నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాసం పెట్టాలని గత నెల 8వ తేదీన కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయగా.. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఇన్‌చార్జి కలెక్టర్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం నిర్వహించారు.
ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 50 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో అవిశ్వాస సమావేశానికి 47 మంది హాజరయ్యారు. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్ బండారు ప్రసాద్ సమావేశానికి రాలేదు. 41 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు పైకి ఎత్తారు. వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు చేతులు ఎత్తారు.
కాగా, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి సస్పెన్షన్‌కు గురైన పిల్లి రామరాజుయాదవ్ తటస్థంగా ఉన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు 35 మందితో పాటు బీజేపీ కౌన్సిలర్లు నలుగురు, గత ఎన్నికలకు ముందు బీజేపీ, ఎంఐఎం నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు ఎత్తడంతో 41 మంది మద్దతు లభించింది.
ప్రభుత్వానికి నివేదిక
నల్లగొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాసం నెగ్గిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలతో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాలు రాగానే చైర్మన్ ఎన్నిక కోసం 50 మంది సభ్యులకు నోటీసులు అందించనున్నారు. ఆ తరువాత సమావేశం నిర్వహించి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment