‘తెలంగాణ ఇంక్రిమెంట్‌’ రికవరీ | Telangana: Deduction from wages of 658 employees | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ ఇంక్రిమెంట్‌’ రికవరీ

Published Mon, Feb 19 2024 4:21 AM | Last Updated on Mon, Feb 19 2024 2:55 PM

Telangana: Deduction from wages of 658 employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జలమండలిలో ‘తెలంగాణ ఇంక్రిమెంట్‌’రికవరీకి ఆ శాఖ పరిధిలోని ఆర్థిక విభాగం నుంచి తాజాగా ఆదేశాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పదేళ్ల తర్వాత ఆ శాఖ పరిధిలో రెగ్యులరైజ్‌ అయిన 658 మంది ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని, ఉద్యోగుల సర్విస్‌ బుక్‌ లు పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించింది.  

ఇంక్రిమెంట్‌ ఇలా.. 
తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన పాత్రకు గుర్తుగా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఉద్యోగులందరికీ ‘తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‌‘మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2014 సెప్టెంబర్‌ 1న చెల్లించిన ఆగస్టు నెల వేతనం నుంచే ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను అమలు చేస్తూ వస్తోంది. ప్రతి నెలా వేతనంలో భాగంగా ఈ ఇంక్రిమెంట్‌ సర్విస్‌ ముగిసే వరకు వర్తింస్తుందని ఆ జీఓలో ప్రభుత్వం స్పష్టం చేసింది.  

జలమండలిలో వర్తింపు ఇలా 
జలమండలి పారిశుధ్య విభాగంలో 25 ఏళ్లుగా సేవలిందిస్తున్న సుమారు 658 మంది హెచ్‌ఆర్, ఎన్‌ఎంఆర్‌లను ప్రభుత్వం 2014 జూన్‌ 23న రెగ్యులరైజ్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అదే సంవత్సరం ఆగస్టు 13న జీఓ నెంబర్‌ 23 ఆర్డర్‌తో ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జలమండలిలోని పారిశుధ్య విభాగంలో రెగ్యులర్‌ అయి సర్వీస్‌లో ఉన్నవారికి కూడా ఈ ఇంక్రిమెంట్‌ను వర్తింపజేశారు. 

జీఓ తేదీని పరిగణనలోకి తీసుకోవాలి 
తెలంగాణ ఇంక్రిమెంట్‌ మంజూరు చేస్తూ జీఓ జారీ చేసిన 2014 ఆగస్టు 13 తేదీని కటాఫ్‌ పరిగణనలోకి తీసుకోవాలని జలమండలి ఉద్యోగులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రెగ్యులరైజ్‌ అయిన తాత్కాలిక ఉద్యోగులు కూడా ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయిన నాటికే ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న కారణంగా తెలంగాణ ఇంక్రిమెంట్‌ తమకు కూడా వర్తిస్తుందని వారు పేర్కొంటున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులైన తమ వేతనాలు ఉండడమే తక్కువని, అందులో నుంచి ఇంక్రిమెంట్‌ సొమ్ము మొత్తం రికవరీ చేస్తే ఆర్థికంగా భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రికవరీ ఎందుకంటే...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ రోజైన  జూన్‌ 2ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం తెలంగాణ ఇంక్రిమెంట్‌ అమలుచేస్తోంది. అయితే జలమండలిలో ఉద్యోగుల  రెగ్యులరైజ్‌  జూన్‌ 23న జరిగింది. దీంతో వారి వేతనాల నుంచి ఈ ఇంక్రిమెంట్‌ రికవరీకి ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ ఉద్యోగులు మాత్రం ఇంక్రిమెంట్‌ జీఓ వచ్చిన ఆగస్టు 13వ తేదీన  పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement