సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల కూడా గడువక ముందే చాలా పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం ఊపందుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మునిసిపాలిటీలో గురువారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు మునిసిపల్ చైర్‌పర్సన్ పండిత్ వినీతపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గగా మరో ఏడు మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలపై చర్చకు జిల్లా కలెక్టర్లు కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరుగనుంది.
వరంగల్ జిల్లా నర్సంపేటలో అవిశ్వాస నోటీసుకు స్పందించిన కలెక్టర్ ఈ నెల 8న పాలకమండలిని సమావేశపరిచారు. అదేరోజు నల్లగొండలోనూ సమావేశం జరగనుంది. 11న మంచిర్యాల మునిసిపాలిటీ పాలకమండలి సమావేశం కానుండగా ఆ సమావేశంలోనే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్, ఆ తరువాత గంటకే కొత్త చైర్‌పర్సన్, వీసీ ఎన్నిక ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లితోపాటు నస్పూర్ మునిసిపాలిటీ సమావేశం ఈ నెల 12న జరగనుంది.
కాగజ్‌నగర్ మునిసిపాలిటీ చైర్‌పర్సన్ సద్దాం హుస్సేన్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 20న సభ సమావేశం కానుంది. అలాగే ఈ నెల 19న సిద్దిపేట జిల్లా చేర్యాల మునిసిపాలిటీ సమావేశం జరగనుంది. ఇంకా చాలా మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు ఇచ్చిన నోటీసులపై జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్నారు. అవిశ్వాసాల నుంచి తప్పించుకోవడానికి సుమారు 15 మంది మునిసిపల్ చైర్‌పర్సన్‌లు కాంగ్రెస్‌లో చేరినా పదవీగండం తప్పేలా లేదు.
మరికొన్ని చోట్ల నోటీసులకు సిద్ధం..
నల్లగొండ జిల్లాలో నల్లగొండ మునిసిపాలిటీతోపాటు నేరే డుచెర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మునిసిపాలిటీల్లో అవిశ్వాసాల రగడ నడుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీ లతోపాటు మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, గుండ్లపో చంపల్లి, నిజాంపేట మునిసిపాలిటీలు, పీర్జాదిగూడ, జవహ ర్‌నగర్ కార్పొరేషన్లలో నోటీసులు జారీ చేసేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు.
కామారెడ్డిలో కాంగ్రెస్‌లో చేరిన ఇందుప్రియపై బీఆర్‌ఎస్ అవిశ్వాస నోటీసుకు సిద్ధమవుతోంది. కరీంనగర్‌లో జమ్మికుంట మునిసిపల్ చైర్‌పర్సన్‌పై ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొన్నగంటి మల్లయ్య అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అయితే రామగుండం కార్పొరేషన్‌లో అవిశ్వాసం ఆలోచన తమ సభ్యులకు లేదని జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ అసమ్మతి సభ్యుల నుంచే..
సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 128 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లకుగాను మెజారిటీ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకోగా నాలుగైదు పాలక మండళ్లనే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. పురపాలక చట్టం ప్రకారం పాలకమండలి మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక అవిశ్వాస లేదా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉండగా ఈ తీర్మానాల గడువును నాలుగేళ్లకు పెంచుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మునిసిపల్ చట్టంలో మార్పులు చేసింది.
అయితే అది గవర్నర్ ఆమోదం పొందలేదు. దీంతో గతేడాది జనవరి 27 తరువాత 36 మునిసిపాలిటీలు, పలు కార్పొరేషన్లలో బీఆర్‌ఎస్ అసమ్మతి సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. వారికి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తోడై చైర్‌పర్సన్లు, మేయర్లను గద్దె దించాలని ప్రయత్నించారు.
అయితే గత ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు పాలకమండళ్లను సమావేశపరచకపోవడం, ఈలోగా మునిసిపల్ చైర్‌పర్సన్లు, మేయర్లు కోర్టుకెక్కి స్టే తెచ్చుకోవడంతో అప్పట్లో అవిశ్వాసాలకు బ్రేక్ పడింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవిశ్వాస తీర్మానాల్లో మళ్లీ కదలిక మొదలైంది.
‘ఆర్మూర్’చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం
పదవి కోల్పోయిన వినీత
అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె భర్త బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేశారనే..!
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మునిసిపల్ చైర్‌పర్సన్ పండిత్ వినీతపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆమె తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మునిసిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డితోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌కు చెందిన 24 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.
మరో 12 మంది కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. 2020 జనవరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా 33వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పండిత్ వినీత గెలిచారు. అప్పట్లో చైర్‌పర్సన్ పదవికి బీసీ మహిళా రిజర్వేషన్ కలిసి రావడంతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చైర్‌పర్సన్ భర్త పండిత్ పవన్ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తూ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సంప్రదించగా ఆయన సూచన మేరకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నూతన మునిసిపల్ చైర్‌పర్సన్ ఎంపికపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment