సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలో షురువైన ‘అవిశ్వాస’ ముసలం అధికార టీఆర్‌ఎస్ పార్టీ అగ్రనేతల్లో ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి వర్గం నాయకుల ఆశీస్సులతో వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి పావులు కదుపగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు దామోదర్‌రెడ్డి అదే పార్టీకి చెందిన మంత్రి జోగు రామన్న వర్గాన్ని ఆశ్రయించినట్లు సమాచారం.
దీంతో డీసీసీబీలో ప్రారంభమైన ముసలం టీఆర్‌ఎస్‌లోని అగ్రనేతల్లో వర్గపోరుకు ఆజ్యం పోసినట్లవుతోంది. ఎలాగైనా డీసీసీబీపై టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయడంతోపాటు జిల్లా రాజకీయాల్లో తమ పట్టును నిలుపుకునేందుకు టీఆర్‌ఎస్‌లోని ఇరువర్గాల నేతలు తెరవెనుక పావులు కదుపుతున్నారు. మరోవైపు డీసీవో సూర్యచంద్రరావు నిర్వాకంతో ‘అవిశ్వాసం’ అంశం వివాదానికి దారి తీయడంతో ఈ వర్గపోరుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వరుస ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ క్రమంగా జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది.
ప్రాదేశిక ఎన్నికల్లో కూడా హవా కొనసాగించి ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్‌తోపాటు, అత్యధిక మండల పరిషత్‌లపైనా టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ ఖాతాలో ఉన్న సహకార సంస్థలపై కూడా గులాబీ జెండాను ఎగురవేసేందుకు పావులు కదిపింది. ఈ క్రమంలోనే వేణుగోపాలాచారి ఆశీస్సులతో చంద్రశేఖర్‌రెడ్డి చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి తెరలేపడం.. చైర్మన్ మంత్రి రామన్నను ఆశ్రయించడం జరిగిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఈ డీసీసీబీ వివాదం అధికార పార్టీ అగ్రనేతల్లో గ్రూపు విభేదాలకు దారితీయడమే కాకుండా, సహకార పోరును రసకందాయంలో పడేసింది.
టీడీపీ సహాయంతో వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం
అవిశ్వాస తీర్మానం పెట్టిన వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి ఖానాపూర్ మండలం సత్తెనపల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ సత్తెనపల్లి పీఏసీఎస్ చైర్మన్ పదవిపై అవిశ్వాసం పెడితే డీసీసీబీలో ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చని డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి తెర వెనుక పావులు కదిపినట్లు సమాచారం. ఈ సొసైటీలోని టీడీపీకి చెందిన డెరైక్టర్లు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అనుచరులున్నారు.
దామోదర్‌రెడ్డి సొదరుడు ప్రేమేందర్‌రెడ్డికి రాథోడ్ రమేష్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఈ టీడీపీ డెరైక్టర్ల మద్దతును కూడగట్టి చంద్రశేఖర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సొసైటీ బలపరీక్ష కోసం ఈ నెల 16న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డీసీవో సూర్యచంద్రరావు నిర్ణయించారు.
టీఆర్‌ఎస్‌లోకి చైర్మన్, వైస్ చైర్మన్లు
కాంగ్రెస్ పార్టీకి చెందిన దామోదర్‌రెడ్డి త్వరలోనే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కొద్ది రోజుల్లోనే రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరికలు ఉండే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా దామోదర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఇంతకుముందే ముహుర్తం ఖరారైనప్పటికీ.. అవిశ్వాసం అంశం తేలాకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలున్నాయని, ఆయన అనుచరుడైన దామోదర్‌రెడ్డి ఆయనతో కలిసి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కొనసాగింది. అయితే ప్రేంసాగర్‌రావు రాకను జిల్లా టీఆర్‌ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
డీసీసీబీ కుంపటి
Published Sat, Aug 9 2014 1:12 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement