డీసీసీబీలో బయోమెట్రిక్ విధానం
Published Tue, Jan 7 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
బోట్‌క్లబ్ (కాకినాడ), న్యూస్‌లైన్ : జిల్లాలో ఉన్న 46 బ్రాంచిల్లోనూ బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా తెలిపారు. స్థానిక డీసీసీబీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న డీసీసీబీ బ్రాంచిల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానున్నట్టు చెప్పారు. దీని వల్ల సిబ్బంది ఎప్పుడెప్పుడు విధులకు హాజరవుతున్నారు తెలుసుకునే వీలుంటుందన్నారు. ఆలస్యం గా వస్తే వారి జీతాల్లో కోత పడుతుందన్నారు. ప్రతి బ్రాంచిలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకినాడలో ఉంటూ బ్రాంచిల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు.
జిల్లాలో కొత్తగా ఐదు డీసీసీబీ బ్రాంచిలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. కాకినాడ నగరంలో భానుగుడి, గాంధీనగర్, కరప, గొల్లప్రోలు, ఏజెన్సీలో మరో బ్రాంచి ఏర్పా టు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే సఖినేటిపల్లి, అంబాజీపేట, రాజమండ్రి, కొత్తపల్లి, రంపచోడవరంలో కొత్త బ్రాంచి లుప్రారంభించామన్నారు. సిబ్బందికి ఏకరూప దుస్తులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సీఈవో స్థాయి నుంచి బాంకులో పనిచేసే మెసెంజర్ వరకూ ఈ దుస్తులు అందజేస్తామన్నారు. వారి స్థాయిని బట్టి ఈ ఏక రూప దుస్తులు ఇవ్వనున్నట్టు చెప్పారు. సహకార రుణాలు వసూళ్లపై దృష్టి సారించామన్నారు. సిబ్బంది కేవలం బ్యాంకులకే పరిమితం కాకుండా ఇకపై రుణాలు వసూలు చేసే విధంగా షెడ్యూల్ తయారు చేయనున్నట్టు వివరించారు.
Advertisement
Advertisement