రిటర్నుల్లో డిఫాల్ట్‌గా కొత్త పన్నే
పాత విధానంలో ఎన్నో మినహాయింపులు
ఎక్కువ మందికి ఇదే అనుకూలం
వినియోగించుకుంటే గణనీయంగా ఆదా
పన్ను చెల్లింపుదారుల ఎంపికే కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రిటర్నులు దాఖలు చేసే వారికి నూతన పన్ను విధానం డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. పాత పన్ను వ్యవస్థతోనే కొనసాగాలనుకుంటే విధిగా దానిని ఎంపిక చేసుకోవాల్సిందే. లేదంటే కొత్త విధానం అమలవుతుంది. పాత వ్యవస్థతో పోలిస్తే కొత్త పన్ను విధానంలో పన్ను భారం తక్కువ. కానీ, పాత విధానంలో పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఎక్కువ. వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కనుక కొత్త విధానంతో పోలిస్తే గణనీయమైన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించే పన్ను తగ్గిపోతుంది. మరి వీటిల్లో తమకు ఏది అనుకూలమో తేల్చుకోవాలంటే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.
ఆదాయపన్ను భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలని కోరుకునే వారికి.. పాత, కొత్త పన్ను విధానాల్లో ఎంపిక కీలకం అవుతుంది. చట్టప్రకారం మీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంటే, అప్పుడు విధిగా రిటర్నులు దాఖలు చేసి నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలి. పాత, కొత్త పన్ను రేట్లను ఒకసారి పరిశీలిద్దాం.
ఈ రెండు వ్యవస్థల్లోనూ కొంత పన్ను రాయితీ ఉంది. పాత విధానంలో నికరంగా రూ.5 లక్షలు, నూతన విధానంలో నికరంగా రూ.7 లక్షలు మించకుండా పన్ను వర్తించే ఆదాయం ఉంటే సెక్షన్ 87ఏ కింద ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల ప్రయోజనాన్ని కూడా కలిపి చూస్తే వేతన జీవులు పాత విధానంలో రూ.5.50,000 ఆదాయం, కొత్త విధానంలో రూ.7,50,000 మించని ఆదాయంపై రూపాయి పన్ను కట్టక్కర్లేదు.
ఆదాయపన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోలేని వారికి నూతన విధానమే అనుకూలం. పాత విధానంలో సెక్షన్ 80సీ, 80డీ, 24 ఇలా పలు సెక్షన్ల కింద పన్ను తగ్గింపులు, మినహాయింపులను వినియోగించుకుంటే, రూ.5 లక్షలకు పైన ఆదాయం ఉన్నవారు సైతం గణనీయమైన ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇంతకుమించి ఆదాయం కలిగిన వారు ఈ రెండింటిలో ఏది లాభదాయకమో తేల్చుకోవాలంటే కొంత కసరత్తు అవసరం.
పీపీఎఫ్, సుకన్య సమృద్ధి
దీని కింద పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. జీవిత బీమా పాలసీకి చెల్లించే ప్రీమియం, పిల్లల ట్యూషన్ ఫీజులను కూడా ఈ సెక్షన్ కింద చూపించుకోవచ్చు. గృహ రుణం తీసుకుని, ఒక ఆర్థిక సంవత్సరంలో దీనికి చేల్లించే అసలును (ప్రతి ఈఎంఐలో అసలు, వడ్డీ భాగం ఉంటుంది) సెక్షన్ 80సీ కింద చూపించి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను సెక్షన్ 80డీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 ఏళ్లలోపు వయసున్న వారు రూ.25,000 వరకు, అంతకుమించిన వయసు వారికి రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. ఇదే సెక్షన్ కింద హెల్త్ చెకప్‌లకు చేసే వ్యయం రూ.5,000 వరకు పన్ను మినహాయింపు ఉంది.
విరాళాలు ఇస్తే..
అర్హత కలిగిన సంస్థలకు విరాళాలు ఇస్తే, ఆ మొత్తంపై సెక్షన్ 80జీ కింద పన్ను భారం ఉండదు. ఇక సెక్షన్ 80టీటీఏ కింద సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై ఆర్జించే వడ్డీ రూ.10,000 మొత్తంపై పన్ను లేదు. అదే 60 ఏళ్లు నిండిన వారికి వడ్డీ ఆదాయం రూ.50,000పై పన్ను లేదు. ఇవన్నీ పాత పన్ను విధానంలో ఉన్న చక్కని పన్ను మినహాయింపు ప్రయోజనాలు.
పన్ను ఆదా, పెట్టుబడులు
పాత వ్యవస్థలో ఉన్న పన్ను ఆదా ప్రయోజనాలను ఉపయోగించుకుంటే, మరింతగా పన్ను ఆదా చేసుకోవచ్చని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ శడగోపన్
పేర్కొన్నారు. వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకవైపు పెట్టుబడులపై రాబడిని, మరోవైపు పన్ను ఆదా చేసుకోవడానికి వీలుంటుంది. కొత్త పన్ను విధానంలో పెట్టుబడులకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. అంటే ఇది పెట్టుబడులను నిర్బంధం చేయదు.
ఎన్‌పీఎస్
వేతన జీవులు, స్వయం ఉపాధిలోని వారు, ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌పై పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. వేతన జీవులు అయితే తమ మూలవేతనం, డీఏలో 10 శాతం మేర ఎన్‌పీఎస్‌కు చందా జమ చేయడం ద్వారా ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. స్వయం ఉపాధిలో ఉన్న వారు తమ మొత్తం ఆదాయంలో 20 శాతంపై ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు.
ఈ సెక్షన్ కింద ఈ రెండు వర్గాలకు గరిష్ట ప్రయోజనం రూ.1.5 లక్షలు. ఇక 80సీసీడీ (1బి) కింద వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు రూ.50,000 జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పైన చెప్పుకున్న రూ.1.5 లక్షలకు ఇది అదనం. 80సీసీడీ(2) కింద వేతన జీవులకు అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగి ఎన్‌పీఎస్ ఖాతాలో సంస్థ చేసే జమలు దీనికింద వస్తాయి. ప్రభుత్వరంగ ఉద్యోగులు అయితే తమ మూలవేతనం, డీఏలో 14 శాతం, ప్రైవేటు ఉద్యోగులు 10 శాతం మేర యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక్కడ గరిష్ట పరిమితి రూ.7.5 లక్షలు. ఈపీఎఫ్ జమలు కూడా ఈ పరిమితిలో భాగమే.
హెచ్‌ఆర్‌ఏ
అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పొందుతుంటే అప్పుడు కూడా పన్ను ప్రయోజనాన్ని అందుకోవచ్చు. మెట్రోల్లో నివసించే వారు తమ మూల వేతనం, డీఏలో 50 శాతం మేర సెక్షన్ 10(13ఏ) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. నాన్ మెట్రోల్లోని వారికి ఈ పరిమితి 40 శాతంగా ఉంది.
అలాగే, హెచ్‌ఆర్‌ఏ రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న మొత్తం.. మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తీసివేయగా వచ్చే మొత్తం.. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పనిచేసే ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉండే వారికి హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపు రాదు. పనిచేసే చోట అద్దె ఇంట్లో ఉంటూ, వేరే ప్రాంతంలో సొంతిల్లును అద్దెకు ఇచి్చన వారు సైతం హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపును పొందొచ్చు. లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రయాణాలకు చేసిన ఖర్చును చూపించి, పన్ను భారం తొలగించుకోవచ్చు.
గృహ రుణం/విద్యా రుణం
రుణంపై ఇంటిని కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే ఇప్పుడు యువత సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. ఇలాంటి వారు కొంత డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తానికి రుణం తీసుకుంటున్నారు. ఈ రుణానికి చేసే అసలు చెల్లింపులు ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద, వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల మేర సెక్షన్ 24(బి) కింద చూపించుకుని ఆ మొత్తంపై పన్ను కట్టక్కర్లేదు. సొంతగా నివాసం ఉన్నా లేదా అద్దెకు ఇచ్చినా సరే ఈ ప్రయోజనానికి అర్హులే. విద్యా రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే వడ్డీ చెల్లింపులు ఎంత ఉన్నా సరే ఆ మొత్తాన్ని రిటర్నుల్లో చూపించుకుని పన్ను లేకుండా మినహాయింపు పొందొచ్చు.
మీకు ఏది అనుకూలం?
పాత విధానంలో ఇక్కడ పేర్కొన్న మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే.. సెక్షన్ 80సీ కింద 1.50 లక్షలు, 80 సీసీడీ (1బి) కింద రూ.50,000 (ఎన్‌పీఎస్), స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, గృహ రుణం వడ్డీ రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.9.5 లక్షలపై పన్ను లేనట్టే. అలాగే, ప్రైవేటు ఉద్యోగులు పనిచేసే సంస్థ ద్వారా ఎన్‌పీఎస్ ఖాతాకు గరిష్టంగా రూ.7.5 లక్షల మేర జమ చేయించుకుంటే అప్పుడు మొత్తం రూ.17 లక్షలపై పన్ను లేనట్టు అవుతుంది.
కొత్త విధానంలో రూ.7 లక్షల మొత్తంపై సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ కలి్పంచారు. దీనికి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే రూ.7.5 లక్షలపై పన్ను లేదు. ఆదాయం రూ.7,50,001 ఉన్న వారికి 87ఏ రాయితీ వర్తించదు. వారు తమ ఆదాయంపై పూర్తి పన్ను చెల్లించాలి. మొదటి మూడు లక్షలపై పన్ను లేదు. 3–6 లక్షలపై 5 శాతం ప్రకారం రూ.15,000. రూ.6.–7.51 లక్షలపై 10 శాతం ప్రకారం రూ.15,000 కలిపి మొత్తం రూ.30,000, దీనికి సెస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 7.51 లక్షల ఆదాయంపై పాత విధానంలో రిటర్నులు వేసుకునేట్టు అయితే.. 87ఏ రిబేటు, స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.5 లక్షల వరకు పన్ను లేదు. 80సీ సాధనంలో 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుని, దీనికి అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50,000 ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రూపాయి పన్ను లేకుండా చూసుకోవచ్చు.
విధానాన్ని మార్చుకోవచ్చు..
పాత పన్ను నుంచి కొత్త పన్నుకు.. తిరిగి పాత పన్నుకు మారడంపై ఆంక్షలు ఉన్నాయి. వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆదాయం పొందని వారు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. వృత్తి లేదా వ్యాపారం నుంచి ఆదాయం పొందుతున్న వారు సెక్షన్ 115బీఏసీ కింద నూతన పన్ను విధానం నుంచి వైదొలిగే ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అప్పుడు తిరిగి నూతన పన్ను విధానానికి ఒక్కసారి మాత్రమే మారే అవకాశం ఉంటుంది. ‘‘తక్కువ పన్ను శ్లాబుల పరిధిలో ఆదాయం కలిగిన వారికి నూతన పన్ను విధానమే మెరుగైనది. అధిక రేటు శ్లాబుల్లో ఉన్నవారు, అన్ని రకాల మినహాయింపులు వినియోగించుకుంటే వారికి పాత విధానం అనుకూలం’’అని రైట్ హారిజాన్స్ సీఈవో అనిల్ రెగో సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment