పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ కొత్త పంథాలో వెళ్తోంది. గ్రేటర్ పరిధిలో పార్టీ బలం పెంచుకోవడంపై ఫోకస్ పెంచింది. ముఖ్య నేతలను తమవైపుకు తిప్పుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల మున్సిపాలిటీలపై హస్తం నేతలు కన్నేశారు. మున్సిపల్ ప్రజా ప్రతినిధులు చాలా మంది తిరుబాటు జెండా ఎగురవేశారు. దీని వెనక కీలక నేతల హస్తం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ తెర ముందు జరుగుతున్న మంత్రాంగానికి తెర వెనక ఉన్న నేతలు ఎవరు అనే దానిపై ఆసక్తి కరమైన చర్చ సాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఫలితాలు సాధించలేదు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో.. దీన్ని అధిగమించి మంచి ఫలితాలు సాధించాలనే దానిపై హస్తం నేతలు దృష్టి పెట్టారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. దీనికి బీఆర్‌ఎస్‌లో ఉన్న కీలక నేతల సహకారం లభించడంతో వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. చేవెళ్ల పార్లమెంట్‌కు కాంగ్రెస్ తరపున వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత తీసుకున్నారు. స్వయంగా సీఎం బాధ్యత ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా మొట్ట మొదటగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్‌పై దృష్టి పెట్టారు. ఇక్కడ మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉంటే.. 16 మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మేయర్ మహేందర్ గౌడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్‌కు వినతిపత్రం ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మేయర్ మహేందర్ గౌడ్‌ను దించేసి.. తిరుగుబాటు వర్గానికి చెందిన లతాప్రేమ్ గౌడ్‌ను మేయర్ పీఠంపై కూర్చొబెట్టాలని స్కెచ్ వేశారు. ప్రస్తుత మేయర్ మహేందర్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వర్గం కాగా.. లతా ప్రేమ్ గౌడ్ మాత్రం ఎంపీ రంజీత్ రెడ్డి వర్గం. ఇప్పుడు అవిశ్వాసం పెట్టి మహేందర్‌ను దించేసి.. ఎంపీ రంజీత్ రెడ్డి వర్గానికి చెందిన లతా ప్రేమ్ గౌడ్ మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. అయితే ఈ అవిశ్వాస తీర్మానం వెనక ఎంపీ రంజీత్‌రెడ్డి హస్తం ఉందనే టాక్ రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతోంది.
చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్న రంజీత్ రెడ్డి వర్గం తిరుగుబాటు చేయడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తిరుగుబాటు చేస్తున్న 16 మంది కార్పొరేటర్లు అందరూ హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. రంజీత్ వర్గానికి చెందిన నేతలంతా పార్టీ మారుతుండటంతో.. పార్లమెంట్ ఎన్నికల నాటికి రంజీత్ కూడా పార్టీ మారతాడా అనే చర్చ జోరుగా సాగుతోంది. చూడాలి ఈ వ్యవహారం మునుముందు ఎటువైపుకు దారి తీస్తుందనేదనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని జిల్లా పాలనాధికారి కార్యాలయంలో అదనపు కలెక్టర్‌కు పాత్రలను అందజేశారు. మొత్తం 24 సభ్యులకు 15 మంది బీఆర్ఎస్, ఇద్దరు బీజేపీ సభ్యులు మొత్తం 17మంది అదనపు కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస పత్రాలు అందజేశారు. ఇబ్రహీపట్నం మున్సిపాలిటీ నీ కాంగ్రెస్ కాపాడుకుంటుందా ? వదిలేసుకుంటుందా ? అనేది ఆసక్తిగా మారింది.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పైన అవిశ్వాస తీర్మానాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ, కౌన్సిలర్లు. కాంగ్రెస్ పార్టీ నుండి తొలత విజయం సాధించిన హార్దిక బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరి చైర్మన్ అయ్యారు. మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నప్పటికీ హార్దిక స్థానంలో కాంగ్రెస్ వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment