బిగుసుకున్న ఉచ్చు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం :డీసీసీబీ చైర్‌పర్సన్ మరిశర్ల తులసీకి బినామీ రుణాల ఉచ్చు బిగుసుకుందా? ఆమె చిక్కుల్లో పడ్డారా? రావివలస పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి) డెరైక్టర్లకు కష్టాలు తప్పవా? అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఈ బినామీ రుణాల బాగోతం బయటపడనుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రికార్డుల్లో పేర్కొన్న ప్రకారం రుణం తీసుకున్నారా? లేదా? అని ఈనెల 16న రావివలస సొసైటీ వద్దకొచ్చి తమ ముందు చెప్పాలని నాలుగు రోజులుగా విచారణాధికారి, పార్వతీపురం డిప్యుటీ రిజిస్ట్ట్రార్ పి.చిన్నయ్య నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులందుకున్నాక రుణగ్రహీతలు ఆశ్చర్యానికిలోనై తాము అంత మొత్తంలో రుణం తీసుకోలేదని కొందరు, అసలు రుణమే తీసుకోలేదని మరికొందరు పీఏసీఎస్ వద్దకొచ్చి అధికారుల వద్ద మొర పెట్టుకుంటున్నారు.
ఈ బకాయిలను ఎవరు చెల్లిస్తారో చెప్పాలని పలువురు బాధితులు బుధవారం సీఈఓ సీహెచ్ సింహచలాన్ని నిలదీశారు. సెంటు భూమి లేనివారి పేరున రూ. 75 వేలు, ఒకే ఇంటిలో కుటుంబ సభ్యులందరి పేరున చెరో రూ. 75 వేలు, చనిపోయిన వారి పేరున రూ.75 వేలు, వలస వెళ్లినవారి పేరున రూ.75 వేలు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. ఇలా రుణ గ్రహీతల జాబితాలో ఉన్న వారంతా తిరగబడుతున్నారు. దీంతో గ్రామంలో కలకలం రేగింది. ఇప్పటి వరకు రుణగ్రహీతల వివాదమే నడుస్తుండగా ఇప్పుడా వివాదానికి కారకులగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డెరైక్టర్ల వంతు వచ్చింది.
సొసైటీ ప్రతినిధుల ఆస్తుల క్రయ,విక్రయాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్
సెక్షన్ 51ప్రకారం విచారణ జరుగుతున్న నేపథ్యంలో వాస్తవమేంటో తేలనుంది. ఒకవేళ బినామీ రుణాలు తీసుకోవడం వాస్తవమని తేలితే బాధ్యులైన వారిపై ఆర్థిక పరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణాధికారి చిన్నయ్య మరిన్ని చర్యలు తీసుకున్నారు. బినామీల రుణాల ఆరోపణల నేపథ్యంలో 2012కి ముందు, 2012తర్వాత రావివలస సొసైటీ పాలక వర్గం సభ్యులు, సిబ్బందికి సంబంధించిన ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లను నిలిపేయాలని పార్వతీపురం, కురుపాం సబ్ రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. డెరైక్టర్లగా పనిచేసి, పని చేస్తున్న 22 మందికి, సొసైటీలో పనిచేస్తున్న మరో ఐదుగురు సిబ్బందికి ఈ ఉత్తర్వులు వర్తింపచేశారు. ఆ సొసైటీ అధ్యక్షురాలు, ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ మరిశర్ల తులసీ, డెరైక్టర్లుగా కొనసాగిన దూడి గుంపస్వామి, మంత్రపూడి జగ్గునాయుడు, బొత్స అప్పలస్వామి, మర్రాపు సత్యనారాయణ, గుంట్రెడ్డి వెంకటనాయుడు,
గంటా తాతబాబు, ఏగిరెడ్డి రామునాయుడు, రెడ్డి అప్పలనర్సమ్మ, మూడడ్ల నాగమణి, అక్కెన కృష్ణంనాయుడు, గొట్టాపు శ్రీరాములు, మారుకొండ సీతంనాయుడు, మరిశర్ల అప్పలనాయుడు, గుంట్రెడ్డి సూర్యప్రభావతి, కుప్పిలి బంగారమ్మ, గుల్ల సూర్యనారాయణ, వానపల్లి సత్యనారాయణ, గాడి అప్పల స్వామినాయుడు, ముడిద అప్పలనర్సమ్మ, గంటా రత్నాలమ్మ, జామి రమణమ్మలకు సంబంధించిన ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు చేయరాదని సబ్ రిజిస్ట్రార్‌లను కోరారు. సొసైటీ ముఖ్య కార్య నిర్వాహక అధికారి చింతల సింహాచలం, అకౌంటెంట్ గొల్లపల్లి ముసలినాయుడు, గుమస్తాలు మర్రాపు వేణుగోపాలనాయుడు, గంటా మాధవనాయుడు ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు కూడా విచారణ ముగిసే వరకు నిలిపేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు అసిస్టాంట్ రిజిస్టార్ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.
ఆస్తులపై ఆరా
డెరైక్టర్లగా పని చేసి, పని చేస్తున్న 22 మందితో పాటు ఐదుగురు సిబ్బంది ఆస్తులపై కూడా ఆరా తీస్తున్నారు. వారికి ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ మేరకు గరుగుబిల్లి తహశీల్దార్‌కు విచారణాధికారి ప్రత్యేక లేఖ రాశారు. తాము సూచించిన వ్యక్తుల స్థిర, చరాస్థులకు సంబంధించిన వివరాలు సమర్పించాలని కోరారు. ఆ మేరకు ఆస్తులపై నిఘా పెట్టి, ఒక వేళ బాధ్యులని తేలితే ఆర్థిక పరమైన చర్యలు తీసుకోనున్నారు.