బాధ్యతగా పన్నులు చెల్లించండి | Pay taxes as liability : Harinarayan | Sakshi
Sakshi News home page

బాధ్యతగా పన్నులు చెల్లించండి

Published Sun, Nov 5 2017 1:11 PM | Last Updated on Sun, Nov 5 2017 1:11 PM

Pay taxes as liability : Harinarayan - Sakshi

విశాఖసిటీ: ఆస్తి పన్ను, నీటి పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని గ్రేటర్‌ ప్రజలను జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ విజ్ఞప్తి చేశారు. కోట్ల రూపాయల బకాయిలుండటం వల్ల అభివృద్ధి పనులకు పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్‌ చాంబర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పోలిస్తే జీవీఎంసీలో పన్నుల విలువ తక్కువైనా నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో కోట్ల రూపాయల బకాయిలు ఉండిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఏడా ది అక్టోబర్‌ వరకూ మొత్తం నీటి పన్ను బకాయిలు రూ.29 కోట్లుండగా, ఆస్తి పన్ను బకాయిలు రూ.37 కోట్లున్నాయని ఇవన్నీ వసూలైతే.. నగర ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశముంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేషన్లకు నిధులు అవసరమని తెలిపారు.

డిసెంబర్‌ 1 నుంచి తప్పనిసరి
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రతి ఇంట్లోనూ తడి పొడి చెత్తను కచ్చితంగా వేరు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 100 కిలోలు, అంతకంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు.. తమ పరిసర ప్రాంతాల్లోనే కంపోస్ట్‌ ఎరువులు తయారు చేసుకోవాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇలా చేయని వారి ట్రేడ్‌ లైసెన్సులు రద్దు చేస్తామని కమిషనర్‌ హెచ్చరించారు. 

అదే విధంగా అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించాలన్నారు. లేకుంటే ఆ ప్రాంతాలకు చెత్త బండిని పంపించే ది లేదని స్పష్టం చేశారు. చెత్త బండి రాలేదని పరిసర ప్రాంతాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్‌ హెచ్చరించారు. తడి పొడి చెత్త వేరు చేయడం ప్రతి ఇంటి వద్ద బాధ్యతగా చేపట్టాలనీ, త్వరలోనే ఈ అంశాలతో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వేరు చేస్తున్నారని, అన్ని జోన్లకూ కలిపి రోజుకి 105 టన్నుల తడి చెత్త సేకరిస్తున్నట్లు తెలిపారు.

భీమిలి జోన్‌కు సంబంధించి 279 జీవో టెండర్‌ పరిశీలనలో ఉందనీ, మిగిలిన జోన్లకు సంబంధించి కోర్టులో స్టే నడుస్తోందని కమిషనర్‌ హరినారాయణన్‌ తెలిపారు. నీటి పన్నుల విషయంలో కమర్షియల్‌ కేటగిరీల్లో కొన్ని తప్పులు దొర్లాయనీ, నోటీసులు వచ్చిన వారు ఆయా జోన్లకు వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు.

వర్షపునీటిని ఒడిసి పట్టాల్సిందే..
జీవీఎంసీ పరిధిలోని సెమీ బల్క్, బల్క్‌ వాటర్‌ కనెక్షన్లు కలిగిన వారంతా విధిగా వర్షపు నీటిని ఒడిసిపట్టాలని కమిషనర్‌ సూచించారు. కేవలం ఇంకుడు గుంతల నిర్మాణానికే పరిమితం కాకుండా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలన్నారు. దీన్ని అమలు చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితి ఇస్తామని తెలిపారు. రానున్న మూడు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు జీవీఎంసీ సిద్ధమవుతోందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీడీపీఎంఎస్‌ ద్వారా ఇప్పటివరకూ జీవీఎంసీ పరిధిలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాల కోసం ఆన్‌లైన్‌లో 3,600 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

పది ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ
జీవీఎంసీ పరిధిలోని 27 హైస్కూల్స్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించామన్నారు. ఏఏ సబ్జెక్టుల్లో పిల్లలు వెనుకబడి ఉన్నారని గుర్తించి, వారికి స్పెషల్‌ కోచింగ్‌ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారి బలాలు, బలహీనతలు గుర్తించి దానికనుగుణంగా విద్యార్థుల్ని సన్నద్ధులు చేస్తామన్నారు. ఈ పరీక్షల మార్కుల్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement