
ఖమ్మం: గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ పనులకు మళ్లీ ఆటంకం ఏర్పడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు శుద్ధి చేసిన నీటినే నదులు, వాగుల్లోకి వదలాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేయడంతోఫిల్టర్‌బెడ్ నిర్మాణం చేపడితేనే కాల్వ ఆధునికీకరణ పనులు ముందుకు సాగనున్నాయి. దీంతో నిర్మాణానికి నిధులు మంజూరై.. పనులు పూర్తయితేనే చానల్ ఆధునికీకరణ పనులు ముందుకెళ్లనున్నాయి. ప్రజాప్రతినిధులు చానల్ నిర్మాణ పనులు త్వరితగతిన జరిగేందుకు ఫిల్టర్‌బెడ్ నిర్మాణానికి నిధులు తీసుకొస్తేనే గోళ్లపాడు చానల్ కోసం ఎదురుచూస్తున్న త్రీటౌన్ పరిధిలోని పదివేల కుటుంబాల ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.
దశాబ్దాల చరిత్ర
నాలుగైదు దశాబ్దాల క్రితం గోళ్లపాడు చానల్‌ను తవ్వించారు. అప్పట్లో నగరం తక్కువ విస్తీర్ణం, అతి తక్కువ జనాభాతో ఉండేది. ఖమ్మం శివారులోని పంట పొలాలకు మున్నేరు నీరు అందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. దానవాయిగూడెం నుంచి పంపింగ్ వెల్‌రోడ్, సుందరయ్యనగర్, ప్రకాశ్‌నగర్, ధంసలాపురం ప్రాంతాల్లోని పంట పొలాలకు ఈ కాలువ ద్వారా నీరు అందించేవారు. కాలక్రమేణా జనాభా పెరిగి పట్టణం కాస్తా నగర స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే గోళ్లపాడు చానల్‌పై అనేక మంది పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. పంట కాలువ కాస్తా నగరం విస్తరించటంతో మురికి కాలువగా రూపాంతరం చెందింది. సారథినగర్ నుంచి ప్రకాశ్‌నగర్ వరకు దీని విస్తీర్ణం 4.75 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ కాలువపై సుమారు 10వేల కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఇక్కడి వారు ప్రస్తుతం మురికి కూపంలో జీవనం సాగిస్తున్నారు. వర్షం పడితే ఇళ్లలోకే మురికి నీరు చేరుతుంది. కాలువపై జీవిస్తుండటంతో అనేక మంది రోగాల బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు పక్కా ఇళ్లు నిర్మించాలని, అప్పటి వరకు తమను ఇబ్బందులకు గురిచేయొద్దని నిర్వాసితులు కోరుతున్నారు.
నిధులు మంజూరు చేసిన సీఎం
ఫిబ్రవరి 15న అక్కడికి వచ్చిన సీఎం కేసీఆర్ గోళ్లపాడు చానల్ వల్ల కలిగే ఇబ్బందులను గుర్తించారు. చానల్ ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా కేటాయించిన రూ.100కోట్ల నిధుల్లో.. రూ.56కోట్లు గోళ్లపాడు చానల్ పనులకు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో 2016, నవంబర్ 13న ఖమ్మంలో పర్యటించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనుల పురోగతి కొద్దిగా మందగించింది. గోళ్లపాడు ఆధునికీకరణ వల్ల ఇళ్లు కోల్పోయే నిర్వాసితులకు న్యాయం చేసే విషయంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇలా పనులు ప్రారంభం కాకముందే మరో షాక్ తగిలింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఇప్పుడు గోళ్లపాడు చానల్ ద్వారా వచ్చే మురుగు నీటిని ఫిల్టర్ చేస్తేనే.. ఆ నీటిని మున్నేరులో వదిలే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఫిల్టర్‌బెడ్ నిర్మాణంపై అటు పాలకవర్గం, స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫిల్టర్‌బెడ్ నిర్మాణం కోసం రూ.20కోట్ల మేరకు వ్యయం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నిధులను తెప్పించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఏదేమైనా ఇప్పటికే ఆలస్యమవుతున్న గోళ్లపాడు చానల్‌కు ఇదో ఆటంకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment