సాక్షి, అమరావతి: ఆస్తి పన్ను వివాదంలో నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కార్పొరేషన్ అధికారులపై నిప్పులు చెరిగింది. కోర్టుకిచ్చిన హామీని ‘ఏదో పని ఒత్తిడిలో’ ఇచ్చామంటూ మునిసిపల్ కమిషనర్ తన కౌంటర్‌లో పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ అధికారులు పరిధులన్నీ దాటేశారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి అధికారం లేకున్నా బలవంతంగా పన్ను వసూలు చర్యలకు పాల్పడ్డారని మండిపడింది.
కోర్టుకిచ్చిన హామీని తుంగలో తొక్కడమే కాకుండా, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నించారని, ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదంది.నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు ఏకపక్షమే కాక రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది రాష్ట్రం ఓ పౌరురాలిని వేధింపులకు గురి చేసిన వ్యవహారమని, ఇలాంటి చర్యలను వీలైనన్ని మార్గాల్లో అడ్డుకుని తీరాల్సిందేనని స్పష్టం చేసింది.
పిటిషనర్ నుంచి వసూలు చేసిన రూ.34.12 లక్షల మొత్తాన్ని 24 శాతం వార్షిక వడ్డీతో రెండు వారాల్లో వాపసు చేయాలని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించింది. అంతేకాక పిటిషనర్‌కు రెండు వారాల్లో రూ.25 వేలను ఖర్చుల కింద చెల్లించాలంది. రూ.34.12 లక్షల వాపసు, రూ.25 వేల చెల్లింపు చేసినట్టు రుజువులను హైకోర్టు రిజిస్ట్రార్(జ్యుడీషియల్) ఎదుట సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు.
ఇదీ వివాదం
నెల్లూరు పట్టణం, ట్రంక్ రోడ్డులో తనకున్న భవన సముదాయానికి సంబంధించిన ఆస్తి పన్ను వివాదంపై విజయలక్ష్మి 2012లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సివిల్ జడ్జి కోర్టు.. పెంచిన ఆస్తి పన్ను మొత్తాన్ని రద్దు చేసింది. పాత పన్నులో 50 శాతం పెంచుకునేందుకు కార్పొరేషన్ అధికారులకు అనుమతిచ్చింది. అప్పటికే అధికంగా వసూలు చేసిన పన్ను మొత్తాన్ని విజయలక్ష్మి భవిష్యత్తులో చెల్లించే ఆస్తి పన్నులో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించింది.
అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో, ఆదేశాల అమలు కోసం ఆమె.. ఎగ్జిక్యూషన్ పిటిషన్(ఈపీ) దాఖలు చేశారు. దీంతో కోర్టులో మునిసిపల్ కమిషనర్ ఓ మెమో దాఖలు చేస్తూ.. అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని భవిష్యత్తులో చెల్లించే ఆస్తి పన్నులో సర్దుబాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు విజయలక్ష్మి దాఖలు చేసిన ఈపీని కోర్టు మూసివేసింది. అనంతరం విజయలక్ష్మికి రూ.13.71 లక్షలను వాపసు చేయాల్సి ఉందని, ఈ మొత్తాన్ని భవిష్యత్తులో చెల్లించే పన్ను మొత్తంలో సర్దుబాటు చేస్తామని కమిషనర్ ఓ ఎండార్స్‌మెంట్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. మునిసిపల్ కార్పొరేషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ.34.12 లక్షలకు విజయలక్ష్మికి పన్ను పంపింది. అంత మొత్తం ఎందుకు చెల్లించాలో ఆ నోటీసులో ఎక్కడా పేర్కొనలేదు. ఈ నోటీసు అందుకున్నాక.. సివిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని విజయలక్ష్మి కార్పొరేషన్ అధికారులకు ఇచ్చారు. దీనిని పట్టించుకోకుండా అధికారులు విజయలక్ష్మికి చెందిన షాపును సీజ్ చేశారు. రూ.34.12 లక్షలు చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి చేసి చెక్కు తీసుకుని, దాన్ని నగదుగా మార్చుకున్నారు. దీనిపై విజయలక్ష్మి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు విచారణ జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment