సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్‌ | BRS Vs Congress: Flexi War at Siddipet | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్‌

Published Sun, Aug 18 2024 5:17 AM | Last Updated on Sun, Aug 18 2024 5:17 AM

BRS Vs Congress: Flexi War at Siddipet

కేసీఆర్, హరీశ్‌రావుల ఫ్లెక్సీని చించేసిన కాంగ్రెస్‌ శ్రేణులు

హరీశ్‌ క్యాంప్‌ ఆఫీసువైపు చొచ్చుకొచ్చే యత్నం

హరీశ్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ 

కాంగ్రెస్‌ పెట్టిన ఫ్లెక్సీని దగ్ధం చేసిన బీఆర్‌ఎస్‌  

సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య సిద్దిపేటలో మొదలైన ఫ్లెక్సీ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు, సవాళ్లతో సిద్దిపేట శనివారం రణరంగంగా మారింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇరుపార్టీలకు చెందిన నేతలను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

బీఆర్‌ఎస్‌ నిరసన ర్యాలీ: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసినందున ఎమ్మెల్యే పదవికి హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని తొలగించాలంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం రాత్రి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి, తెల్లవారుజామున వదిలి పెట్టారు. మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు అత్తు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఎమ్మెల్యే హరీశ్‌ క్యాంప్‌ కార్యాలయంలోకి చొరబడ్డాయి.

అక్కడ కేసీఆర్, హరీశ్‌రావు చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీని చించేశాయి. దీంతో శనివారం సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి పాత బస్టాండ్‌ చౌరస్తా వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. హరీశ్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దగ్ధం చేశారు. తర్వాత బీజేఆర్‌ చౌరస్తాలో ఉన్న ఫ్లెక్సీలను బీఆర్‌ఎస్‌ నాయకులు చించివేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీలను ఝుళిపించారు. బీఆర్‌ఎస్‌ నాయకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.

ర్యాలీగా కాంగ్రెస్‌: ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో సీఎం రేవంత్‌  ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జి హరికృష్ణ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్‌ శ్రేణులను బీజేఆర్‌ చౌరస్తాలో పోలీ సులు అడ్డుకున్నారు. పోలీసుల కన్నుగప్పి క్యాంప్‌ ఆఫీస్‌ వైపు చొచ్చుకొచ్చేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు యత్నించారు. క్యాంప్‌ ఆఫీస్‌ గేట్‌ వద్దకు చేరు కున్న కాంగ్రెస్‌ నాయకుడు మహేందర్‌పై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేయ డంతో పరిస్థితి చేయిదాటిపోతుందనే ఆందోళన నెలకొంది. పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరుపార్టీలు పరస్పర ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement