సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డెయిరీ, పౌల్ట్రీల యజమానులకు శుభవార్త. పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నం దున రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీలు, మినహాయింపులను ఇచ్చింది. కరెంటు బిల్లుల్లో ఒక్కో యూనిట్‌కు రూ.2 రాయితీని, ఆస్తి పన్నుల చెల్లింపుల నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ, పంచాయతీరాజ్, ఇంధన శాఖలు బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే..
డెయిరీ, పౌల్ట్రీలకు 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి విద్యుత్ రాయితీలు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, యూనిట్ విద్యుత్‌కు రూ.2 చొప్పున రాయితీ ఇస్తుందని పేర్కొంటూ ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ రాయితీల అందజేతకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని పశుసంవర్థక, డెయిరీ, మత్స్యశాఖ కార్యదర్శిని కోరారు. వీటి ప్రకారం రాయితీలివ్వడానికి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
రూ.100 చెల్లిస్తే చాలు
పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్ను మినహాయింపు కోసం ‘తెలంగాణ మున్సిపాలిటీల ఆస్తి పన్నుల మదింపు నిబంధనలు–2020’కు సవరణ చేశారు. ‘పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లను ఆస్తి పన్నుల చెల్లింపు నుంచి మినహాయించారు. పురపాలికల్లోని ఆస్తి పన్నుల రికార్డుల నవీకరణ కోసం ఏటా నామమాత్రంగా రూ.100 చెల్లించి ఈ మినహాయింపును పొందవచ్చు’అన్న నిబంధనను కొత్తగా చేర్చారు. ఈమేరకు పురపాలక శాఖ కార్యదర్శి సి.సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు సైతం ఈ మినహాయింపును జీహెచ్‌సీఎం చట్టంలోని సెక్షన్ 679ఈ కింద అమల్లోకి తెస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.
డెయిరీ, పౌల్ట్రీల యజమానులకు శుభవార్త..!
Published Thu, Jun 3 2021 3:49 AM | Last Updated on Thu, Jun 3 2021 11:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment