రూ.4 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యం
-
స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కమిషనర్ ఆదేశాలు
నెల్లూరు సిటీ: అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఆస్తి, కుళాయి, వీఎల్టీ, డ్రైనేజీ పన్నులను పాత నోట్లతో చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ వరకు గడువును పొడిగించిన నేపథ్యంలో కార్పొరేషన్ పరిధిలో రూ.నాలుగు కోట్లను వసూలు చేయాల్సిందిగా కమిషనర్ వెంకటేశ్వర్లు టార్గెట్ ఇచ్చారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ విభాగాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నుల వసూళ్లు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు మాట్లాడుతూ.. ఇటీవల బిల్ కలెక్టర్లకు డివిజన్లు మార్పు చేయడంతో కలెక‌్షన్ పెరిగే అవకాశం లేదని చెప్పారు. దీంతో 24వ తేదీ వరకు బిల్‌కలెక్టర్లు పాత డివిజన్లలోనే విధులు నిర్వర్తించాలని కమిషనర్ సూచించారు. స్మార్ట్ సర్వేతో పాటు రెవెన్యూ వసూళ్లు కూడా చేయాలని తెలిపారు. రెవెన్యూ ఆఫీసర్ సమ«ద్, ఆర్‌ఐలు కృపాకర్, పద్మ, కృష్ణారావు, ప్రవీణ్, చిన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.
రూ.28 లక్షల వసూలు
కార్పొరేషన్ కార్యాలయంలో పాత నోట్లతో రూ.28 లక్షల పన్ను చెల్లింపులు మంగళవారం జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 24వ తేదీ వరకు గడువు ఇవ్వడంతో పన్నుల వసూళ్లు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు.