
సాక్షి, నల్గొండ : మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు, శ్రీనివాస్ తలపై బండరాయితో మోది హత మార్చారు. ఆయన ఇంటి సమీపంలోనే జరిగిన హత్య నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. శ్రీనివాస్ నివాసం ఉంటున్న సావర్కర్ నగర్‌లో రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడవ పడ్డారు. ఈవిషయంలో స్థానిక కౌన్సిలర్ కుమారుడు మెరగు గోపి సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయినా గొడవ సద్దుమనకపోవడంతో గోపీ, శ్రీనివాస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో బయటకు వచ్చిన శ్రీనివాస్ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
అయితే క్రమంలో ఇరువర్గాల మధ్య మాటకు మాట పెరగటంతో శ్రీనివాస్‌ను హత్య చేసి మురికి కాలువలో పడేసినట్లు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. శ్రీనివాస్ హత్యపై ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యఅనుచరుడు. విషయం తెలుసుకున్న కోమటి రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి నల్గొండ చేరుకొని శ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment