలాల పంపిణీకి తమ జేబులను గుల్ల చేసుకుంటున్నారు. అదే సమయంలో మంత్రులకు కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో తాము విస్మరించిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం మంత్రుల్ని ఇరకాటంలో పడేస్తోంది. దీంతో వారిని బుజ్జగించేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే, పై పైకి మంత్రులకు హామీలు ఇస్తున్నా, లోలోపల ఆయన పదవి ఊడితే, తమకు చాన్స్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇక, పదవులను దక్కించుకోవడమే లక్ష్యంగా నాయకులను కలుపుకుని మంత్రులు ఓట్ల వేటలో తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఎంత శ్రమించినా, అభ్యర్థి ఓడిన పక్షంలో తాము మాజీలు అయ్యేది ఖాయమన్న ఆందోళన ఆ మంత్రుల్లో నెలకొనటం గమనార్హం. ఈ దృష్ట్యా, స్థానిక ఉప సమరం అనంతరం ఎవరెవరి మంత్రి పదవులు ఊడుతాయోనని వేచి చూడాల్సిందే.