ప్రతీకాత్మక చిత్రం
వరంగల్ అర్బన్: ‘గ్రేటర్’ పరిధిలో ప్రజలందరూ పన్నులు కట్టాలి... మహా నగర అభివృద్ధికి తోడ్పడాలి.. అంటూ అధికారులు జోరుగా సందేశాలు ఇస్తున్నారు. అంతేకాదు.. సామాన్యుడి నుంచి మరీ ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చెల్లించని పక్షంలో నల్లా కనెక్షన్ కట్..ఆస్తుల జప్తు.. వ్యాపార, వాణిజ్య సంస్థల సీజ్ అంటూ నడి రోడ్డుకు లాగి పరువు తీసిన ఘటనలు గతంలో కోకొల్లలు. ఇదే సమయంలో కొన్నేళ్లుగా రూ.కోట్లల్లో పన్ను బకాయిలు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలపై మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నారు.
ఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా బాదేస్తున్న మహా నగర పాలక సంస్థ.. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి కేవలం 11 శాతం పన్నులు వసూలు కావడం గమనార్హం. దీనిపై గ్రేటర్ పాలకవర్గం సైతం స్పందించలేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బకాయిల రాక దేవుడికెరుక..
వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఆస్తులు 1,545 ఉన్నాయి. వీటి నుంచి జీడబ్ల్యూఎంసీకి ఆస్తి పన్ను కింద 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.99 కోట్లు.. కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు రూ.15.70 కోట్లు సమకూరాల్సి ఉంది. వడ్డీలు మినహాస్తే రూ.18.69 కోట్ల బకాయిలు ఉండగా.. గ్రేటర్ అధికారులు ఇప్పటివరకు రూ.2,15 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇందులో సగానికి పైగా సొమ్ము ఆయా శాఖలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెల్లించినవే.
నోటీసులతో సరి..
ఏళ్ల తరబడి బకాయిలు భారీగా పేరుకుపోతున్నా.. బల్దియా అధికారుల్లో కదలిక లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో మొక్కుబడిగా అన్నట్లు.. ఏటా తాఖీదులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఏదైనా సమీక్ష సమావేశాల్లో ఉన్నతాధికారులు అడిగితే.. తాఖీదులు ఇచ్చామని సమాధానమిస్తున్నారే తప్ప.. బకాయిల అంశాన్ని తీవ్రంగా పరిగణించిన దాఖలాలు లేవు.
అయితే.. ఈ ఏడాది బల్దియా పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పన్నులు చెల్లించాల్సిందేనంటూ ఏడాది పొడవునా ఒత్తిడి తీసుకొచ్చారు. నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయా ప్రభుత్వ శాఖల్లో చలనం లేకుండా పోయింది.
ఇప్పటికైనా దృష్టి సారించాలి..
మరో 23 రోజులు గడిస్తే ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటికైనా మేయర్, కలెక్టర్, కమిషనర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతి శాఖ పన్ను చెల్లించే విధంగా ఒత్తిడి తేవాలి. పేరుకుపోయిన బకాయిలను రాబట్టగలిగితే ‘గ్రేటర్’ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి.. మహా నగర ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి.
బకాయిలు చెల్లించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు..
నిట్, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, కేయూ, రైల్వే శాఖ, ప్రభుత్వ కాలేజీలు, రెవెన్యూ శాఖ, ఆర్‌అండ్‌బీ, పీడబ్ల్యూడీ, పంచాయతీ రాజ్, ప్రభుత్వ ఆస్పత్రులు, పోస్ట్ ఆఫీస్‌లు, హౌసింగ్ బోర్డు, ప్రభుత్వ స్కూళ్లు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, ఆర్టీసీ, కోర్టు, టెలికాం, ఆల్ ఇండియా రేడియో, ట్రాన్స్‌కో, సీఆర్పీఎఫ్ పోలీస్, ఎఫ్‌సీఐ, ఇతర సర్కారు సంస్థల బకాయిలు భారీగా పేరుకుపోయాయి.
స్పెషల్ నోటీసులు ఇస్తాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. కొన్ని శాఖల అధికారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రత్యేక నోటీసులు జారీ చేసి వసూలు చేస్తాం.
– శాంతికుమార్, టీఓ
Comments
Please login to add a commentAdd a comment