సాక్షి, నల్గొండ : మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తమ అనుచరుడు, శ్రీనివాస్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకనే దొంగచాటుగా కుట్ర పన్ని శ్రీనివాస్ ప్రాణం తీశారని మండిపడ్డారు. ఒంటరిగా చేసి చంపడం పిరికిపందల చర్య అని పేర్కొన్నారు.
2016 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే తనకు, తన అనుచరులకు ప్రాణహాని ఉందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, అయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని కోమటిరెడ్డి విమర్శించారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ మనుషులు నాలుగుసార్లు తుపాకీతో బెదిరించారని, భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్‌ను కోరినా స్పందించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నేతల ప్రాణానికే భద్రత లేకుండాపోతోందని, ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార నేతలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. స్థానిక డీఎస్పీ అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ, టీఆర్‌ఎస్ నేతల రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని, శ్రీనివాస్ హత్యలో డీఎస్పీ పాత్ర ఉందని కోమటిరెడ్డి ఆరోపించారు. కేసు విచారణకు ప్రత్యేక విచారణ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. హత్య వెనుక పెద్ద రాజకీయ నాయకుల హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. తనకు శ్రీనివాస్ లోని లోటు తీర్చలేనిదన్నారు. హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం శ్రీనివాస్ కుటుంబానికి తగిన న్యాయం, పరిహారం అందించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
కన్నీరుమున్నీరైన కోమటిరెడ్డి
శ్రీనివాస్ హత్య సమాచారం అందుకున్న కోమటిరెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి నల్గొండ చేరుకున్నారు. నిన్నటి వరకూ తనతో పాటు ఉన్న అనుచరుడిని కోల్పోయినందుకు ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా శ్రీనివాస్ తనతోపాటు నడిచాడని ఆయన గుర్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి బాధపడుతూనే శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మీకు నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు.
క్లాక్‌టవర్ వద్ద బైఠాయింపు
ముఖ్య అనుచరుడు శ్రీనివాస్ హత్యపై కోమటిరెడ్డి తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యను ఖండిస్తూ ఆయన నల్గొండలో నిరసనకు దిగారు. హత్య కేసులో అసలు దోషులను దాచేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. హత్యకు కారకులైన అసలు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని క్లాక్ టవర్ వద్ద బైఠాయించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రక్తత ఏర్పడింది. అంతేకాకుండా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మొహరించారు. నిరసన కారణం భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడిందని, వెంటనే విరమించాలని కోమటిరెడ్డిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment