కాంగ్రెస్‌లో చిచ్చురేపిన దసరా ఫ్లెక్సీలు | Congress MLA Revuri Prakash Reddy Hot Comments on Flexi War | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చిచ్చురేపిన దసరా ఫ్లెక్సీలు

Published Mon, Oct 14 2024 8:10 AM | Last Updated on Mon, Oct 14 2024 8:10 AM

Congress MLA Revuri Prakash Reddy Hot Comments on Flexi War

ఎమ్మెల్యే రేవూరి, మంత్రి ‘కొండా’వర్గీయుల ఘర్షణ 

గీసుకొండ: దసరా పండుగ సందర్భంగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 16వ డివిజన్‌ ధర్మారంలో శనివారం కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య చిచ్చు రేపాయి. «కొండా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కాంగ్రెస్‌కు చెందిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటోలు లేకపోవడంతో రేవూరి వర్గం వారు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 

ఈ వివాదంపై రేవూరి వర్గం గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కొండా వర్గం సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అయితే వారిని పోలీస్‌స్టేషన్‌లోనే అదుపులోకి తీసుకుని బయటకు పంపడం లేదనే సమాచారం రావడంతో కొండా వర్గం కార్యకర్తలు, నాయకులు ధర్మారంలో ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ తమ వారిని విడిపించేందుకు ఆదివారం సాయంత్రం గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలు ఫిర్యాదు చేయడానికి వస్తే, బంధించి బూట్లతో తన్నుతారా.. విచారణ చేయరా? అని ఆమె పోలీసు అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. 

పోలీస్‌ స్టేషన్‌లో సీఐ కురీ్చలో కూర్చుని ఆమె అధికారులతో వాదిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిన సీపీ అంబర్‌ కిషోర్‌ఝా అక్కడికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా రేవూరి వర్గీయుడు పిట్టల అనిల్‌పై దాడి చేసిన విషయంలో కొండా వర్గానికి చెందిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు గీసుకొండ పోలీసులు తెలిపారు. ఇందులో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. కొండా వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పిట్టల అనిల్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement