disbelief
-
కాంగ్రెస్ 'అవిశ్వాస' రాజకీయాలు.. తెరవెనుక కీలక నేతలు!
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ కొత్త పంథాలో వెళ్తోంది. గ్రేటర్ పరిధిలో పార్టీ బలం పెంచుకోవడంపై ఫోకస్ పెంచింది. ముఖ్య నేతలను తమవైపుకు తిప్పుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల మున్సిపాలిటీలపై హస్తం నేతలు కన్నేశారు. మున్సిపల్ ప్రజా ప్రతినిధులు చాలా మంది తిరుబాటు జెండా ఎగురవేశారు. దీని వెనక కీలక నేతల హస్తం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ తెర ముందు జరుగుతున్న మంత్రాంగానికి తెర వెనక ఉన్న నేతలు ఎవరు అనే దానిపై ఆసక్తి కరమైన చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఫలితాలు సాధించలేదు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో.. దీన్ని అధిగమించి మంచి ఫలితాలు సాధించాలనే దానిపై హస్తం నేతలు దృష్టి పెట్టారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. దీనికి బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతల సహకారం లభించడంతో వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. చేవెళ్ల పార్లమెంట్‌కు కాంగ్రెస్ తరపున వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత తీసుకున్నారు. స్వయంగా సీఎం బాధ్యత ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా మొట్ట మొదటగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్‌పై దృష్టి పెట్టారు. ఇక్కడ మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉంటే.. 16 మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మేయర్ మహేందర్ గౌడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్‌కు వినతిపత్రం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ మహేందర్ గౌడ్‌ను దించేసి.. తిరుగుబాటు వర్గానికి చెందిన లతాప్రేమ్ గౌడ్‌ను మేయర్ పీఠంపై కూర్చొబెట్టాలని స్కెచ్ వేశారు. ప్రస్తుత మేయర్ మహేందర్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వర్గం కాగా.. లతా ప్రేమ్ గౌడ్ మాత్రం ఎంపీ రంజీత్ రెడ్డి వర్గం. ఇప్పుడు అవిశ్వాసం పెట్టి మహేందర్‌ను దించేసి.. ఎంపీ రంజీత్ రెడ్డి వర్గానికి చెందిన లతా ప్రేమ్ గౌడ్ మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. అయితే ఈ అవిశ్వాస తీర్మానం వెనక ఎంపీ రంజీత్‌రెడ్డి హస్తం ఉందనే టాక్ రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతోంది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న రంజీత్ రెడ్డి వర్గం తిరుగుబాటు చేయడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తిరుగుబాటు చేస్తున్న 16 మంది కార్పొరేటర్లు అందరూ హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. రంజీత్ వర్గానికి చెందిన నేతలంతా పార్టీ మారుతుండటంతో.. పార్లమెంట్ ఎన్నికల నాటికి రంజీత్ కూడా పార్టీ మారతాడా అనే చర్చ జోరుగా సాగుతోంది. చూడాలి ఈ వ్యవహారం మునుముందు ఎటువైపుకు దారి తీస్తుందనేదనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని జిల్లా పాలనాధికారి కార్యాలయంలో అదనపు కలెక్టర్‌కు పాత్రలను అందజేశారు. మొత్తం 24 సభ్యులకు 15 మంది బీఆర్ఎస్, ఇద్దరు బీజేపీ సభ్యులు మొత్తం 17మంది అదనపు కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస పత్రాలు అందజేశారు. ఇబ్రహీపట్నం మున్సిపాలిటీ నీ కాంగ్రెస్ కాపాడుకుంటుందా ? వదిలేసుకుంటుందా ? అనేది ఆసక్తిగా మారింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పైన అవిశ్వాస తీర్మానాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు. బీఆర్ఎస్, బీజేపీ, కౌన్సిలర్లు. కాంగ్రెస్ పార్టీ నుండి తొలత విజయం సాధించిన హార్దిక బీఆర్ఎస్ పార్టీలోకి చేరి చైర్మన్ అయ్యారు. మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నప్పటికీ హార్దిక స్థానంలో కాంగ్రెస్ వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది. -
నల్లగొండ మున్సిపల్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం
నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాసం పెట్టాలని గత నెల 8వ తేదీన కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయగా.. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఇన్చార్జి కలెక్టర్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 50 మంది సభ్యులున్న కౌన్సిల్లో అవిశ్వాస సమావేశానికి 47 మంది హాజరయ్యారు. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్ బండారు ప్రసాద్ సమావేశానికి రాలేదు. 41 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు పైకి ఎత్తారు. వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు చేతులు ఎత్తారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి సస్పెన్షన్‌కు గురైన పిల్లి రామరాజుయాదవ్ తటస్థంగా ఉన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు 35 మందితో పాటు బీజేపీ కౌన్సిలర్లు నలుగురు, గత ఎన్నికలకు ముందు బీజేపీ, ఎంఐఎం నుంచి బీఆర్ఎస్లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు ఎత్తడంతో 41 మంది మద్దతు లభించింది. ప్రభుత్వానికి నివేదిక నల్లగొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాసం నెగ్గిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలతో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాలు రాగానే చైర్మన్ ఎన్నిక కోసం 50 మంది సభ్యులకు నోటీసులు అందించనున్నారు. ఆ తరువాత సమావేశం నిర్వహించి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. -
పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల కూడా గడువక ముందే చాలా పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం ఊపందుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మునిసిపాలిటీలో గురువారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు మునిసిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గగా మరో ఏడు మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలపై చర్చకు జిల్లా కలెక్టర్లు కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరుగనుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో అవిశ్వాస నోటీసుకు స్పందించిన కలెక్టర్ ఈ నెల 8న పాలకమండలిని సమావేశపరిచారు. అదేరోజు నల్లగొండలోనూ సమావేశం జరగనుంది. 11న మంచిర్యాల మునిసిపాలిటీ పాలకమండలి సమావేశం కానుండగా ఆ సమావేశంలోనే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్, ఆ తరువాత గంటకే కొత్త చైర్పర్సన్, వీసీ ఎన్నిక ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లితోపాటు నస్పూర్ మునిసిపాలిటీ సమావేశం ఈ నెల 12న జరగనుంది. కాగజ్‌నగర్ మునిసిపాలిటీ చైర్పర్సన్ సద్దాం హుస్సేన్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 20న సభ సమావేశం కానుంది. అలాగే ఈ నెల 19న సిద్దిపేట జిల్లా చేర్యాల మునిసిపాలిటీ సమావేశం జరగనుంది. ఇంకా చాలా మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు ఇచ్చిన నోటీసులపై జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్నారు. అవిశ్వాసాల నుంచి తప్పించుకోవడానికి సుమారు 15 మంది మునిసిపల్ చైర్పర్సన్లు కాంగ్రెస్‌లో చేరినా పదవీగండం తప్పేలా లేదు. మరికొన్ని చోట్ల నోటీసులకు సిద్ధం.. నల్లగొండ జిల్లాలో నల్లగొండ మునిసిపాలిటీతోపాటు నేరే డుచెర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మునిసిపాలిటీల్లో అవిశ్వాసాల రగడ నడుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీ లతోపాటు మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, గుండ్లపో చంపల్లి, నిజాంపేట మునిసిపాలిటీలు, పీర్జాదిగూడ, జవహ ర్‌నగర్ కార్పొరేషన్లలో నోటీసులు జారీ చేసేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌లో చేరిన ఇందుప్రియపై బీఆర్ఎస్ అవిశ్వాస నోటీసుకు సిద్ధమవుతోంది. కరీంనగర్లో జమ్మికుంట మునిసిపల్ చైర్‌పర్సన్‌పై ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొన్నగంటి మల్లయ్య అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అయితే రామగుండం కార్పొరేషన్లో అవిశ్వాసం ఆలోచన తమ సభ్యులకు లేదని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అసమ్మతి సభ్యుల నుంచే.. సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 128 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లకుగాను మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా నాలుగైదు పాలక మండళ్లనే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. పురపాలక చట్టం ప్రకారం పాలకమండలి మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక అవిశ్వాస లేదా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉండగా ఈ తీర్మానాల గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మునిసిపల్ చట్టంలో మార్పులు చేసింది. అయితే అది గవర్నర్ ఆమోదం పొందలేదు. దీంతో గతేడాది జనవరి 27 తరువాత 36 మునిసిపాలిటీలు, పలు కార్పొరేషన్లలో బీఆర్ఎస్ అసమ్మతి సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. వారికి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తోడై చైర్పర్సన్లు, మేయర్లను గద్దె దించాలని ప్రయత్నించారు. అయితే గత ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు పాలకమండళ్లను సమావేశపరచకపోవడం, ఈలోగా మునిసిపల్ చైర్పర్సన్లు, మేయర్లు కోర్టుకెక్కి స్టే తెచ్చుకోవడంతో అప్పట్లో అవిశ్వాసాలకు బ్రేక్ పడింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవిశ్వాస తీర్మానాల్లో మళ్లీ కదలిక మొదలైంది. ‘ఆర్మూర్’చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం పదవి కోల్పోయిన వినీత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె భర్త బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారనే..! ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మునిసిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆమె తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మునిసిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌కు చెందిన 24 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. మరో 12 మంది కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. 2020 జనవరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా 33వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పండిత్ వినీత గెలిచారు. అప్పట్లో చైర్పర్సన్ పదవికి బీసీ మహిళా రిజర్వేషన్ కలిసి రావడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చైర్పర్సన్ భర్త పండిత్ పవన్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తూ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్ కౌన్సిలర్లు సంప్రదించగా ఆయన సూచన మేరకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నూతన మునిసిపల్ చైర్పర్సన్ ఎంపికపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నారు. -
బిల్లును ఓకే చేయించి.. అవిశ్వాసాలు ఆపేలా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో నెలకొన్న అవిశ్వాసాల గందరగోళానికి తెర దించాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొన్న 127 పట్టణ, నగర పాలక మండళ్లలో చాలా చోట్ల లుకలుకలు బహిర్గతమయ్యాయి. పలుచోట్ల ఇప్పటికే మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చారు. కొన్ని పట్టణాల్లో క్యాంపులు, కొనుగోళ్ల పర్వం కూ డా మొదలైంది. అవిశ్వాసాలు ప్రతిపాదించిన పట్ట ణాలు, నగరాల్లో అధికార బీఆర్ఎస్ పాలక మండళ్లే కొలువు తీరి ఉండటం, ప్రస్తుత మేయర్లు, చైర్పర్సన్లను గద్దె దించేందుకు సొంత పార్టీ ప్రతినిధులే అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. పట్టణ, నగర పాలక మండళ్లలో అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టేందుకు ఉన్న కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందితే మరో ఏడాది వర కు సమస్య ఉండదని భావిస్తోంది. రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించేలా పావులు కదుపుతోంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు విషయమై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ గవర్నర్‌ను కలవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ బిల్లు విషయంలో గవర్నర్‌కు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసి ఆమోదించాల్సిందిగా కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇన్నాళ్లుగా పెండింగ్‌లో.. తెలంగాణ మున్సిపల్ చట్టం– 2019 ప్రకారం నగర, పురపాలక సంఘాల్లో మేయర్/ డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్/వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు.. పాలక మండలి ఏర్పాటైన నాటి నుంచి కనీసం మూడేళ్లు గడువు పూర్తయి ఉండాలి. ఈ నిబంధనకు సవరణ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస కనీస గడువును నాలుగేళ్లకు పెంచుతూ మున్సిపల్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఆమోదించినా గవర్నర్ వద్ద పెండింగ్‌లో పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య ఏర్పడిన అగాథం నేపథ్యంలో గవర్నర్ వద్ద ఆగిన ఏడు బిల్లుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కూడా ఉంది. మరోవైపు రాష్ట్రంలోని పుర/నగర పాలక సంస్థల పాలక మండళ్లకు గత నెల 26తో మూడేళ్ల పదవీకాలం పూర్తయింది. ఇదే అదనుగా అసమ్మతి ప్రజాప్రతినిధులు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. అవన్నీ కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోపే చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే సమస్యకు చెక్‌పడుతుందని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. -
సర్కార్‌పై అవిశ్వాసం పెడతాం!
సాక్షి, హైదరాబాద్: రైతాంగ సమస్యల పరిష్కారంపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని, దీనికి నిరసనగా సర్కార్‌పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉన్నామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి, డిప్యూటీ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. శాసన సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ తీరు అత్యంత అప్రజాస్వామికంగా ఉందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, శాసన వ్యవహారాల మంత్రి, వ్యవసాయ మంత్రి గంటలు గంటలు మాట్లాడారని, చివరకు ప్రతిపక్ష నేతకు కనీసం నిరసన తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ ప్రవర్తన పట్ల సీఎల్పీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. సచివాలయంలో అగ్నిమాపక వాహనం తిరగలేదని, శాసన సభలో సీఎం, స్పీకర్ వాహనాలు ఎండ లో ఉంటున్నాయని రూ.500 కోట్లు వెచ్చించి కొత్త సచివాలయం, శాసన సభ భవనాలు నిర్మిస్తామని అంటున్నారని మండిపడ్డారు. వాస్తు కారణంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టడానికి అబ్బసొత్తు కాదని, దీన్ని అడ్డుకుని తీరుతామని ఉత్తమ్ పేర్కొన్నారు. రుణమాఫీని విడతల వారీగా చేపట్టినందున రైతులపై వడ్డీ భారం పడిందని, వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పినా.. ఆ హామీని నిలబెట్టుకోవడం లేదన్నారు. రైతులు.. తహసీల్దార్లు, కాంగ్రెస్ నేతలు, బ్యాంక్ మేనేజర్లకు రుణమాఫీ తర్వాత వడ్డీ భారమెంతో వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధరపై బోనస్ ఇవ్వడం లేదని, విద్యుత్‌పైనా సీఎం, మంత్రులు పచ్చి అబద్దాలు మా ట్లాడుతున్నారని విమర్శించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, వ్యవసాయ సంక్షోభానికి, వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రతిపక్షాల మాట వినట్లేదు: జానారెడ్డి ప్రభుత్వం సమస్యలను దాటవేస్తోందని, సీఎం ఉపన్యాసాలు ఇస్తున్నారని, సభ నిబంధనల ప్రకారం నడవడం లేదని సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల మాటే వినడం లేదని, రుణ విముక్తి పూర్తిగా గందరగోళ అంశమని చెప్పారు. రుణాలపై వడ్డీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలో అసెంబ్లీ వేదికగా సీఎం హామీ ఇచ్చారని, వడ్డీ రూ.3 వేల నుంచి రూ.4 వేలు అవుతుండడం తో వెనక్కి తగ్గారన్నారు. సభలో నిరసన తెలుపుతామంటున్నా అవకాశం ఇవ్వడం లేదని, అంతా బావుందని రాష్ట్ర ప్రజలను భ్రమిం పజేస్తున్నారని తెలిపారు. సభలో అధికార పక్షం తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. -
చైర్మన్‌గిరి.. తమ్ముళ్ల కిరికిరి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీబీ) చైర్మన్‌గిరి కైవసానికి తమ్ముళ్లు కుస్తీ పడుతున్నారు. పదవి తమకిస్తేనే అవిశ్వాసంలో పాల్గొంటామని కొందరు డెరైక్టర్లు తెగేసి చెబుతుండటం గందరగోళానికి తావిస్తోంది. ఈ విషయంలో తొందరపడితే మొదటికే మోసం వస్తుందేమోనని టీడీపీ అధినేత ఆచితూచి అడుగేస్తున్నారు. ముందుగా చైర్మన్‌ను ఆ పదవి నుంచి దించాకే స్పష్టతనిస్తామని తేల్చి చెప్పినట్లు ఆ పార్టీ వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. చైర్పర్సన్ శ్రీదేవిపై అవిశ్వాసానికి టీడీపీ రంగం సిద్ధం చేయడం తెలిసిందే. కాంగ్రెస్ ఖాతాలోని చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా కొందరు డెరైక్టర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వీరి సహకారంతో ఎట్టకేలకు అవిశ్వాసానికి తెర తీశారు. అయితే చైర్మన్‌గిరి ఎవరికనే విషయం తమ్ముళ్లలో చర్చకు తావిస్తోంది. అవిశ్వాసానికి మద్దతు పలికిన డెరైక్టర్లు కొందరు ఈ విషయంలో స్పష్టతకు పట్టుబడుతున్నారు. అవుకుకు చెందిన రఘునాథరెడ్డి, నాగలాపురానికి చెందిన శ్రీనివాసులు, నంద్యాలకు చెందిన వీరేంద్రసింహారెడ్డి, మరో డెరైక్టర్ ప్రతాప్‌రెడ్డి చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఆ మేరకు టీడీపీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలవుతున్నారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తామని అధినేత తేల్చి చెప్పడంతో ఆశావహుల్లో నైరాశ్యం నెలకొంది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా ఆ తర్వాత పదవి తమకు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటని కొందరు డెరైక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టతనిస్తేనే మద్దతివ్వాలని వీరు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అవిశ్వాసానికి మద్దతిచ్చేందుకు కొందరు డెరైక్టర్లకు ఇప్పటికే టీడీపీ నేతలు కొంత మొత్తం ముట్టజెప్పగా.. ఆ మొత్తాన్ని చైర్మన్ అభ్యర్థి ద్వారా రాబట్టుకునేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. -
డీసీసీబీ కుంపటి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలో షురువైన ‘అవిశ్వాస’ ముసలం అధికార టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల్లో ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి వర్గం నాయకుల ఆశీస్సులతో వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి పావులు కదుపగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు దామోదర్‌రెడ్డి అదే పార్టీకి చెందిన మంత్రి జోగు రామన్న వర్గాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో డీసీసీబీలో ప్రారంభమైన ముసలం టీఆర్ఎస్లోని అగ్రనేతల్లో వర్గపోరుకు ఆజ్యం పోసినట్లవుతోంది. ఎలాగైనా డీసీసీబీపై టీఆర్ఎస్ జెండాను ఎగురవేయడంతోపాటు జిల్లా రాజకీయాల్లో తమ పట్టును నిలుపుకునేందుకు టీఆర్ఎస్లోని ఇరువర్గాల నేతలు తెరవెనుక పావులు కదుపుతున్నారు. మరోవైపు డీసీవో సూర్యచంద్రరావు నిర్వాకంతో ‘అవిశ్వాసం’ అంశం వివాదానికి దారి తీయడంతో ఈ వర్గపోరుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వరుస ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ క్రమంగా జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. ప్రాదేశిక ఎన్నికల్లో కూడా హవా కొనసాగించి ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్‌తోపాటు, అత్యధిక మండల పరిషత్లపైనా టీఆర్ఎస్ జెండాను ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ ఖాతాలో ఉన్న సహకార సంస్థలపై కూడా గులాబీ జెండాను ఎగురవేసేందుకు పావులు కదిపింది. ఈ క్రమంలోనే వేణుగోపాలాచారి ఆశీస్సులతో చంద్రశేఖర్‌రెడ్డి చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి తెరలేపడం.. చైర్మన్ మంత్రి రామన్నను ఆశ్రయించడం జరిగిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఈ డీసీసీబీ వివాదం అధికార పార్టీ అగ్రనేతల్లో గ్రూపు విభేదాలకు దారితీయడమే కాకుండా, సహకార పోరును రసకందాయంలో పడేసింది. టీడీపీ సహాయంతో వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం అవిశ్వాస తీర్మానం పెట్టిన వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి ఖానాపూర్ మండలం సత్తెనపల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ సత్తెనపల్లి పీఏసీఎస్ చైర్మన్ పదవిపై అవిశ్వాసం పెడితే డీసీసీబీలో ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చని డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి తెర వెనుక పావులు కదిపినట్లు సమాచారం. ఈ సొసైటీలోని టీడీపీకి చెందిన డెరైక్టర్లు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అనుచరులున్నారు. దామోదర్‌రెడ్డి సొదరుడు ప్రేమేందర్‌రెడ్డికి రాథోడ్ రమేష్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఈ టీడీపీ డెరైక్టర్ల మద్దతును కూడగట్టి చంద్రశేఖర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సొసైటీ బలపరీక్ష కోసం ఈ నెల 16న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డీసీవో సూర్యచంద్రరావు నిర్ణయించారు. టీఆర్ఎస్లోకి చైర్మన్, వైస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన దామోదర్‌రెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కొద్ది రోజుల్లోనే రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరికలు ఉండే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా దామోదర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరేందుకు ఇంతకుముందే ముహుర్తం ఖరారైనప్పటికీ.. అవిశ్వాసం అంశం తేలాకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయని, ఆయన అనుచరుడైన దామోదర్‌రెడ్డి ఆయనతో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కొనసాగింది. అయితే ప్రేంసాగర్‌రావు రాకను జిల్లా టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. -
వివాదానికి దారితీసిన అవిశ్వాసం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అవిశ్వాసం అంశం కొత్త వివాదానికి దారితీస్తోంది. గురువారం నాటి డీసీసీబీ ప్రత్యేక సమావేశం విషయంలో గందరగోళం నెలకొనడంతో ఈ ప్రత్యేక సమావేశాన్ని రేపటికి వాయిదా వేశామని ప్రకటించిన జిల్లా సహకార అధికారి(డీసీవో) సూర్యచంద్రరావు.. శుక్రవారం డీసీసీబీ సమావేశం హాలు వైపే రాకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టిన చంద్రశేఖర్‌రెడ్డితోపాటు అవిశ్వాసానికి మద్దతిస్తున్న డెరైక్టర్లు మాత్రం శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం హాల్‌కు వచ్చారు. డీసీవోతోపాటు అధికారులెవరూ అక్కడ లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో డీసీవో తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఆఫ్ చేశారని డెరైక్టర్లు తెలి పారు. డీసీవో పక్షపాత వైఖరిని నిరసిస్తూ ఉద యం నుంచి రాత్రి వరకు డీసీసీబీ కార్యాల యంలో ఆందోళనకు దిగారు. డీసీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చేవరకు కార్యాలయం నుంచి కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. డీసీవో తీరు వివాదాస్పదమవుతోంది. ప్రత్యేక సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి న డీసీవో శుక్రవారం ఉదయం చేతులెత్తేయడం అవిశ్వాస తీర్మానం పెట్టిన డెరైక్టర్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. శుక్రవారం సాయంత్రం వరకు ఎలాంటి సమావేశం నిర్వహించకపోవడంతో చైర్మన్ దామోదర్‌రెడ్డిపై పెట్టిన అవి శ్వాస తీర్మానం వీగిపోయిందా? నెగ్గిందా? అని ఎటూ తేలలేదు. డీసీవో మాత్రం గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటన మినహా అవిశ్వాసంపై స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కాగా, డీసీవో వైఖరిని నిరసిస్తూ డీసీసీబీ డెరైక్టర్లు రాత్రి 9.30 గంటల వరకు కార్యాలయం గదిలో ఉండి గడియ పెట్టుకుని నిరసన తెలిపారు. న్యాయ పోరాటం చేస్తాం : చంద్రశేఖర్‌రెడ్డి అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో డీసీవో వైఖరిపై న్యాయపోరాటం చేస్తామని వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. డీసీవో చైర్మన్‌కు వత్తాసు పలుకుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక సమావేశానికి 11 మంది డెరైక్టర్లు హాజరైతే కేవలం తొమ్మిది మంది సంతకాలు మాత్రమే తీసుకుని కోరం లేదనడం దారుణమని వివరించారు. ఎవరి ప్రయోజనాల కోసం డీసీవో ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం సమావేశం నిర్వహిస్తామని చెప్పిన జిల్లా సహకార అధికారి తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. ఆయనపై కలెక్టర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. -
రాజకీయ ప్రయోజనాలకే ‘అవిశ్వాసం’
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : రాజకీయ ప్రయోజనాల కోసమే సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తున్నారని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధికార ప్రతినిధి నరహరి వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే 50 మంది సభ్యుల మద్దతు అవసరమన్నారు. ఇది సాధ్యం కాదని తెలిసి నాయకులు అవిశ్వాస డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాసాన్ని బీజేపీ సమర్థించేది లేదని ఆయన స్పష్టం చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు పొడిగించి తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఏవిధంగా వ్యవహరించాలో జాతీయ నాయకులతో చర్చించేందుకు కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలవగానే చంద్రబాబు గుజరాత్ సీఎం మోడీని సమర్థిస్తున్నారన్నారు. టీడీపీ సీమాం ధ్ర ఎంపీలు తెలంగాణకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టిన తర్వాత కూడా టీటీడీపీ నాయకుల్లో మార్పు రాకపోవడం సరికాదన్నారు. టీటీడీపీ నాయకులు బీజేపీలో చేరితే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేద్దామని సూచించారు. బాబు నాయకత్వంలో పనిచేస్తారా మోడీ నాయకత్వంలో పనిచేస్తారో తేల్చుకోవాలన్నారు. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ పెద్ద రాష్ట్రాలను కోరుకుంటున్నారని విమర్శించారు. నాయకులు నాగపురి రాజమౌళి, కోడెల రామ్మూర్తి, దిలీప్‌నాయక్, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు.